వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలింపిక్స్‌ క్రీడలను భారత్ ఎందుకు నిర్వహించడం లేదు? ఆతిథ్య నగరాన్ని ఎవరు నిర్ణయిస్తారు.. 2048 ఒలింపిక్స్ భారత్‌లోనేనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు

యూరప్‌లోని చిన్నచిన్న దేశాలలోని నగరాలు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చాయి. అమెరికాలో అయితే అనేక నగరాల్లో ఒలింపిక్స్ జరిగాయి. లండన్, లాస్‌ఏంజెలస్, పారిస్ వంటి నగరాల్లో మూడేసి సార్లు సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి.

దేశాలపరంగా చూస్తే ఎక్కువసార్లు ఈ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది అమెరికా.

జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి ఆసియా దేశాలు కూడా ఈ క్రీడలను నిర్వహించాయి.

కానీ, భారత్‌లో మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాలేదు. అంతేకాదు.. మరో పదేళ్లు అంటే 2032 వరకు కూడా భారత్‌లోని ఏ నగరంలోనూ నిర్వహించే అవకాశం లేదు. కారణం.. 2032 వరకు వేదికలు నిర్ణయమైపోవడమే.

ప్రస్తుతం టోక్యోలో జరుగుతున్నది 2020 ఒలింపిక్స్ కాగా 2022 ఒలింపిక్స్ మన పొరుగుదేశమైన చైనాలోని బీజింగ్‌లో, 2024లో ఫ్రాన్స్‌లోని పారిస్, 2026లో ఇటలీలోని మిలన్‌, 2028లో అమెరికాలోని లాస్‌ఏంజెలస్‌లో, 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఈ ప్రపంచపు అతిపెద్ద క్రీడా వేడుక నిర్వహించేందుకు నిర్ణయమైపోయింది.

కేజ్రీవాల్

2048లో దిల్లీ‌లో నిర్వహించేందుకు ప్రయత్నాలు

స్వతంత్ర భారత్ వందేళ్లు పూర్తిచేసుకున్నాక 2048లో జరగబోయే ఒలింపిక్స్‌ను దిల్లీ నగరానికి రప్పించాలని ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ కోరుకుంటున్నారు.

2021-22 సంవత్సరానికి దిల్లీ రాష్ట్రం 2021 మార్చి నెలలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లోనూ ఈ అంశం చేర్చారు.

2048లో జరగబోయే 39వ ఒలింపిక్ క్రీడలు దిల్లీలో నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రంలోని క్రీడా మౌలిక వసతులు, క్రీడావాతావరణం పెంపొందించేందుకు ఇప్పటి నుంచే ప్రాధాన్యం ఇస్తున్నామని దిల్లీ ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియా తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ఒలింపిక్స్ స్థాయి వసతుల కల్పనకు అవసరమైన అన్నీ చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు.

కేజ్రీవాల్ ఒక్కరే కాదు దేశంలోని మరికొందరు నేతలూ వివిధ సందర్భాలలో ఇలాంటి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

చంద్రబాబు, ఫడణవీస్, అమిత్ షా, కేజ్రీవాల్‌ల ఆశలు, ప్రయత్నాలు

సాధ్యాసాధ్యాలు, అర్హతలు, అనుకూలతలు, విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే భారత్‌లోని కొందరు నాయకులు వివిధ సందర్భాలలో తమతమ పాలనలో ఉన్న నగరాల్లో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆశ, ఆకాంక్ష కనబరిచారు.

చంద్రబాబు నాయుడు

2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆకాంక్షను వివిధ సందర్భాలలో కనబరిచారు.

2016లో విశాఖపట్నంలో ప్రోకబడ్డీ పోటీల ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించడం తన ఆశయం అని చెప్పారు.

అలాగే 2018లో విజయవాడలో మారథాన్ పోటీల ప్రారంభ సందర్భంలోనూ ఆయన అదే ఆకాంక్ష వ్యక్తం చేశారు.

అరవింద్ కేజ్రీవాల్

భారత్‌లోని ఒక నగరంలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ఆలోచన కలిగించింది ఆమ్‌ఆద్మీ పార్టీ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. 2015లోనే ఆయన ఈ దిశగా ఒక ప్రయత్నం చేశారు.

2024 ఒలింపిక్స్ దిల్లీలో నిర్వహించేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించారు. ఐఓసీ దృష్టికీ తీసుకెళ్లారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు థామస్ బచ్ 2015లో భారత్ వచ్చినప్పుడు ఇండియా ఇంకా ఒలింపిక్స్‌కు సిద్ధంగా లేదని అన్నారు.

200 దేశాల నుంచి 10 వేల అథ్లెట్లు వస్తారని.. 2024లో భారత్ ఆతిథ్యం ఇవ్వలేదని బచ్ అన్నారు. దాంతో కేజ్రీవాల్ ప్రయత్నాలు అక్కడికి ఆగిపోయాయి.

https://www.youtube.com/watch?v=j13ZzmBM57s

దేవేంద్ర ఫడణవీస్

2018లో అప్పటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్ కూడా ఇలాంటి ఆకాంక్షనే వ్యక్తం చేశారు.

ఆయన మరింత బలంగా దీన్ని ఏకంగా 2018లో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బచ్ భారత పర్యటన సమయంలో చెప్పారు.

2032లో ముంబయి ఒలింపిక్స్ నిర్వహణ కోసం బిడ్ వేస్తుందన్నారు.

ఫడణవీస్ ప్రతిపాదనకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ), ఐఓసీ అప్పటి సభ్యురాలు నీతా అంబానీ, అప్పటి క్రీడా మంత్రి కిరణ్ రిజిజుల నుంచి మద్దతు లభించింది. ఐఓసీ వద్దకు ప్రతిపాదన కూడా పంపించారు.

అయితే, 2021లో ఐఓసీ దీనిపై స్పష్టత ఇచ్చేసింది. 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంతో సంప్రదింపులు ప్రారంభించామని వెల్లడించింది. దీంతో ముంబయిలో నిర్వహణ ప్రయత్నాలు ప్రస్తుతానికి ఆగిపోయాయి.

మోదీ, అమిత్ షా

అమిత్ షా

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభ సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒలింపిక్స్‌ను ప్రస్తావించారు.

ఒలింపిక్స్ వంటి క్రీడలు నిర్వహించేందుకు ఈ కాంప్లెక్స్‌ను మరింత డెవలప్ చేయాలన్నారు.

అనంతరం ఈ ఏడాది జూన్‌లో 'అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ' పత్రికలలో ఒక ప్రకటన ఇచ్చింది.

సమ్మర్ ఒలింపిక్స్ నిర్వహించే స్థాయి అందుకునేందుకు అహ్మదాబాద్ నగరం, గుజరాత్ రాష్ట్రానికి ఇంకా ఏం కావలనేది తేల్చే 'గ్యాప్ అనాల్సిస్' చేయడానికి కన్సల్టెన్సీలు కావాలన్నది ఆ ప్రకటన సారాంశం.

ఐఓపీ ప్రెసిడెంట్ థామస్ బాచ్(కుడివైపు)

ఇంతకీ ఒలింపిక్స్ ఆతిథ్య నగరాన్ని ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు?

ఒలింపిక్స్ నిర్వహించే నగరాన్ని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఆసక్తి చూపిన నగరాల నుంచి వివిధ దశలలో వడపోతల అనంతరం తుది జాబితా సిద్ధం చేస్తారు.

ఐఓసీ సభ్య దేశాల ప్రతినిధులు రహస్య బ్యాలట్ పద్ధతిలో ఓట్ వేసి ఎంపిక చేస్తారు.

ఐఓసీ గౌరవ సభ్యులు, సస్పెండైన మెంబర్లకు ఓటు హక్కు ఉండదు.

ప్రస్తుతం ఐఓసీలో 102 మంది సభ్యులున్నారు. భారత్ నుంచి నీతా అంబానీ సభ్యురాలిగా ఉన్నారు.

ఒలింపిక్స్ జరిగే సంవత్సరానికి కనీసం ఏడేళ్ల ముందే ఆతిథ్య నగరాన్ని నిర్ణయిస్తారు. 2032 ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహిస్తారనేది ఈ ఏడాది (2021) ఐఓసీ ప్రకటించేసింది. అంటే సుమారు 11 ఏళ్ల ముందే నిర్ణయించింది. 2024, 2028 ఒలింపిక్స్ ఆతిథ్య నగరాలను 2017 సెప్టెంబరు 21నే నిర్ణయించేశారు.

https://www.youtube.com/watch?v=N1e0DRhT5zQ

ఆతిథ్య నగరంగా ఎంచుకోవడానికి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు.

ఆ నగరంలో ఉన్న క్రీడా సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలున్న స్టేడియంలు, ప్రాక్టీస్ కోసం ఇతర స్టేడియంలు అందుబాటులో ఉన్నదీ లేనిదీ చూస్తారు.

దాంతో పాటు వేల సంఖ్యలో వచ్చే అథ్లెట్లు, వారి సిబ్బంది, పర్యటకులు, జర్నలిస్టులకు వసతి, ఇతర సదుపాయల కల్పన, రవాణా సదుపాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే నగరం 1.5 లక్షల డాలర్ల రుసుం చెల్లించాలి.

https://www.youtube.com/watch?v=TvICWoDrBAk

మూడు దశల్లో వడపోత, చివరకు ఎన్నిక

మొదట ఇన్విటేషన్ ఫేజ్ ఉంటుంది. అందులో వివిధ దేశాల ఒలింపిక్ కమిటీలు తమ దేశంలో ఆసక్తి చూపుతున్న నగరాల బిడ్‌లను ఐఓసీ ముందుకుతెస్తాయి.

ఆ తరువాత మూడు దశలుంటాయి. అవి 1) విజన్, గేమ్స్ కాన్సెప్ట్, లెగసీ 2) గవర్నెన్స్, లీగల్ అండ్ వెన్యూ ఫండింగ్ 3) గేమ్స్ డెలివరీ, ఎక్స్‌పీరియన్స్ అండ్ వెన్యూ లెగసీ.

ఆయా నగరాలకు ఈ మూడు అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలి.

ఐఓసీ ఎవల్యూషన్ కమిషన్ ప్రతి దశకు సంబంధించి ఆయా నగరాలలో పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించి బేరీజు వేస్తుంది.

అనంతరం ఎవల్యూషన్ కమిషన్ కొన్ని నగరాల పేర్లతో తుది నివేదికను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు సమర్పిస్తుంది.

ఆ తుది జాబితాలోని అభ్యర్థిత్వ నగరాల నుంచి ఎంపిక చేసేందుకు ఓటింగ్ నిర్వహించి నిర్ణయిస్తారు.

https://www.youtube.com/watch?v=haMe7Qf3yk4

ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చవుతుంది?

ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనేది ఆతిథ్య నగరంలో అప్పటికే ఉన్న మౌలిక సదుపాయలను బట్టి ఉంటుంది.

కొత్తగా మౌలిక సదుపాయాలను నిర్మించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటే ఖర్చు అధికంగా ఉంటుంది.

ఐఓసీ నుంచి కూడా ఆర్థిక మద్దతు ఉంటుంది.

2016 సమ్మర్ ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన బ్రెజిల్‌లోని రియోడీజనిరో నగరానికి 153.1 కోట్ల డాలర్లను ఐఓసీ ఇచ్చింది.

అంతకుముందు 2012లో లండన్‌కు 137.4 కోట్ల డాలర్లు, 2008లో బీజింగ్‌కు 125 కోట్ల డాలర్లు, 2004లో ఏథెన్స్‌కు 96.5 కోట్ల డాలర్ల నిధులు సమకూర్చింది.

దిల్లీ నగరం

భారత నగరాలు ఎందుకు పోటీపడలేకపోతున్నాయి

భారత్‌లో క్రికెట్ ప్రపంచ కప్‌లు, హాకీ ప్రపంచ కప్, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్ క్రీడలు వంటి అంతర్జాతీయ పోటీలు సమర్థంగా నిర్వహించారు. కానీ, ఒలింపిక్స్‌కు వచ్చే సరికి భారత్ ఇంకా పోటీ పడే స్థాయిలో లేదని ఐఓసీ అధికారులే గతంలో వ్యాఖ్యానించారు.

* ఒలింపిక్స్ నిర్వహణకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

* ప్రపంచ దేశాల నుంచి వచ్చే వేలాది మంది క్రీడాకారులు, అనుబంధ రంగాల వారికి భద్రత కల్పించడం వంటివీ కీలకాంశాలే.

* వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించి 300కి పైగా ఈవెంట్లను నిర్వహించాలి. ఇందుకోసం పెద్దసంఖ్యలో వేదికలు అవసరం. పోటీలు నిర్వహించే వేదికలే కాకుండా అథ్లెట్ల ప్రాక్టీస్‌కు వేరే వేదికలు అవసరం.

* అంతేకాదు.. ఒలింపిక్ అధికారులు, అథ్లెట్లు, వారి కోచ్‌లు, రిఫరీలు, వివిధ దేశాల క్రీడా బృందాలతో వచ్చే అధికారులు, వారి వైద్యులు ఇలా.. అనేక రంగాలకు చెందిన వారు సుమారు 15 వేల మందికి అత్యున్నత స్థాయి వసతి కల్పించాల్సి ఉంటుంది.

* వీరే కాకుండా క్రీడలు చూసేందుకు లక్షలాది మంది విదేశాల నుంచి వస్తారు. ప్రస్తుత టోక్యో ఒలింపిక్స్ కోవిడ్ కారణంగా ప్రేక్షకులు లేకుండా సాగుతున్నప్పటికి ఇంతకుముందు 2016లో రియోలో జరిగిన పోటీలకు 5 లక్షల మంది ప్రేక్షకులు వచ్చారని అంచనా.

* అలాగే కొన్ని రకాల క్రీడలకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. ఆతిథ్య నగరాలకు ఆ సదుపాయం ఉండాల్సిన అవసరం ఉంటుంది.

ఉదాహరణకు రోయింగ్ వంటి క్రీడలకు రెండు కిలోమీటర్ల పొడవున నదీ ప్రవాహం ఉండాలి.

* ఇండియాకు గతంలో అంతర్జాతీయ క్రీడాపోటీలు నిర్వహించిన అనుభవం ఉండడం నిజమే అయినా ఒలింపిక్స్ స్థాయి అంతకంటే పెద్దది.

* ఐఓసీ నిబంధనల ప్రకారం కాలుష్యం, వేస్ట్ మేనేజ్‌మెంట్, పర్యావరణంపై ప్రభావం వంటి అంశాలనూ చూస్తారు.

ఇవి కూడా చదవండి:

https://www.youtube.com/watch?v=6ysGOg8nF14

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why is India not hosting the Olympics? Who will decide the host city
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X