నేను ఎందుకు ఖండించాలి: రేప్ వ్యాఖ్యలపై దేవెగౌడ
బెంగళూర్: అత్యాచారం కేసు దోషులకు ఉరిశిక్ష వేయకూడదనే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యలను ఖండించడానికి మాజీ ప్రధాని, జెడిఎస్ నేత హెచ్‌డి దేవెగౌడ నిరాకరించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించే హక్కు ములాయం సింగ్‌కు ఉందని, ప్రతి రాజకీయ పార్టీకి తమవైన అభిప్రాయాలుంటాయని, వాటిని తాను ఎందుకు ఖండించాలని ఆయన శుక్రవారంనాడు అన్నారు.
చివరగా సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. జెడిఎస్ లోకసభ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసే సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరణశిక్ష అంశం సుప్రీంకోర్టు వద్ద పెండింగులో ఉందని, దానిపై వ్యక్తులు నిర్ణయం తీసుకోలేరని, సుప్రీంకోర్టు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన అన్నారు.

అత్యాచార నేరాలు దేశ గౌరవాన్ని మంట కలుపుతాయని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా భారత ప్రతిష్టపై దెబ్బ పడుతోందని ఆయన అన్నారు. పార్లమెంటు తెచ్చిన చట్టం వల్ల కూడా అత్యాచారాలు తగ్గలేదని, ఆ సంఘటనలను అది అరికట్టలేకపోయిందని ఆయన అన్నారు.
అటువంటి అమానుషమైన నేరాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అందరం చర్చించాల్సి ఉంటుందని, ప్రపంచంలో భారత ప్రతిష్టను కాపాడాలని దేవెగౌడ అన్నారు.












Click it and Unblock the Notifications