భర్త సజీవదహనమవుతుంటే.. టీవీ చూస్తూ కూర్చుంది!
కోల్‌కతా: కట్టుకున్న భర్త ఓ వైపు మంటల్లో కాలిపోతూ ఉంటే.. తనకేమీ పట్టనట్లు తాపీగా టీవీ చూస్తూ గడిపిందో భార్య. అది కూడా పక్క గదిలోనే. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతాలోని మనిక్ తాలా గవర్నమెంట్‌కాలనీలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రంజిత్ కుమార్ బరాత్ (63), సుతపా బరాత్ (57)లు భార్యా భర్తలు. సీఈఎస్సీ అధికారిగా పదవీ విరమణ చేసిన రంజిత్, తన భార్యతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు.

మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో వారి బెడ్ రూం గదిలో నుంచి దట్టమైన పొగలను చూసిన ఇరుగు, పొరుగు వారు పోలీసులకు, ఫైరింజన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి భర్త ఓ గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండగా, మరో గదిలో లోపలివైపు నుంచి తలుపేసుకుని టీవీ చూస్తూ కూర్చుంది అతని భార్య.
తనను హత్య చేస్తాడన్న భయంతోనే గదిలో తలుపేసుకుని ఉన్నానని, గట్టిగా అరిచినా ఎవరూ రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. పోలీసులు మాత్రం ఈ ఘటన వెనుక పలు అనుమానాలు ఉన్నాయని చెబుతున్నారు. తమ దర్యాప్తులో ఇది హత్యా లేక ఆత్మహత్యా అన్న విషయం వెలుగులోకి వస్తుందని చెప్పారు. పోస్టుమార్టం తర్వానే రంజిత్ మరణం ఎలా సంభవించిందన్న విషయాన్ని తేలుస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications