హద్దు మీరితే మీ అంతు చూస్తాం: పాక్ కు భారత్ వార్నింగ్
న్యూఢిల్లీ: భవిష్యత్తులో కూడా పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోకి వచ్చి దాడులు చేస్తామని పాకిస్థాన్ ను భారత్ హెచ్చరించిందని వెలుగు చూసింది. వరుస ఉగ్రదాడులతో దేశం నెత్తురోడుతున్నా ఎన్నడూ ఎల్ వోసీని దాటని భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులతో పాక్ కు గట్టి గుణపాఠం చెప్పింది.
భారత్ లోకి ఉగ్రవాదులను పంపే ఆలోచనకు చెక్ పెట్టకపోతే మళ్లీ సరిహద్దు రేఖ (ఎల్ వోసీ) దాటి వచ్చి దాడులు చెయ్యడానికి ఏమాత్రం వెనకడుగు వేయ్యమని కేంద్ర ప్రభుత్వం పాక్ ను హెచ్చరించిందని సమాచారం.
భారత్ భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడుతున్నారని తెలిసినా, పీవోకేలో ఉగ్రవాద శిభిరాలు ఉన్నాయని తెలిసినా కచ్చితంగా నియంత్రణ రేఖ దాటి దాడులు చేస్తామని పాక్ కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

2004 జనవరి 4వ తేదిన అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి భారత మీద దాడులు చెయ్యమని, ఉగ్రవాదులను ప్రోత్సహించమనే ఒప్పందం మీద సంతకం చేశారు.
అయినా అనేక సంవత్సరాల నుంచి పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వచ్చింది. ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీదకు పంపిస్తుంది. ఇంతకాలం ఓపికతో ఉన్న భారత్ ఊరీ ఘటన తరువాత పీవోకేలోకి చొరబడి ఉగ్రవాదుల భరతం పట్టింది.
తమ ఓపికను నిస్సహాయతగా పాక్ భావిస్తే అది తప్పు అని తెలుసుకునేలా చేస్తామని పాక్ ను హెచ్చరించింది. పాక్ ప్రతీకార దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని సమాచారం రావడంతో భారత్ ఈ విధంగా హెచ్చరించిందని ఇంటిలిజెన్స్ అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications