హంగ్ ఏర్పడితే మళ్లీ ఎన్నికలకే.. ఎవరికీ మద్దతునివ్వం: కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ప్రధాని మోడీ ప్రభ తగ్గుతోందన్న విమర్శల నేపథ్యంలో.. కర్ణాటకలో బీజేపీ సత్తా చాటాల్సిన అనివార్యత నెలకొంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకి అంత ఆశాజనకంగా లేకపోవడం గమనార్హం.
కొన్ని సర్వేలు హస్తం పార్టీదే మెజారిటీది అని తేల్చేయగా.. మరికొన్ని సర్వేల్లో హంగ్ తప్పదని తేలింది. హంగ్ గనుక వస్తే.. జేడీఎస్(జనతాదళ్ సెక్యులర్) కింగ్ మేకర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. అయితే దీనిపై భిన్నంగా స్పందించారు జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి.

ఒకవేళ హంగ్ వస్తే గనుక.. మళ్లీ ఎన్నికలకు వెళ్తామే తప్ప అటు బీజేపీతోగానీ, ఇటు కాంగ్రెస్ తో గానీ కలిసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు తమ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ బీజేపీలతో పొత్తు ద్వారా అధికారంలోకి వస్తే అవి నెరవేర్చడానికి అవకాశం ఉండదని ఆయన అన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు తమ వెంటే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుందని, ఉత్తర కర్ణాటకలోని 60 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీల నుంచి గట్టి సవాల్ ఎదురవుతోందని అన్నారు. తాము 150 నుంచి 160 సీట్లపైనే ప్రధానంగా దృష్టి సారించామని, కచ్చితంగా ఆ స్థానాల్లో గెలుస్తామని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీకి తాము మద్దతునిచ్చినందునే కర్ణాటకలో ఆ పార్టీ ప్రధాన పార్టీగా మారిందన్నారు. బీఎస్పీతో పొత్తు వల్ల ఆ పార్టీకి ఉన్న 3శాతం ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందని తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!