తెలంగాణ ఫలితాలు ఏపీ రాజకీయాన్ని డిసైడ్ చేస్తాయా ? ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఎవరికి ?
గతం :గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రీఎంట్రీతో కేసీఆర్ ప్రాంతీయ సెంటిమెంట్ తో ఆ పోరును తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో గెలిచాక టీడీపీపై ఆగ్రహంతో ఆ పార్టీకి ఏపీలో ప్రత్యర్ధిగా ఉన్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి అండగా నిలిచారు. చంద్రబాబుకు రిటర్న్ గిప్ట్ ఇస్తామంటూ కేసీఆర్ తో పాటు ఆయన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఏపీ ఎన్నికల్లో వైఎస్ జగన్ కు అండగా నిలవడం ద్వారా
టీడీపీ దారుణ ఓటమికి ఓ కారణమయ్యారు.
వర్తమానం (telangana assembly election 2023):ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న 2023 ఎన్నికల్లో ఏపీ పార్టీలుగా చెప్పుకునే టీడీపీ, వైసీపీ జాడలేదు. టీడీపీ తాము 87 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించినా అంత సీన్ కనిపించడం లేదు. చివరికి వీలైన చోట్ల అభ్యర్ధుల్ని బరిలోకి దించి మిగిలిన చోట్ల బీజేపీకి అండగా నిలిచేందుకు, కుదిరితే కాంగ్రెస్ కు కూడా ఓట్లు వేయించేందుకు టీడీపీ పనికొచ్చేలా కనిపిస్తోంది. బహిరంగంగా ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగిన టీడీపీపై ఆంధ్రా సెంటిమెంట్ విమర్శలకు కేసీఆర్ కు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఈసారి రిటర్న్ గిఫ్ట్ పై చర్చే లేకుండాపోయింది.

భవిష్యత్తు:ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ముఖాముఖీ పోరు సాగుతోంది. ఇందులో బీజేపీ జాడ లేకుండా పోయింది. అలాగే బీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా తమ పాతబస్తీని దాటి హడావిడి చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్నింటికీ మించి కాంగ్రెస్ కు ఈసారి గెలుపు లాంఛనమే అన్నట్లుగా సర్వేలు కూడా వెలువడుతున్నాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు అరెస్టు ప్రభావం హైదరాబాద్ లో కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. వాటిని సీరియస్ గా అడ్డుకోలేని పరిస్దితి బీఆర్ఎస్ కు ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా వీటి విషయంలో మౌనంగా ఉంటోంది.
ఏపీపై తెలంగాణ ఫలితాల ప్రభావం:తెలంగాణలో ఈసారి ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్ధితులు చూస్తుంటే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే ఎప్పటిలాగే ఏపీలో వైసీపీకి అండగా నిలవడం ద్వారా మరోసారి ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. అలా కాకుండా తెలంగాణ పోరులో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పార్టీ బాస్ రేవంత్ రెడ్డి.. తన మాజీ బాస్ చంద్రబాబుకు అండగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు ఏపీలో వైఎస్ జగన్ కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు కక్కుతున్నారు. దీంతో రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications