ఢిల్లీలో అంతే: యువతిని బాల్కనీలోంచి తోసేసిన ప్రేమోన్మాది
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తనతో పెళ్లికి అంగీకరించలేదనే కోపంతో యువకుడు ఓ యువతిని భవనం బాల్కనీలోంచి తోసేశాడు. ఓ దుర్మార్గుడు నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఓ యువతిని మంగళవారం ఉదయం 22సార్లు కత్తితో పొడిచి చంపిన విషయం మరిచిపోక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం - అమిత్ అనే ఓ వ్యక్తి అతని సోదరితో కలిసి నగరంలోని అవంతిక ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించాడు. తనతో పెళ్లికి అంగీకరించాలంటూ యువతిపై, ఆమె కుటుంబసభ్యులపై వారు దాడికి దిగారు. నిరుద్యోగి అయిన అతడితో పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన యువకుడు యువతిని బాల్కనీలోంచి కిందకు తోసేశాడు.
నిందితుడిని చుట్టుపక్కల వారు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానిక బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని విచారించారు.

రెండేళ్ల క్రితం తామిద్దరూ ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యామని, అది ప్రేమగా మారిందని చెప్పాడు. అయితే అతడి గురించి విచారణ చేసిన యువతి తల్లిదండ్రులు అతడికి ఉద్యోగం లేదని తెలిసి పెళ్లికి అంగీకరించలేదని తెలుస్తోంది. యువతి తన వద్ద రూ.లక్ష తీసుకుందని అవి తిరిగి ఇవ్వమని అడగడానికే వారి ఇంటికి వెళ్లానని అమిత్ చెప్తున్నాడు.
డబ్బు తిరిగి ఇవ్వలేక తనపై నింద మోపుతూ యువతే బాల్కనీలోంచి దూకేసిందంటూ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ సంఘటన కన్నా ముందే యువతి తల్లిదండ్రులు అమిత్ తమను బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కోలుకున్నాక ఆమె వాంగ్మూలం తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications