తెలంగాణలో 2 రోజులపాటు దంచికొట్టనున్న వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రేపు కూడా రోజంతా ఆకాశం మేఘావృతమై ఉండి వర్షం పడే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్, కొమ్రుం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లో 64.5 మిల్లీమీటర్ల నుంచి 115. 5 మిల్లీ మీటర్ల వరకూ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, సనత్ నగర్, కృష్ణా నగర్, ఫిలిం నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, పంజాగుట్ట, ఎస్ ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. అలాగే సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, ఆల్వాల్ ప్రాంతాల్లోనూ వర్షం బీభత్సంగా కురుస్తోంది. ఎక్కడికక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అప్రమత్తం అయ్యాయి. ప్రస్తుతం నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో అధికారులు నీటి తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications