భయానకం: రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం వద్ద డ్రమ్ములో మహిళ మృతి, కుళ్లిన స్థితిలో..
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని 1వ నెంబర్ ఫ్లాట్‌ఫాం వద్ద ఓ మృతదేహాన్ని గుర్తించడం కలకలం రేపింది. బుధవారం రైల్వే స్టేషన్ ను శుభ్రం చేసే సిబ్బంది డ్రమ్మును గుర్తించారు. అందులోంచి దుర్వాసన వస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఫ్లాట్‌ఫాం నెంబర్ 1 వద్ద డ్రమ్ములో పరిశీలించగా.. అందులో ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు వివరాలను బెంగళూరు డివిజన్ అదనపు డీఆర్ఎం కుసుమా హరిప్రసాద్ తెలిపారు. డ్రమ్ములో మృతదేహంపై బట్టలు కప్పిఉన్నాయని పోలీసులు చెప్పారు.

అయితే, పాలిథీన్ కవర్‌లో ఆమె శవాన్ని చుట్టి ఆ తర్వాత డ్రమ్ములో కుక్కినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆ ప్రాంతంలో ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. కాగా, మృతిచెందిన మహిళ వయస్సు సుమారు 20 ఏళ్లకుపైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఆ మృతదేహం ఎవరిదనే విషయంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఐదు రోజుల క్రితమే మహిళను హత్య చేసి.. డ్రమ్ములో కుక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి సీసీటీవీ ఫుటేజీలని పరిశీలిస్తున్నారు. కాగా, స్థానికంగా ఆ ఘటన కలకలంగా మారింది.












Click it and Unblock the Notifications