లోక్ సభలో మహిళా బిల్లు చర్చ-ప్రపంచానికి మార్గదర్శి అన్న కేంద్రం-ఆ రిజర్వేషన్లు కావాలన్న సోనియా..
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లును నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. ఇవాళ ఇరు సభల్లోనూ చర్చను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తూ చేపడుతున్న 128వ రాజ్యాంగ సవరణపై చర్చ ప్రారంభిస్తున్నట్లు న్యాయమంత్రి ప్రకటించారు.
లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు తీసుకురావడానికి ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లు 2023పై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ... మహిళా సాధికారతలో ఈ బిల్లు ప్రపంచానికే ఓ ముఖ్యమైన దశ , దిశను చూపించబోతుందన్నారు. మహిళా సమానత్వంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందని.. మహిళా సాధికారతకు ఈ బిల్లు కీలకమని మేఘ్వాల్ తెలిపారు.

అనంతరం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చర్చను ప్రారంభించిన ఆ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ .. స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళలు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ బిల్లును మొదట తన భర్త, దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారని ఆమె గుర్తుచేశారు. సభలో బిల్లు ఆమోదం పొందితే రాజీవ్ గాంధీ కల నెరవేరుతుందన్నారు.మహిళలు ఇప్పటికే దీని కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తోందన్నారు.

మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుపై వ్యక్తమవుతున్న ఆందోళనలపైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక ప్రస్తావన చేశారు. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఈ బిల్లులో రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తక్షణమే కుల గణన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లు మరింత మెరుగ్గా అమలు కావాలంటే కుల గణన అవసరమని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఓబీసీలను చేర్చాలని ఆమె కోరారు.












Click it and Unblock the Notifications