Madhya Pradesh-Chhattisgarh: మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ జైత్రయాత్ర వెనుక మహిళా ఓటర్లు ?
ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలతో దూసుకుపోతోంది. గతంతో పోలిస్తే ఇరు రాష్ట్రాల్లోనూ సీట్లు భారీగా పెంచుకోవడంతో పాటు ఛత్తీస్ ఘడ్ లో విజయాన్ని సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ సైతం ఊహించని స్ధాయిలో ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ సాధిస్తున్న విజయాల వెనుక మహిళా ఓటర్లు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గత ఎన్నికలతో పోలిస్తే మధ్యప్రదేశ్ తో పాటు ఛత్తీస్ ఘడ్ లోనూ మహిళల ఓట్లు భారీగా పోలయ్యాయి. గతంలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్ ఘడ్ లో 74 శాతం మహిళా ఓట్లు పోలయితే.. ఈసారి అది 76 శాతానికి చేరింది. అలాగే మధ్యప్రదేశ్ లోనూ 2018లో జరిగిన ఎన్నికల్లో 74 శాతం మహిళా ఓట్లు పోలయితే ఈసారి అక్కడా 76 శాతం మహిళా పోలింగ్ నమోదైంది. ఇదే ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కొంపముంచినట్లు తెలుస్తోంది.

అయితే ఇంత పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు మధ్యప్రదేశ్ లోనూ, గతంలో ఆ రాష్ట్రంలో భాగంగా ఉండి ఆ తర్వాత విడిపోయిన ఛత్తీస్ ఘడ్ లోనూ బీజేపీకి మద్దతుగా నిలవడం వెనుక ఆ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీలకు తోడు మహిళా బిల్లు ప్రభావం కూడా పడినట్లు తెలుస్తోంది. మహిళలకు గ్యాస్ బండల ధర తగ్గింపు, ఇతర మహిళా కేంద్రక పథకాలు ప్రకటించిన బీజేపీ ఆ మేరకు ఫలితాలను రాబట్టుకుంది. అయితే కాంగ్రెస్ కూడా దాదాపు ఇలాంటి హామీలే ఇచ్చినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇస్తున్న హామీలు మహిళా ఓటర్లను ఎక్కువగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications