World Cup 2023: రోహిత్ ఒక్కడికే అది సాధ్యం- సెహ్వాగ్
ముంబై: ఇంకొద్దిరోజుల్లో ఐసీసీ వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. ఇది 13వ ఎడిషన్ వరల్డ్ కప్. ఈ మెగా టోర్నమెంట్ కోసం క్రికెట్ ఆడే అన్ని దేశాలు సన్నద్ధమౌతోన్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌తో తీరిక లేని షెడ్యూల్స్‌ను ఎదుర్కొంటోన్నాయి. ఇప్పటివరకు 12 టోర్నమెంట్లు ముగియగా.. అత్యధికంగా ఆస్ట్రేలియా అయిదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ టోర్నీలో భాగంగా అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. 14వ తేదీన జరిగే తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోన్న నేపథ్యంలో- టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. జట్టుపై తన అంచనాలను వెల్లడించాడు. సెమీ ఫైనల్స్ వరకూ భారత్ దిగ్విజయంగా వెళ్లగలుగుతుందని వివరించాడు. ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు భారత్‌కే ఉన్నాయనీ జోస్యం చెప్పాడు సెహ్వాగ్.
జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ.. ఈ వరల్డ్ కప్‌లో కూడా అత్యధిక పరుగులు చేస్తాడని సెహ్వాగ్ అంచనా వేశాడు. భారత్ పిచ్‌లన్నీ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, హోమ్ గ్రౌండ్స్ కావడం రోహిత్‌కు కలిసి వచ్చే అంశాలుగా విశ్లేషించాడు. పైగా ఓపెనర్ కావడం వల్ల చివరి ఓవర్ వరకూ ఆడే అవకాశం అతనికి అదనంగా ఉంటుందని, పరుగుల వరదను పారించగలుగుతాడనీ సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చాలామంది ఓపెనర్లు ఈ వరల్డ్ కప్‌లో రాణించే అవకాశం ఉందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. భారతీయుడిని కాబట్టి.. అత్యధిక పరుగులు చేయగలిగే సామర్థ్యం ఉన్న బ్యాటర్‌గా భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మను ఎంపిక చేసినట్లు వివరించాడు. వరల్డ్ కప్ వచ్చిందంటే రోహిత్ శర్మ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంటుందని, ఈ సారి అతనే కేప్టెన్‌గా వ్యవహరిస్తోండటం వల్ల అత్యధిక పరుగులు చేయడాన్ని బాధ్యతగా భావిస్తాడని అన్నాడు.
2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన వరల్డ్ కప్‌లోనూ రోహిత్ శర్మ చెలరేగిన విషయం తెలిసిందే. మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన హిట్ మ్యాన్ 648 పరుగులు చేశాడు. ఏకంగా అయిదు సెంచరీలను సాధించాడు. ఆ టోర్నమెంట్‌కు అతనే హయ్యెస్ట్ స్కోరర్. బ్యాటింగ్ యావరేజ్ 81గా నమోదైంది.












Click it and Unblock the Notifications