వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ జల దినోత్సవం: గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
గోదావరి నీళ్లు

దేశంలోని ప్రధాన నదుల్లో గోదావరి కూడా ఒకటి. దీన్ని 'దక్షిణ గంగ’ అని కూడా పిలుచుకుంటారు. ఆ గంగా నదిలాగే గోదావరి కూడా కాలుష్యం కోరల్లో చిక్కుకుంటోంది.

కాలుష్యం సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం కూడా స్పందించింది. నదీ జలాల పరిరక్షణకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రాజెక్టులో గోదావరిని కూడా చేర్చారు.

పారిశ్రామిక వ్యర్థాలను, వివిధ పట్టణాల నుంచి వస్తున్న మురికినీరు నదిలో కలవకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.

గతంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసిన ప్రయత్నాలు కూడా ప్రస్తుతం మరుగునపడిపోయాయి.

తాగడానికి కాదు కనీసం స్నానం చేయడానికి, వ్యవసాయానికి కూడా పనికిరాని స్థితిలో గోదావరి నీటి ప్రమాణాలు ఉన్నాయంటే సమస్య తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు.

గోదావరి నీళ్లు

సమస్య ఏంటి?

నదీ జలాలు వినియోగానికి అనువైనవా, కాదా అన్నది నిర్ణయించేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కొన్ని ప్రమాణాలను నిర్ధారించింది.

100 మిల్లీగ్రాముల నీటిలో డిజాల్వ్డ్ (కరిగిన) ఆక్సీజన్ 5 మి.గ్రా. లోపు ఉంటే అది స్నానానికి అనుకూలమని నిర్ణయించారు. కానీ 2020 నవంబర్‌లో ధవళేశ్వరం వద్ద సేకరించిన శాంపిల్‌లో అది 5.4 మిల్లీగ్రాములుగా ఉంది. డిసెంబర్‌లో అది 5.1 మిల్లీగ్రాములుగా ఉంది.

ఇక పీహెచ్ శాతం 6 నుంచి 8 లోపు ఉంటే నీరు వ్యవసాయ అవసరాలకు అనువుగా ఉన్నట్టు అని ధవళేశ్వరంలోని జల పరిశోధనశాల అధికారులు తెలిపారు. కానీ గత ఏడాది చివరి ఆరు నెలల్లో రెండుసార్లు గోదావరి నీళ్ల పీహెచ్ శాతం ఎనిమిది దాటి పోయింది.

రాజమహేంద్రవరం వద్ద సేకరించిన శాంపిల్‌లో 2020 డిసెంబర్‌లో అది 8.64 శాతంగా ఉంది.

ఈ సమాచారం ప్రకారం గోదావరి నీరు తాగడం మాట అలా ఉంచితే వ్యవసాయ అవసరాలు, స్నానం చేసేందుకు కూడా తగని విధంగా ఉంటోందని స్పష్టమవుతోంది.

గోదావరి నీళ్లు

ఎందుకిలా...

ప్రవాహం పొడవునా అనేక చోట్ల పారిశ్రామిక వ్యర్థాలతో పాటుగా పట్టణాల మురుగునీటిని కూడా గోదావరి నదిలోకే వదులుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

భద్రాచలం సమీపంలో ఉన్న ఐటీసీ కంపెనీ నుంచి వ్యర్థాలను నేరుగా గోదావరిలోకి వదులుతున్న దృశ్యాలు బీబీసీ కంటపడ్డాయి. బహిరంగంగానే ఈ ప్రక్రియ సాగుతోంది.

నిబంధనల ప్రకారం వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వృథా నీటిని నదిలోకి వదలాల్సి ఉంటుంది.

భద్రాచలం పట్టణానికి ఎగువన నది నుంచి నీటిని తీసుకుని, వాటిని పరిశ్రమ అవసరాలకు వినియోగించిన తర్వాత రసాయన మిళితమైన వ్యర్థాలను బూర్గంపహాడ్ దగ్గర నదిలో కలుపుతున్నారు.

వరదల సమయంలో వాటి ప్రభావం పెద్దగా కనిపించదు. కానీ నీటి లభ్యత తగ్గిపోతున్న కాలంలో నదీ జలాల్లో రసాయనాల తెట్టు పేరుకుపోయి ఆందోళనకరంగా కనిపిస్తోంది.

ఐటీసీ కంపెనీ మాత్రమే కాకుండా ఎగువన అనేక పరిశ్రమలు కూడా ఇదే పద్ధతి పాటిస్తున్నట్లు పర్యావరణవేత్తలు పలుమార్లు ప్రభుత్వాలకు ఫిర్యాదులు కూడా చేశారు.

అయితే, తాము శుద్ధి చేసిన తర్వాతే వ్యర్థాలను నదిలోకి వదులుతున్నామని ఐటీసీ కంపెనీ ప్రతినిధులు బీబీసీతో చెప్పారు.

రాజమహేంద్రవరం చేరువలోని ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు కూడా ఇదే పంథాలో సాగుతోంది.

నది మధ్యలో ఉన్న లంకల్లో చెరువులు తవ్వి అక్కడ నీటి ట్రీట్‌మెంట్ చేస్తున్నట్టు చెబుతోంది.

కానీ వరదల సమయంలో ఆ వ్యర్థాలన్నీ నదీ జలాల్లో కలిసిపోతున్నాయని పర్యావరణవేత్త పతంజలి శాస్త్రి బీబీసీతో అన్నారు.

''భారీ పరిశ్రమలు, ఇతర చిన్న పరిశ్రమల నుంచి కూడా వ్యర్థాలు ఎక్కువగా నదిలో కలిసిపోతున్నాయి. ఇది చాలాకాలంగా సాగుతోంది. ట్రీట్‌మెంట్ చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నా నమ్మకం కలగడం లేదు. వాస్తవం దానికి భిన్నంగా ఉంది. అయినా వాటిని నియంత్రించే చర్యలు సమగ్రంగా కనిపించడం లేదు. అరకొరగా కొంత ప్రయత్నం చేసి మధ్యలో వదిలేస్తున్నారు. ఫలితంగా గోదావరి కాలుష్యం పెరుగుతూనే ఉంది. దానిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించినా అందుకు చర్యలు తీసుకోవడం లేదు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.

గోదావరి నీళ్లు

ప్రభావం...

గోదావరి జలాల మీద ఆంధ్రప్రదేశ్‌లోనే కోటి మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ నగరానికి కూడా పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని తరలిస్తున్నారు.

ఈ నీటిలో కాలుష్యం పెరుగుతుండటంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని రాజమహేంద్రవరం వాసి కొల్లిమిల్లి రఘు బీబీసీతో అన్నారు. గోదావరి విషయంలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదని ఆయన అంటున్నారు. గోదావరి కాలుష్య నియంత్రణ కోసం రఘు కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టారు.

''ఇటీవల ఏలూరు సమీపంలో ప్రజలు ఒక్కసారిగా అస్వస్థతకు గురవ్వడం చూశాం. ఇలాంటి ఘటనలకు అసలు కారణాలు ఏమిటన్నది అధికారికంగా ప్రకటించకపోయినా... జల కాలుష్యం ముఖ్యమైన సమస్యగా అధికారులు గుర్తించారు. రాజమహేంద్రవరంలో మొత్తం మురికినీటిని నల్లా చానెల్ ద్వారా గోదావరిలో కలిపేస్తుంటారు’’ అని రఘు అన్నారు.

''దీనికి వ్యతిరేకంగా చాలా ఆందోళనలు జరిగాయి. చివరకు కొంత ఆగినా, నేటికీ మురుగు నీరు గోదావరిలో కలుస్తూనే ఉంది. ఫలితంగా దానికి 50 మీటర్ల దిగువన పుష్కర్ ఘాట్‌లో స్నానాలు చేసి, మరో 50 మీటర్ల దిగువన అదే నీటిని తాగునీటి అవసరాల కోసం తరలిస్తున్నారు. ఇది ప్రజల ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది. గతంలో కన్నా భిన్నంగా ఇప్పుడు చిన్న సమస్య వచ్చినా అన్ని పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభుత్వం సమస్య మీద శ్రద్ధ పెట్టడం లేదు. మేము గతంలో కొంత ప్రయత్నం చేశాం. కొద్దిగా ఫలితం కనిపించింది. కానీ ప్రజల్లో అవగాహన పెంచడం, ప్రభుత్వం బాధ్యతగా నియంత్రణ చేయడం అత్యవసరం. లేదంటే సమస్య తీవ్రమైన తర్వాత ఏం చేసినా పెద్దగా ఫలితం ఉండదు’’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

గోదావరి నీళ్లు

కాలువల్లోనూ వ్యర్థాలే

మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో ప్రారంభమైన గోదావరి 80 కిలోమీటర్ల తర్వాత నిజామాబాదు జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల గుండా ప్రవహించి భద్రాచలం దిగువన ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడుతుంది.

మొత్తం 1,465 కిలోమీటర్ల గోదావరి ప్రయాణం అత్యధికంగా సాగేది తెలంగాణలోనే. ఆ తర్వాతి స్థానం ఏపీది.

ఏపీలో నదీ పాయలతో పాటుగా డెల్టా కాలువల ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. వివిధ రకాల వ్యర్థాలు కాలువ పొడవునా ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు కూడా అంగీకరిస్తున్నారు.

ముఖ్యంగా ఆక్వా, పౌల్ట్రీ, ప్లాస్టిక్ వ్యర్థాలు సహా రైసు మిల్లులు, సాగో మిల్లుల నుంచి వృథా జలాలను నేరుగా కాలువల్లోకి తరలిస్తున్నారు. ఫలితంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో ఏటా సీజన్‌లో డయేరియా తీవ్రంగా ప్రబలుతోంది. పశ్చిమ గోదావరిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలున్నాయి.

ముఖ్యంగా కాలువల చివర ప్రాంతంలో నీటిని వినియోగించే వారిపై ఎక్కువ ప్రభావం పడుతోంది. దాంతో పాటుగా కాలువలను ఆనుకునే కొన్నిచోట్ల డంపింగ్ యార్డులు నిర్వహిస్తున్నారు.

గోదావరి జిల్లాల్లోనే 165 చోట్ల ఇలాంటి కాలుష్య సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు.

ధవళేశ్వరం సర్కిల్ ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ రామకృష్ణ దీనిపై బీబీసీతో మాట్లాడారు.

''పెద్ద పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ కాలువల్లోకి ఎక్కువ వ్యర్థాలు చేరుతున్నాయి. కాలుష్యం పెద్ద సమస్యగానే ఉంది. కాలుష్య నియంత్రణ మండలి సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. ప్రధాన నదీ జలాల వినియోగంలో పెద్ద సమస్యలు లేవు. కానీ దిగువన నీటి కాలుష్యం ఉంది. నదీ జలాల నాణ్యత పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

గోదావరి నీళ్లు

తగిన పరీక్షలూ లేవు

గోదావరి నదీ జలాల నాణ్యతపై సీపీసీబీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 19న విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించింది.

ఏపీలోని రెండు ప్రధాన నదుల్లో నీటి కాలుష్యం పెరగకుండా తగిన చర్యలు చేపట్టడం అవసరమని అని పేర్కొంది.

నీటి నాణ్యతను పరీక్షించేందుకు తగిన ఏర్పాట్లు కూడా కనిపించడం లేదు.

గోదావరిలో మూడుచోట్ల తీసుకున్న నీటి శాంపిళ్లను ధవళేశ్వరంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రయోగశాలలో నెలకు ఒకసారి పరీక్షిస్తున్నారు.

కోయిడ, రాజమహేంద్రవరం, ధవళేశ్వరం వద్ద సేకరించిన శాంపిళ్లలో 26 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం 16 పరీక్షలు జరుగుతున్నాయని రీసెర్చ్ ఆఫీసర్ రమణ బీబీసీకి తెలిపారు.

తాము కేవలం వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా నీటి ప్రమాణాలను పరీక్షిస్తున్నామని ఆయన తెలిపారు.

కాలుష్య నియంత్రణ బోర్డు పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ వివరాలు తమ వద్ద లేవని ఆ శాఖ తూర్పు గోదావరి జిల్లా అధికారులు బీబీసీకి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
World Water Day: Is Godavari waters not fit for bathing? How to solve the pollution problem
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X