రచయితపై ఎటాక్: ముఖానికి నల్లరంగు పూసి కొట్టారు!..
బైకుల మీద వచ్చిన ఆరుగురు యువకులు జనమంతా చూస్తుండగానే ఆయనపై దాడికి తెగబడి.. ముఖానికి నల్లరంగు పూసి అక్కడినుంచి పరారయ్యారు.
బెంగుళూరు: కర్ణాటక కల్చరల్ యాక్టివిస్ట్, రచయిత యోగేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బైకుల మీద వచ్చిన ఆరుగురు యువకులు జనమంతా చూస్తుండగానే ఆయనపై దాడికి తెగబడి.. ముఖానికి నల్లరంగు పూసి అక్కడినుంచి పరారయ్యారు. రచయిత దాడి తర్వాత దుండగులు 'జై శ్రీరామ్' నినాదాలు చేయడం గమనార్హం.
ఆదివారం నాడు ప్రముఖ పాత్రికేయుడు పి.లంకేష్ 82వ జయంతి ఉత్సవాలకు యోగేష్ హాజరవగా.. కార్యక్రమం అనంతరం బయటకు వస్తున్న సందర్బంలో ఈ దాడి చోటు చేసుకుంది. తనపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా.. ముఖానికి నల్లరంగు పులిమి, చొక్కా చించివేశారని యోగేష్ ఆవేదన చెందారు.

కార్యక్రమ అనంతరం బాపూజీ డెంటల్ కాలేజీ రోడ్డులోని ఒక టీ స్టాల్ వద్ద టీ తాగడానికి వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు యోగేష్ వివరించారు. ఘటనపై ప్రజాస్వామికవాదులు, పలువురు జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. పాత్రికేయుడు గౌరి లంకేష్, సీపీఐ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు సిద్దన్న గౌడ్ పాటిల్, కార్మిక నాయకులు ఘటనను తీవ్రంగా నిరసించారు.
ఘటనపై రచయిత యోగేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గతంలో యోగేష్ మాస్టర్ రచించిన 'దుంది కరణ్యకనోబ్బ గణపతియాదే కథ' పుస్తకం తీవ్ర దుమారం రేపింది. ఈ పుస్తకం వివాదానికి దారితీయడంతో నాలుగేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
పుస్తకం ద్వారా రచయిత యోగేష్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందుత్వ సంఘాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అప్పట్లో ఆయన్ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications