వర్షాలతో యూపీ అతలాకుతలం-యూపీ కేబినెట్ భేటీ-యోగీ కీలక ఆదేశాలు..
భారీ వర్షాలు యూపీని ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలకు ముంపు బారిన పడ్డాయి. అలాగే అకాల వర్షాలకు పంటలు కూడా మునిగిపోయాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్ధితిపై చర్చించేందుకు యూపీ కేబినెట్ భేటీ అయింది. ఇందులో రాష్ట్రంలో వర్షాల పరిస్ధితిపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంత్రులతో చర్చించారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
యూపీలో వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు వరద బారిన పడ్డాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేబినెట్ భేటీలో దీనిపై చర్చించిన యోగీ ఆదిత్యనాథ్ వారికి పరిహారం చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే వర్షం బారిన పడిన ప్రాంతాల్లో సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. వర్షం వల్ల కలిగిన నష్టాన్ని కూడా అంచనా వేయాలన్నారు. రైతులతో పాటు నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపు కోసం అంచనాలు పంపాలన్నారు.

యూపీలో భారీ వర్షాల కారణంగా పలు నదులు ఉప్పొంగుతున్నాయి.వీటిలో పలు నదులు ప్రమాద హెచ్చరికల్ని దాటిపోయాయి. దీంతో ఆయా నదుల వద్ద పరిస్ధితిని నిరంతరం సమీక్షించాలని యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్ధలను సరిచేయాలని సూచించారు. మొత్తంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని యోగీ ఆదిత్యనాథ్ అధికారుల్ని ఆదేశించారు.
రాష్ట్రంలో అసలే ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రజలకు వర్షాలతో కలిగే ఇబ్బందులు కూడా పెద్దవిగానే కనిపిస్తాయి. దీంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ వీటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ముఖ్యంగా రైతులకు తలెత్తే పంటనష్టంతో పాటు ఇతర ఇబ్బందుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని అధికారుల్ని కోరింది.












Click it and Unblock the Notifications