లక్నో-వారణాసి మధ్య విమానం ప్రారంభించిన యోగీ.. యూపీ రాజధాని నుంచి 25వ సర్వీస్..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పనుల్ని పరుగులు తీయిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఈ క్రమంలో మౌలిక సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవాళ రాజధాని లక్నో నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి విమాన సర్వీసును యోగీ ప్రారంభించారు. దీంతో రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ప్రారంభమైన 25వ దేశీయ సర్వీసుగా ఇది నిలిచింది. ఈ సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ ఎయిర్ పోర్టు నుంచి వారణాసికి నేరుగా ప్రయాణించే విమానాన్ని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ ప్రారంభించారు. ఆధ్యాత్మిక నగరం కాశీకి ఈ విమాన సర్వీసు ప్రారంభంతో కనెక్టివిటీ మరింత పెరుగుతుందని యోగీ తెలిపారు. ఈ విమాన సర్వీసు ద్వారా దేశీయ పర్యాటకం పెరగడటంతో పాటు అంతర్జాతీయంగా కాశీకి విదేశీయుల రాక కూడా పెరుగుతుందని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు.

యూపీలో ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించాలన్నది బీజేపీ ప్రభుత్వ కల అని యోగీ ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్నో,వారణాసి, కుషీనగర్ రూపంలో మూడు నగరాల్లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులు ఉన్నాయి. మరో రెండు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. అయోధ్య, జవార్ లో మరో రెండు ఎయిర్ పోర్టులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు.
లక్నో నుంచి ఇవాళ ప్రారంభమైన విమాన సర్వీసు ఇక్కడి నుంచి దేశీయంగా ప్రయాణించే 25వ విమాన సర్వీసు అని అధికారులు తెలిపారు. అలాగే లక్నోతో ఇప్పటికే 9 అంతర్జాతీయ విమానాశ్రయాలకు కనెక్టివిటీ ఉందన్నారు. లక్నో ఎయిర్ పోర్టు నుంచి ప్రస్తుతం రోజుకు 138 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే రోజుకు సగటు 17,700 మంది ప్రయాణిస్తున్నారు. గత ఏడాది కాలంలో లక్నో ఎయిర్ పోర్టులో మూడు ఎయిర్ లైన్ సంస్ధలు ఎయిర్ ఏషియా, అకాసా, థాయ్ ఎయిర్ ఏషియా సంస్ధలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు.












Click it and Unblock the Notifications