అతీక్ హత్య తర్వాత తొలిసారి ప్రయాగ్ రాజ్ కు యోగీ.. ప్రకృతి ఎవర్నీ వదలదంటూ..
యూపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెలలో రెండు దశల్లో జరిగే స్ధానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా యోగీ పలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హత్యకు గురైన మాజీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ స్వస్ధలం ప్రయాగ్ రాజ్ కు వెళ్లిన యోగీ.. ఆయన హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి ఎవర్నీ వదలిపెట్టదంటూ యోగీ వ్యాఖ్యానించారు.
అతిక్ అహ్మద్ స్వస్ధలం ప్రయాగ్ రాజ్ లో ఎన్నికల సభలో మాట్లాడిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అన్యాయం, దౌర్జన్యాలతో బాధపడుతున్న ప్రజలు న్యాయం కోసం వచ్చే ప్రయాగ్‌రాజ్‌ను కొందరు వ్యక్తులు అన్యాయం, దౌర్జన్యాల భూమిగా మార్చారని అతీక్ అహ్మద్ ను ఉద్దేశించి యోగీ వ్యాఖ్యానించారు. కానీ ప్రయాగ్ రాజ్ ఎవరిపైనా దౌర్జన్యానికి పాల్పడదని, అలాగే అంగీకరించదని అన్నారు.

ఏప్రిల్ 15న అతీక్, అతని సోదరుడు అష్రప్ బహిరంగ హత్యల తర్వాత విమర్శలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మాఫియాను లేకుండా చేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు. అప్పటి నుంచి స్ధానిక ఎన్నికల ప్రచారంలోనూ మాఫియా గురించి ప్రస్తావిస్తున్న యోగీ.. శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రథమ లక్ష్యమని చెబుతున్నారు. ఇవాళ ప్రయాగ్ రాజ్ లో నిర్వహించిన ప్రచారంలోనూ ఇదే అంశాన్ని యోగీ ప్రజలకు వివరించారు.
ఉత్తరప్రదేశ్‌లో జనం భయం, భయాందోళనల నీడలో పండుగలు చేసుకున్నారని, నేడు పండుగలు శాంతియుతంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు. నగరాల్లో ఈవ్ టీజర్ల భీభత్సం లేదని గుర్తుచేశారు. ఇవాళ మన నగరాలు సేఫ్ సిటీలుగా మారుతున్నాయన్నారు. బాలికలు సురక్షితంగా పాఠశాలకు వెళ్లవచ్చని, వ్యాపారవేత్తలు వ్యాపారం చేయవచ్చని, యువత చేతుల్లో తపంచాకు బదులుగా ట్యాబ్లెట్లు ఉన్నాయన్నారు.












Click it and Unblock the Notifications