యోగి 2.O: ప్రమాణ స్వీకారానికి అంబానీ, అదానీ: ఆ సినిమా యూనిట్: కంప్లీట్ లిస్ట్ ఇదే
లక్నో: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో వరుసగా రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పార్టీని విజయపథాన నడిపించిన యోగి ఆదిత్యనాథ్‌కే మరోసారి ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశాన్ని ఇచ్చింది బీజేపీ అధిష్ఠానం.

సొంతంగా 255 స్థానాలు..
ఉత్తర ప్రదేశ్‌లో ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనుండటం 37 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. 403 నియోజకవర్గాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 255 స్థానాలను గెలుచుకుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అవినీతి రహిత పరిపాలనను అందించడం, శాంతిభద్రతలను కాపాడటం, మహిళలకు రక్షణ కల్పించడం, విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు బీజేపీ విజయానికి బాటలు పరిచాయనే విశ్లేషణలు ఉన్నాయి.

తగ్గని ఛరిష్మా..
దీనికి తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఛరిష్మా.. బీజేపీకి విజయానికి కారణాలయ్యాయి. ఫలితంగా 41.29 ఓట్ల శాతంతో ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నారు కమలనాథులు. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోనున్న నేపథ్యంలో- యోగి ఆదిత్యనాథ్ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రమాణ స్వీకారోత్సవం ముగిసిన అనంతరం ఆయన చేసే ప్రసంగంపై అందరి దృష్టీ నిలిచింది. ప్రాధాన్యతాంశాల గురించి మాట్లాడటం ఖాయంగా కనిపిస్తోంది.

లక్నో.. కాషాయమయం..
ఈ సాయంత్రం 4 గంటలకు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటయింది. 80 వేల మంది నాయకులు, కార్యకర్తల కోసం స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. దీనికి అనుగుణంగా కుర్చీలు వేశారు. హాజరయ్యే వారి సంఖ్య మాత్రం లక్షకు పైగా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే లక్నో మొత్తం కాషాయమయం అయింది. యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను ముద్రించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు నగరం నిండా కనిపిస్తోన్నాయి. అన్ని ప్రధాన కూడళ్లల్లో భారీ బ్యానర్లను ఏర్పాటు చేశారు బీజేపీ నాయకులు.

బాలీవుడ్ సెలెబ్రిటీస్..
కాగా- ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు, సెలెబ్రిటీలు తరలి రానున్నారు. బీజేపీ సానుభూతిపరులుగా గుర్తింపు ఉన్న నటుడు అక్షయ్ కుమార్, నటి కంగనా రనౌత్, నిర్మాత బోనీ కపూర్ పాల్గొననున్నారు. ఈ మేరకు వారికి ఆహ్వాన పత్రాలు అందాయి. వారితోపాటు- లేటెస్ట్ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ది కాశ్మీర్ ఫైల్స్ యూనిట్ కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానుంది. ఈ సినిమాలో నటించిన అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, ఇతర నటీనటులకు ఆహ్వానం పంపించారు. వారందరూ ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు.

60 మంది బిగ్ షాట్స్..
పారిశ్రామిక రంగం నుంచి 60 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ, అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల ఛైర్మన్ గౌతమ్ అదాని వంటి పారిశ్రామికవేత్తలు ఈ జాబితాలో ఉన్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమారమంగళం బిర్లా, గోయెంకా గ్రూప్ అధ్యక్షుడు సంజీవ్ గోయెంకా, మహీంద్రా అండ్ మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్ర, హిరనందాని గ్రూప్ నుంచి దర్శన్ హిరనందాని, టోర్రెంట్ గ్రూప్ తరఫున సుధీర్ మెహతా, లూలూ గ్రూప్ నుంచి యూసుఫ్ అలీ, అభినందన లోధా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications