అందుబాటులో లేని గవర్నర్- సిద్ధరామయ్య రాజీనామాపై అనిశ్చితి?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం తుదిదశకు చేరుకుంది. నేడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నారని విస్తృతమైన ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. సీఎం మార్పు తథ్యం అనేది తేలిపోయింది.
నేడు సిద్ధరామయ్య రాజీనామా చేయాలని నిర్ణయించినా గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన బెంగళూరులో లేరు. కుటుంబ అత్యవసర పని నిమిత్తం ముంబై వెళ్లినట్లు చెబుతున్నారు. దీంతో రాజీనామా సమయంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. గెహ్లాట్ ముంబై నుండి తిరిగి బెంగళూరుకు రావడానికి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ కాలేదని ఇండియా టుడే తెలిపింది.

ఇదిలావుండగా.. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అందిన సమాచారం ప్రకారం సిద్ధరామయ్య ఈ ఉదయం 11 గంటలకు లోక్ భవన్ కు చేరుకుంటారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించాల్సి ఉంది. తాజాగా గవర్నర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి రాజీనామా ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
మరోవంక సిద్ధరామయ్య ఈ ఉదయం తన అధికారిక నివాసంలో అల్పాహార విందును ఏర్పాటు చేశారు. డీకే శివకుమార్ సహా మొత్తం కేబినెట్ సహచరులను ఆయన ఈ విందుకు ఆహ్వానించారు. అల్పాహార విందు తర్వాత వారందరితో కలిసి సిద్ధరామయ్య లోక్ భవన్ కు చేరుకోవాల్సి ఉంది. సిద్ధరామయ్య ఇచ్చే చివరి విందు ఇదే అవుతుంది.
కాగా.. డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి కాబోతోండటంతో ఆయన ఇంటి ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బారులు తీరారు. ఈ తెల్లవారు జాము నుంచే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వారంతా బెంగళూరుకు చేరుకుంటోన్నారు. సంజయ్ నగరలోని డీకే శివకుమార్ ఇంటి వద్ద గుమిగూడారు. డీకేశి సొంత నియోజకవర్గం కనకపుర నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు.
బుధవారం రోజంతా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా వంటి సీనియర్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి మార్పు వ్యవహారంపై కాంగ్రెస్ అధికారికంగా మౌనం వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రోజంతా మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులోని సిద్ధరామయ్య నివాసాన్ని సందర్శించారు. చాలామంది ఆయన్ని తన నిర్ణయాన్ని పునఃపరిశీలించమని ఒత్తిడి చేసినట్లు సమాచారం. సీఎల్పీ సమావేశంలో ఈ విషయాన్ని చర్చించాలని కూడా వారు ప్రతిపాదించారు. ఇటువంటి సూచనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించలేదని, పదవిని వదులుకోవడానికే సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications