ఢిల్లీ రాజ్ పథ్ తరహాలో అయోధ్య రోడ్లు-యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెల్లడి...
యూపీలో ఆధ్యాత్మిక నగరంగా రూపుదిద్దుకుంటున్న అయోధ్య అభివృద్ధి కోసం అక్కడి బీజేపీ ప్రభుత్వం రూ.32 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ స్ధాయిలో అన్ని సౌకర్యాలు అభివృద్ధి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులు సమకూరుస్తున్నాయి. ఇదే క్రమంలో అయోధ్యలో రోడ్లను ఢిల్లీలోని రాజ్ పథ్ తరహాలో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రకటించారు.
అయోధ్యకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అభివృద్ధి ప్రణాళికలను సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా వెల్లడించారు. మొత్తం రూ.32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈ నగరంలో రూపుదిద్దుకుంటున్నట్లు యోగీ తెలిపారు. అయోధ్యలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల స్థాయిని దేశంలోని మరే ఇతర నగరంతో పోల్చి చూడలేమన్నారు. అయోధ్య లక్షలాది ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని, ఇక్కడ జన్మించే అదృష్టం లేని వారు కూడా అవకాశాన్ని కోరుకుంటారన్నారు.

ప్రజల జీవితాల్లో శ్రీరాముడి ఉనికి బలంగా ఉందని, అయోధ్యలో రామాలయ నిర్మాణం వారి భక్తి, విశ్వాసానికి నిదర్శనమని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో మొదట్లో ఇబ్బందులు ఎదురవుతాయని, కానీ పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆదిత్యనాథ్ అన్నారు. ముఖ్యంగా అయోధ్య రహదారులపై సీఎం యోగి తన విజన్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఆరు నెలల్లో అయోధ్య వీధులు ఢిల్లీలోని ఐకానిక్ రాజ్‌పథ్‌లా తయారవుతాయన్నారు.
సుగ్రీవ కోట సమీపంలోని హనుమాన్ గర్హి వెనుక నుండి శ్రీరామ జన్మభూమికి వెళ్లే రహదారి భక్తి మార్గం రూపంలో మహిమాన్వితమైన మార్గంగా మారనుందని యోగీ వెల్లడించారు. గతంలో ఇంత విశాలమైన రోడ్లు లేవని, కానీ ఇప్పుడు పంచకోసి, 14 కోసి, చౌరాసికోసి, కొత్త బైపాస్, రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆసుపత్రులు, విద్యా కేంద్రాల అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతం అవుతున్నాయన్నారు.ప్రపంచంలోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటిగా అయోధ్యను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications