మీరు కాంగ్రెస్ పై పోరాడిన జేపీ అనుచరులా ? విపక్షాల మీటింగ్ కు అఖిలేష్ హాజరుపై యోగీ ఫైర్..
గత వారం బీహార్ రాజధాని పట్నాలో జరిగిన విపక్షాల భేటీలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొనడంపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ స్పందించారు. యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అఖిలేష్ యాదవ్.. అదే అజెండాతో జరిగిన విపక్షాల భేటీకి హాజరై తన అభిప్రాయాలు చెప్పారు. దీనిపై యోగీ తనదైన శైలిలో చురకలు అంటించారు. చిప్కో ఉద్యమాల్లో పాల్గొనడంలో అఖిలేష్ పార్టీకి ప్రావీణ్యం ఉందన్నారు.
1973లో యూపీలో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన చిప్కో ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఇందులో నిపుణులన్నారు. పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి అఖిలేష్ యాదవ్ హాజరు కావడంపై స్పందిస్తూ జయప్రకాష్ నారాయణ్ అనుచరులుగా చెప్పుకునే సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జేడీయూ వంటి పార్టీలు.. ప్రజాస్వామ్యాన్ని వంచించిన కాంగ్రెస్ తో కుమ్మక్కై తమ తప్పుల్ని, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని యోగీ విమర్శించారు.

సమాజ్‌వాదీ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని, 2004లో మాదిరిగా వారు అడగకుండానే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని యోగీ ఆరోపించారు. కాంగ్రెస్ వారి మద్దతును కోరకపోయినా సమాజ్‌వాదీ పార్టీ ముందుకొచ్చిందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ గతంలో ఏం చేసిందో ఇప్పుడూ అదే చేసిందన్నారు. కానీ తాము మాత్రం సానుకూల దృక్పథంతో ముందుకెళ్తున్నట్లు యోగీ వెల్లడించారు.
విపక్షాల భేటీపై బీజేపీ కూడా ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ఇది "బహుళ తలల స్వార్థ కూటమి" అని పేర్కొంది.
యోగీ ఆదిత్యనాథ్ తాజాగా నోయిడాలో రూ. 1,719 వ్యయంతో 124 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.
నోయిడా ఉత్తరప్రదేశ్ షో విండో అని, గౌతమ్ బుద్ధ్ నగర్ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద రాష్ట్ర ప్రతిష్టను మార్చడానికి దోహదపడిందని ఆదిత్యనాథ్ అన్నారు, జిల్లాలోకి వస్తున్న ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications