లక్నో కోర్టు కాల్పుల్లో గాయపడ్డ ఏడాదిన్నర బాలిక-ఆస్పత్రికెళ్లి పరామర్శించిన యోగీ..
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో తాజాగా గ్యాంగ్ స్టర్-రాజకీయ నేత ముక్తార్ అన్సారీ అనుచరుడు సంజీవ్ మహేశ్వరి జీవాను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. లక్నో కోర్టుకు హాజరైన నేపథ్యంలో ఆయన్ను జడ్జి ముందే కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల్లో కోర్టు ప్రాంగణంలో ఉన్న ఓ ఏడాదిన్నర పాపకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఈ బాలిక ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
లక్నో కోర్టు కాల్పుల్లో గాయపడిన ఏడాదిన్నర పాపను స్ధానిక కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ కేజేఎంయూ లోని ట్రామా సెంటర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ పాపను సీఎం యోగీ ఆదిత్యనాథ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్దితిని అడిగి తెలుసుకున్నారు. పాపకు మెరుగైన చికిత్స అందించి కాపాడాలని ఆస్పత్రి అధికారులకు యోగీ ఆదేశాలు ఇచ్చారు. అయితే పాప ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.

బుల్లెట్ గాయంతో బాధపడుతున్న పాప లక్ష్మి చికిత్స పొందుతున్న వార్డుకు ఆదిత్యనాథ్ చేరుకుని ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ సపోర్టులో ఉన్న బాలిక ముఖ్యమంత్రి వైపు చూస్తుండటంతో.. ఆయన కూడా బాలికతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి కూడా ఆమె నుదుటిని తాకి చాక్లెట్లు ఇచ్చారు. బాలికతో పాటు ఇదే కాల్పుల్లో గాయపడ్డ పోలీసు కానిస్టేబుల్ పరిస్థితి నిలకడగా ఉందని చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సందీప్ తివారీ వెల్లడించారు.
పాపకు ఆక్సిజన్ సపోర్టు ఉందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తివారీ పేర్కొన్నారు. అనంతరం ఆమె శరీరంలోని బుల్లెట్‌ను బయటకు తీయడానికి ఆపరేషన్ కూడా నిర్వహించారు. బాలికకు ఆస్పత్రిలో ఉచిత చికిత్సనే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తామని ఆమె తల్లిదండ్రులకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి యోగీ హామీ ఇచ్చారు. చికిత్స కోసం ఏదైనా అవసరమైతే ప్రభుత్వానికి తెలియజేయాలని యూనివర్సిటీని యోగీ కోరారు.












Click it and Unblock the Notifications