యూపీలో ఆధార్ తరహాలోనే ఫ్యామిలీ ఐడీ కార్డు-పథకాల నుంచి అన్నీ అందులోనే..
ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ సర్కార్ ఒక కుటుంబం-ఒక గుర్తింపు కార్డు పేరుతో ఓ కొత్త పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతీ కుటుంబానికి గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. వీటి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ 78 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 33 వేలకు పైగా దరఖాస్తులకు ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు యోగీ ప్రకటించారు.
యూపీలోని ప్రతి కుటుంబంలో కనీసం ఓ సభ్యునికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో కుటుంబ గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. ఒక కుటుంబం-ఒక గుర్తింపు పథకం కింద ప్రతి కుటుంబానికి ఈ ప్రత్యేక గుర్తింపును జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో కుటుంబ యూనిట్ల ప్రత్యక్ష, సమగ్ర డేటాబేస్ ఏర్పాటు కోసం ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ డేటాబేస్ లబ్ధిదారులకు అందిస్తున్న పథకాల మెరుగైన నిర్వహణ, సకాలంలో అందజేయడం, పారదర్శక నిర్వహణ, అర్హులైన వ్యక్తులకు పథకం పూర్తి ప్రయోజనాన్ని అందించేందుకు జారీ చేస్తున్నారు.

అలాగే సాధారణ ప్రజలకు ప్రభుత్వ సౌకర్యాలను సరళీకృతం చేయడంలోనూ కుటుంబ కార్డు ఉపయోగపడుతుందని యోగీ సర్కార్ చెబుతోంది. కుటుంబ ఐడీల ద్వారా తీసుకున్న సమగ్ర డేటాబేస్ ఆధారంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలను గుర్తించి, వారికి ప్రాధాన్యతపై సరైన ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా కుటుంబ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న యోగీ ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో ఇప్పటికే అభివృద్ధిని పరుగులు తీయించేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమంపైనా ఫోకస్ పెట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగీ ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications