యూపీలో పండుగల ఆంక్షలు, అక్కడ మాంసం బ్యాన్- యోగీ సర్కార్ మార్గదర్శకాల విడుదల..
ఉత్తర్ ప్రదేశ్ లో పండుగల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో పండుగల వేళ ప్రజలు పాటించాల్సిన అంశాలు, అలాగే పలు చోట్ల మాంసం అమ్మకాలపై నిషేధం వంటి ఉత్తర్వులు ఉన్నాయి. పండుగల సీజన్ ముగిసేవరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.
యూపీలో జూలై 4 నుండి ప్రారంభమయ్యే కన్వర్ యాత్ర కోసం నిర్ణయించిన మార్గాల్లో బహిరంగంగా మాంసం అమ్మకాలను నిషేధించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు పోలీసు కమిషనర్లు, డివిజనల్ కమీషనర్లు, జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో సహా సీనియర్ అధికారులతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రావణ మాసానికి రెండు నెలల వ్యవధి ఉందని సిఎం యోగి చెప్పారు. ఈ సందర్భంగా శ్రావణ శివరాత్రి, నాగపంచమి, రక్షాబంధన్ పండుగలు జరుపుకుంటామన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో జులై 4 నుంచి సంప్రదాయ కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ముందు జూన్ 29న బక్రీద్ జరుపుకోనున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ సమయం సున్నితంగా ఉంటుందని తెలిపారు. కాబట్టి మనం నిరంతరం అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని అధికారులకు యోగీ సూచించారు.
భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ కన్వార్ మార్గంలో బహిరంగ ప్రదేశాల్లో మాంసాన్ని విక్రయించరాదని, మార్గం పరిశుభ్రంగా, శానిటైజ్‌గా ఉండాలని, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని, వాతావరణం వేడిగా ఉన్నందున తాగునీటికి కూడా ఏర్పాట్లు చేయాలని యోగీ ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications