తమిళనాడులో ఎలా అడుగుపెడతావో చూస్తాం-రాజ్యసభలో నిర్మలాసీతారామన్ కు వార్నింగ్..!
రాజ్యసభలో నిన్న ఆర్ధరాత్రి వరకూ సాగిన వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లు చర్చలో ఎంపీల మధ్య వాడీవేడీ సంవాదాలు సాగాయి. ఇందులో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా పలువురు కేంద్రమంత్రులు రాజ్యసభలో మాట్లాడారు. అలాగే వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష ఎంపీలు ఘాటుగా స్పందించారు. ఇదే క్రమంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు ఎంపీల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతలకు కారణమైంది.
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతకు ముందు చేసిన ప్రసంగంలో వక్ఫ్ బిల్లుకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలపై వైగో మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఆయన వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి తమిళనాడులో ఎలా అడుగు పెడతారో చూస్తామంటూ నిర్మలా సీతారామన్ ను తీవ్రస్ధాయిలో హెచ్చరించారు. దీంతో సభలో ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది.

దీనిపై వెంటనే నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. తమిళనాడులో ఎలా అడుగుపెడతారంటూ నన్నే హెచ్చరిస్తారా అంటూ ఎండీఎంకే ఎంపీ వైగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వార్నింగ్ లు తనను అడ్డుకోలేవంటూ కౌంటర్ ఇచ్చారు. వైగో చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, వాటిని సభా రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్ కర్ ను నిర్మల కోరారు. అయితే ధన్ కర్ మాత్రం వక్ఫ్ బిల్లుపై ఆయన మీ నుంచి హామీ కోరుతున్నారని ఆమెకు నచ్చజెప్పారు. దీంతో నిర్మలా సీతారామన్ కాసేపటికి శాంతించారు.












Click it and Unblock the Notifications