• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజాసింగ్: ఆంధ్రోళ్ల ఓట్లు కావాలిగానీ, వైద్యం మాత్రం ఇవ్వరా - ప్రెస్ రివ్యూ

By BBC News తెలుగు
|

కరోనావైరస్ వ్యాధికి చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారిని ఆపడం సమంజసం కాదని హైదరాబాద్‌లోని గోషామహల్ బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ తప్పుబట్టారని వెలుగు పత్రిక తెలిపింది.

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ప్రభుత్వం తీరు సరైనది కాదని ఆయన మండిపడ్డారు.

“ముందు చికిత్స.. ఆ తర్వాతే డాక్యుమెంట్స్! ఈ సమయంలో రాజకీయాలు కాదు.. సేవ ముఖ్యం. ఆంధ్రా వారి ఓట్లు కావాలి కానీ.. వారికి వైద్యం మాత్రం ఇవ్వరా? హైదరాబాద్ మెడికల్ హబ్ అని కేసీఆర్ అంటారు. అలాంటప్పుడు మంచి చికిత్స కోసం వస్తే డాక్యుమెంట్స్ కావాలా? ఆంధ్రప్రదేశ్‌కు పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తానంటారు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం పట్టించుకోరా?” అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును రాజాసింగ్ ప్రశ్నించారు.

Rajasingh

డాక్యుమెంట్స్‌ను కారణంగా చూపుతూ వైద్యం ఆపొద్దని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందని ఆయన అన్నారు.

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులను క్రమబద్ధీకరించాలి: కేటీఆర్

కోవిడ్19 చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ ఎక్కువ మంది నుంచి వస్తున్న విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ట్విటర్‌లో చెప్పారని ఈనాడు తెలిపింది.

కోవిడ్‌ చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాయని, అవి పేద, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారాయనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు. వాటిని సమీక్షించి, క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

'కేటీఆర్‌ను అడగండి(ఆస్క్‌ కేటీఆర్‌)’ పేరిట ట్విటర్‌లో గురువారం నెటిజన్లు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు.

ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్‌ సమర్థంగా అమలవుతోందని, ప్రజలకు నిత్యావసరాల లభ్యత కోసమే నాలుగు గంటలపాటు మినహాయింపు ఇచ్చామని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలా, వద్దా అనేది ఈ నెల 20న జరిగే మంత్రిమండలి సమావేశం నిర్ణయిస్తుందని వివరించారు.

రఘురామకృష్ణరాజు అరెస్టుపై హైకోర్టులో వ్యాజ్యం

పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు(ఆర్‌ఆర్‌ఆర్)ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైందని ఈనాడు తెలిపింది.

రఘురామ అరెస్టు నిబంధనలకు అనుగుణంగా లేదని ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్‌లో ఆరోపించారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ఈ వ్యాజ్యంపై హైకోర్టు శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుంది.

విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామకు సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది. ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని చెప్పింది.

ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై రఘురామను శుక్రవారం హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.

అక్కడి నుంచి ఆయన్ను గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చారు.

సీఐడీ డీఐజీ సునీల్‌ కుమార్‌ గుంటూరుకు చేరుకున్నారు. రఘురామను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

కరోనా: ఆ వైరల్ వీడియోలోని యువతి మృతి

ఓ 30 ఏళ్ల యువతి చేతికి సెలైన్ పైపు, నోటికి ఆక్సిజన్ పైపుతో కోవిడ్ రోగుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉత్సాహంగా పాటలు వింటున్న వీడియో ఇటీవల వైరల్ అయ్యింది. వీడియోలో కనిపించిన యువతి చనిపోయారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

లవ్ యూ జిందగీ పాట వింటూ ఆమె ధైర్యంగా చికిత్స తీసుకుంటున్న వీడియోను దిల్లీ డాక్టర్ మోనిక గత వారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో ఎంత మందిలో స్ఫూర్తి నింపింది. తర్వాత ఆ యువతి పరిస్థితి విషమించిందని, గురువారం ఆమె చనిపోయారని డాక్టర్ మోనిక తెలిపారు.

“చాలా బాధాకరం. ఓ ధైర్యమైన గుండెను కోల్పోయాం” అంటూ మోనిక ఆమె మరణ వార్తను చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
You need Andhra settler votes but will not give medicine to them:Rajasingh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X