వివాహేతర సంబంధం: గృహిణిని చంపేసి సోఫా కింద దాచేసిన యువతి
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బుల కోసం ఓ యువతి.. గృహిణిని హత్య చేసి ఇంట్లోని ఓ సాఫా కింద దాచేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, తూర్పు బోర్విలిలో నిందితురాలిని అరెస్ట్ చేశారు. మృతి చెందిన మహిళ గర్భవతని, నిందితురాలు ఓ ఫ్యాషన్ డిజైనర్ అని పోలీసులు చెప్పారు. నిందితురాలు ఉజ్వల వీర్(22) ఆమెను చంపేందుకు మూడు రకాల ఆయుధాలను ఉపయోగించిందని పోలీసులు తెలిపారు.
ఇంట్లోని చెల్లెలు, పనిమనిషికి ఈ విషయాన్ని తెలియకుండా జాగ్రత్తపడిందని పోలీసులు చెప్పారు. మొదట నిందితురాలు ఉజ్వల.. ఎవరో వచ్చి ప్రీతి భేగకర్(26)ను హత్య చేసి పరారయ్యారని పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపారు. ఉజ్వలే ఈ హత్య చేసివుంటుందని భావించిన పోలీసులు.. తమదైన శైలిలో విచారించడంతో నిందితురాలు ఉజ్వల తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉజ్వల వీర్ తన తల్లిదండ్రులతోపాటు కాజుపాడలో నివాసముంటోంది. ఉజ్వల ఇంటి పక్కనే బాధితురాలు ప్రీతి, తన భర్త ప్రశాంత్ తోపాటు నివాసముంటోంది. వారింట్లో ప్రీతి నాలుగేళ్ల కొడుకు, మరదలు కూడా ఉంటున్నారు. ప్రశాంత్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

కాగా, ఉజ్వల వీర్... ప్రశాంత్ వద్ద రూ. 20వేలను అప్పుగా తీసుకుంది. ఆ డబ్బును తొందరగా తిరిగిచ్చేయాలని ప్రీతి.. ఉజ్వలపై ఒత్తిడి చేసింది. అంతేగాక, వీర్ ఉజ్వల, ప్రశాంత్‌లు సన్నిహితంగా ఉంటున్నట్లు ప్రీతికి తెలిసింది. ఈ నేపథ్యంలో బుధవారం వీర్ ఉజ్వల, ప్రీతిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఉజ్వల.. ప్రీతిపై కత్తితో దాడి చేసింది. ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేసింది.
ఆ తర్వాత తన చేయి కోసుకున్న ఉజ్వల.. ఎవరో వచ్చి తనపై, ప్రీతిపై కత్తితో దాడి చేశారని ప్రీతి భర్త ప్రశాంత్‌కు తెలిపింది. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. అడిగిన ప్రతిసారీ భిన్నంగా సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చి ఉజ్వలను తమదైన శైలిలో పోలీసులు విచారించారు. దీంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. నిందితురాలు ఉజ్వలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications