Zika virus: పొరుగు రాష్ట్రం హైఅలర్ట్: సరిహద్దు జిల్లాల్లో: కొత్త గైడ్‌లైన్స్ జారీ
బెంగళూరు: కేరళలో జికా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటికే 14 పాజిటివ్ కేసులక్కడ వెలుగులోకి వచ్చాయి. కరోనా మహమ్మారికి తోడుగా జికా కూడా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో- కేరళ ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. రాజధాని తిరువనంతపురంలోని పరస్సాల ప్రాంతానికి చెందిన ఓ 24 సంవత్సరాల వయస్సున్న గర్భిణీలో తొలిసారిగా ఈ వైరస్ లక్షణాలు కనిపించాయి. ఆ తరువాత అది విస్తరించింది. ఒక్కటొక్కటిగా 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ కేరళలో కరోనా వైరస్ రోజువారీ కేసులు అధికంగా నమోదవుతోన్నాయి.
కేరళలో జికా వైరస్ పుట్టుకు రావడంతో కర్ణాటక అప్రమత్తమైంది. హైఅలర్ట్‌ను ప్రకటించింది. కేరళ సరిహద్దులపై నిఘా ఉంచింది. సరిహద్దు జిల్లాల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రకటించింది. ఎయిడెస్ దోమలు ఈ వైరస్ వ్యాప్తికి కారణమౌతోండటంతో కేరళతో సరిహద్దులను పంచుకుంటోన్న దక్షిణ కన్నడ, ఉడుపి, చామరాజనగర జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చింది. జికా వైరస్ తీవ్రత ఆధారంగా చేసుకుని.. ఇవే మార్గదర్శకాలను అన్ని జిల్లాల్లో అమలు చేస్తామని కర్ణాటక వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు.

గ్రామాల్లో రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో చెత్తను నిల్వ ఉంచకూడదని, యుద్ధ ప్రాతిపదికన వాటిని డిస్పోజ్ చేయాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. చేపల ఎగుమతి కార్యకలాపాలు, కార్గో లావాదేవీలు పెద్ద ఎత్తున చోటు చేసుకునే విమానాశ్రయాలు, ఓడరేవులు, హార్బర్లలోనూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. కేరళ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలపైనా నిఘా ఉంచామని స్పష్టం చేసింది. జికా వైరస్ లక్షణాలు కనిపించిన వారి నుంచి సేకరించే నమూనాలను బెంగళూరులోని నేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపాలని సూచించింది.












Click it and Unblock the Notifications