12-18 పిల్లలకు త్వరలోనే అందుబాటులోకి జైడస్ క్యాడిలా కరోనా వ్యాక్సిన్: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో 18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, 12-18 ఏళ్ల వయస్కులకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కేంద్రం వెల్లడించింది. 12-18ఏళ్ల వారి కోసం గుజరాత్ రాష్ట్రానికి చెందిన జైడస్ ఫార్మా కంపెనీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.
జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. కాగా, 'జైడస్ క్యాడిలా 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం ట్రయల్స్ ముగించింది. ఇది చట్టబద్ధమైన అనుమతులకు లోబడి ఉంటుంది' అని కేంద్రం కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.

మరోవైపు, 2-18 ఏళ్ల మధ్య పిల్లలకు ఇవ్వడం కోసం భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను .. వాలంటీర్లపై పరీక్షల చేసేందుకు డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇంియా) మే 12న అనుమతిచ్చిందని కేంద్రం తెలిపింది.
కాగా, జైడస్ క్యాడిలా టీకాలను 12-18 పిల్లలపై ట్రయల్స్ నిర్వహించారు. అయితే ట్రయల్స్ డేటా పట్ల ఒకవేళ ప్రభుత్వం సముఖంగా ఉంటే, ఆ కంపెనీ టీకాకు వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి దక్కే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు.
డీసీజీఐకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) జైడస్ డేటాను పరిశీలించనుంది. ఒకవేళ అనుమతి దక్కితే, ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో టీకాల సరఫరా మొదలవుతుందని కూడా అధికారులు చెబుతున్నారు. 12 నుంచి 18 ఏళ్ల వారి కోసం జైడస్ టీకా సెప్టెంబర్ చివరినాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇటీవల కోవిడ్ వర్కింగ్ గ్రూపు సాంకేతిక సలహా మండలి చైర్మన్ ఎన్‌కే అరోరా పేర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications