భారత్‌లో ZyCoV-D:సూదిలేని 3డోసుల టీకా -నిపుణుల కమిటీ ఆమోదం -డీసీజీఐ ఓకే చెప్తే వాడకానికి రెడీ
కొవిడ్ రెండో వేవ్ లో అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోయిన భారత్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. మూడో వేవ్ ముప్పు నేపథ్యంలో ఇప్పుడున్నవాటికి అదనంగా కొత్త టీకాలకూ అనుమతుల ప్రక్రియను చకచకా చేస్తోంది. దేశంలో దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది..
గుజరాత్‌కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి కొవిడ్ వ్యాక్సిన్ వినియోగానికి నిపుణుల కమిటీ ఓకే చెప్పింది. అంతేకాదు, ఈ టీకాకు అత్యవసర వినియోగ అనుమతులు ఇవ్వాలంటూ భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కి నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. జైడస్ క్యాడిలా జైకోవ్-డి టీకాను మూడు డోసులుగా పంపిణీ చేస్తారు. నీడిల్ గుచ్చకుండానే ఈ టీకాను శరీరంలోకి పంపుతారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

జైకోవ్-డి టీకాకు అత్యవసర వినియోగ అనుమతుల కోసం జైడస్ క్యాడిలా జులై 1వ తేదీన దరఖాస్తు చేసుకుంది. దీనిపై నిపుణుల కమిటీ గురువారం సమావేశమై డీసీజీఐకి సిఫార్సులు చేసినట్లు సమాచారం. ఈ టీకాకు 66.6శాతం సమర్థత ఉన్నట్లు మధ్యంతర పరిశీలనలో తేలింది. డీఎన్‌ఏ సాంకేతికతతో జైడస్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఇది మూడు డోసుల టీకా. 0-28-56 రోజుల్లో తీసుకోవాలి. 12 ఏళ్ల పైబడినవారిపై తమ టీకా పని చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అనుమతులు వచ్చాక ఏటా 24కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
జైకోవ్-డి టీకాకు అనుమతులు లభిస్తే ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇదే అవుతుంది. అంతేకాదు, ఇండియాలో అందుబాటులోకి వచ్చే ఆరో టీకా ఇదే కానుంది. ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాల పంపిణీ జరుగుతుండగా.. అమెరికాకు చెందిన మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాల వినియోగానికి కూడా కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు,
దేశంలో 12 నుంచి 17 ఏళ్ల వయసుగల పిల్లలకు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఆమోదం లభించింది. అమెరికా ఫార్మా దిగ్గజమైన జాన్సన్ అండ్ జాన్సన్ 12-17 సంవత్సరాల వయస్సు గల కౌమారదశ పిల్లలకు కొవిడ్ -19 కి వ్యతిరేకంగా సింగిల్ షాట్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి అనుమతి కోరడం తెలిసిందే. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ షాట్ కొవిడ్ వ్యాక్సిన్ మూడవదశలో కొవిడ్ నివారించడంలో 85 శాతం సామర్ధ్యం చూపించింది.దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్ ఆమోదించింది. ఇదిలా ఉంటే,
కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,571 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నమోదు అయ్యింది. దేశ వ్యాప్తంగా 3,63,605 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 150 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 97.54%గా ఉంది.












Click it and Unblock the Notifications