తాలిబన్ల ఊచకోత మొదలు: హజారా మైనారిటీల కాల్చివేత: ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా
కాబుల్: కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు.. ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తరువాత అక్కడి పరిస్థితులు రక్తసిక్తమౌతోన్నాయి. తాలిబన్లు ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న అతి కొద్దిరోజుల్లోనే మారణ హోమం మొదలైంది. ఇటీవలే రాజధాని కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులు ఆత్మాహూతి దాడికి పాల్పడిన తరువాత.. మరో దారుణ ఘటన చోటు చేసుకుంది.
హజారా మైనారిటీ కమ్యూనిటీకి చెందిన 14 మందిని తాలిబన్లు కాల్చి చంపారు. వారిలో 12 మంది ఆప్ఘనిస్తాన్ సైనికులు, మరో ఇద్దరు సాధారణ పౌరులు ఉన్నారు. తమ ఆధిపత్యాన్ని హజారా మైనారిటీ వర్గ ప్రజలు అంగీకరించకపోవడం వల్లే తాలిబన్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డేకుండి ప్రావిన్స్‌లోని ఖదిర్ జిల్లాలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తాలిబన్ల అరాచకానికి పరాకాష్ఠగా నిలిచిందీ ఉదంతం. ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సైతం ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది.

తాలిబన్లకు హజారా మైనారిటీలను బద్ధ శతృవులుగా భావిస్తుంటారు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ సైన్యంలో హజారా మైనారిటీ వర్గానికి చెందిన వారిని పెద్ద ఎత్తున నియమించుకున్నారు. తాలిబన్లు ఎప్పుడు దాడులకు పాల్పడినా.. తొలుత హజారా మైనారిటీలనే లక్ష్యంగా చేసుకుంటారు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో హజారా మైనారిటీలను అణచివేతకు గురైన వర్గం గుర్తిస్తారు. హజారాలు షియా మతస్తులు. అందువల్లే తాలిబన్లు వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటారని విశ్లేషకులు చెబుతుంటారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడటానికి తాలిబన్లు సహకరించాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సైతం తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలన్నింటినీ భద్రత మండలి ముందే ఊహించింది. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులకు షెల్టర్ జోన్‌గా మారకూడదని పేర్కొంది. తమ దేశ పౌరులపై గానీ.. పొరుగు దేశాలపై గానీ ఉగ్రవాద దాడులను ప్రోత్సహించేలా, టెర్రరిస్టులను ప్రేరేపించేలా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపింది. ఈ మేరకు భద్రత మండలి ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
ఇప్పటికీ ఆప్ఘనిస్తాన్‌లో నివసిస్తోన్న విదేశీయులు తమ స్వస్థలాలకు సురక్షితంగా చేరుకునేలా తాలిబన్ల తక్షణ చర్యలను తీసుకోవాలని భద్రత మండలి సూచించింది. వారికి సేఫ్ ప్యాసేజ్ కల్పించాల్సిన బాధ్యత తాలిబన్లపైనే ఉందని తెలిపింది. దేశం విడిచి వెళ్లదలిచిన ఆప్ఘనిస్తానీయులను తాము అడ్డుకోబోమని, వారి కోసం సరిహద్దులను తెరిచి ఉంచుతామంటూ ఈ నెల 27వ తేదీన ఇచ్చిన ప్రకటనకు తాలిబన్లు కట్టుబడి ఉండాలని పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌ను తిరిగి ఉగ్రవాదుల అడ్డాగా మార్చబోమంటూ అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ కోసం ఖతర్‌లోని దోహాలో నిర్వహించిన చర్చల్లో సైతం తాలిబన్లు హామీ ఇచ్చారు. తీరా సైనిక బలగాలను ఉపసంహరించుకున్న తరువాత తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. అదే సమయంలో ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉనికిలోకి వచ్చింది. దాడులకు తెగబడింది. అల్‌ఖైదా కీలక నేత అమీనుల్ హక్ సైతం స్వదేశానికి చేరుకున్నాడు.












Click it and Unblock the Notifications