ఇంట్లోకొచ్చి కాల్పులు: ప్రవాస భారతీయుడు మృతి
సూరత్/జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న గుజరాత్ వాసిని కొందరు నల్లజాతి వ్యక్తులు కాల్చి చంపారు. గుజరాత్ రాష్ట్రంలోని అంకలేశ్వర్ ప్రాంతానికి చెందిన ఇర్షక్ చౌహాన్(28) అతని సోదరుడు ఇమ్రాన్ చౌహాన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా దక్షిణాఫ్రికాలోని పీటర్స్‌బర్గ్‌లో వ్యాపారం చేస్తున్నారు.
కాగా, గత ఆదివారం ఉదయం గుర్తు తెలియని కొందరు నల్లజాతి వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్ర గాయాలపాలపైన ఇర్షక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్ర గాయాలపాలైన అతని సోదరుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు ఎంతో కష్టపడి వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నారని, ఇంతలో ఇలా జరగడం బాధగా ఉందని బాధితుల బంధువులు తెలిపారు.

ఇర్షద్ చనిపోయే ముందు నాలుగేళ్ల వయస్సున్న ఇమ్రాన్ కొడుకును దుండగుల బారినుంచి కాపాడాడని కుటుంబసభ్యులు తెలిపారు. తండ్రి చనిపోవడంతో సుమారు నాలుగేళ్ల క్రితం దక్షిణాఫ్రికా వచ్చిన బాధితులు సొంత వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పారు.
ఇర్షద్‌కు గత డిసెంబర్‌లో వివాహమైందని, అతడు డిసెంబర్ 15న భారతదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడని తెలిపారు.
ఇది ఇలా ఉండగా, సెప్టెంబర్ 4న బీరన్ పటేల్(40) అనే భారతదేశానికి చెందిన వ్యక్తిని ఇద్దరు దుండగులు దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరంలో చంపేశారు. అతడు కూడా వ్యాపారే. అతని స్టోర్ మూసెసే సమయానికి వచ్చిన దుండగులు దాడి చేసి హత్య చేశారు. భారతీయులపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడున్న ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications