Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలుశిక్ష-ఐదేళ్ల అనర్హత వేటు..
పాకిస్తాన్ రాజకీయాల్లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న కాలంలో ఖజానాకు వచ్చే విలువైన బహుమతుల్ని తీసుకున్న వ్యవహారంలో ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలారు. దీంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. అలాగే ఐదేళ్ల పాటు అనర్హత వేటు కూడా పడింది. అంటే ఈ ఐదేళ్ల పాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు. పాకిస్తాన్ పార్లమెంట్ కు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ కు ఇది భారీ షాక్ గా మారబోతోంది.
తోషాఖానా (ప్రభుత్వ ఖజానా)కు వచ్చిన బహుమతుల స్వీకరణ కేసులో ఇస్లామాబాద్ లోని ట్రయల్ కోర్టు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారిస్తూ ఇవాళ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయనకు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. ఆ మేరకు ఇమ్రాన్ అరెస్టుకు వారెంట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పోలీసులు ఇమ్రాన్ ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇమ్రాన్ పార్టీ పీటీఐ..ఈ తీర్పును తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్ ను అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమని పేర్కొంది.

70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. తాను ప్రధానిగా ఉన్న సమయంలో విదేశీ ప్రముఖుల నుండి పొందిన బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు దోషిగా తేలారు. ఈ బహుమతులలో రాజకుటుంబం ఇచ్చిన గడియారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, ఖాన్ సహాయకులు వాటిని దుబాయ్‌లో విక్రయించారని గతంలో ఆరోపణలు వచ్చాయి. వీటిపై దాఖలైన కేసును విచారించిన ట్రయల్ కోర్టు ఇవాళ శిక్ష ప్రకటించింది.
పాకిస్తాన్ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించేందుకు సిద్ధమవుతున్న ఇమ్రాన్ ఖాన్ ను ప్రభుత్వం తోషాఖానా కేసులో అభియోగాలు మోపి జైలుకు పంపుతోంది. దీంతో త్వరలో జరిగే ఎన్నికల్లో ఆయన పాల్గొనేందుకు అవకాశం లేకుండా పోతోంది. అయితే ట్రయల్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.












Click it and Unblock the Notifications