
గన్ కల్చర్: చెల్లిని ఐదేళ్ల బాలుడు కాల్చి చంపాడు
న్యూయార్క్: అమెరికాలో గన్ కల్చర్ విపరీత పరిణామాలకు దారి తీస్తోంది. పిల్లల చేతుల్లోకి కూడా ఆయుధాలు వెళ్తున్నాయి. దీంతో ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఐదేళ్ల బుడతడు తన చెల్లెని కాల్చి చంపాడు.
అమెరికాలోని ఫిలాడెల్ఫియా ప్రాంతంలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలుడు తుపాకీతో తన నాలుగేళ్ల చెల్లెల్ని కాల్చి చంపేశాడు. పిల్లలు ఇంట్లో ఆడుకుంటుండగా ఉన్నట్టుండి బాలుడు తుపాకీతో పాప తలపై కాల్చాడు. దీంతో పాప అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈ విషయమై ఇంట్లో వారిని విచారణ చేపడుతున్నారు.

ఘటన జరిగిన చోట సెమీ ఆటోమేటిక్ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం బాలిక తండ్రి మారీస్ ఫిలిప్స్‌కన్పించడం లేదని ఇతని ఫేస్‌బుక్ వివరాల ఆధారంగా అతన్ని వెతికి పట్టుకునేందుకు యత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వాస్తవానికి, ఆ ప్రాంతంలో తరుచుగా హింసాత్మక సంఘటనలు జరుగుతుండడంతో తన పిల్లలు బయట ఆడుకోకుండా తల్లి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తోంది. అయితే, ఆదివారంనాడు ఇంట్లోనే ఆ దుర్ఘటన చోటు చేసుకుంది.