వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ లాక్‌డౌన్‌తో భారత్‌‌లో చిక్కుకుని 18 నెలల తరువాత తల్లితండ్రులను చేరిన 5 ఏళ్ల చిన్నారి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రస్తుతం సిడ్నీలో క్యారెంటైన్లో ఉన్న దృశ్య, ఆమె కూతురు జోహన్నా

ఆస్ట్రేలియాలో నివసించే అయిదేళ్ల జొహన్నా తన అమ్మమ్మ, తాతలను కలుసుకోవడానికి ఇండియా వచ్చింది. ఇంతలో కరోనా వైరస్ కమ్ముకొచ్చింది. ఆస్ట్రేలియా సరిహద్దులు మూసివేయడంతో ఆ పాప ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది.

అలా తల్లిదండ్రులకు దూరంగా ఆ చిన్నారి ఏకంగా 18 నెలలు ఇండియాలోనే ఉండిపోయింది.

ఎట్టకేలకు, జొహన్నా సోమవారం సిడ్నీ చేరుకుంది. తన తల్లి దృశ్యతో పాటు క్వారంటైన్‌లో సమయం గడుపుతోంది.

"ఎంత సంతోషంగా ఉందో ఎలా చెప్పను, ఈ ఆనందాన్ని మాటల్లో పెట్టలేను" అని దృశ్య బీబీసీతో అన్నారు.

దృశ్య, పాప తండ్రి డిలిన్ తమ చిన్నారిని తిరిగి సిడ్నీ రప్పించుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేశారు.

విమానాలు రద్దు కావడం, మైనర్ బాలిక ఒంటరిగా ప్రయాణించేందుకు అనుమతి లేకపోవడం లాంటి పలు కారణాలతో ఇన్ని రోజులూ జొహన్నా తల్లిదండ్రులకు దూరంగా ఇండియాలోనే ఉండిపోవలసి వచ్చింది.

కరోనా కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్ల కోసం ఫేస్‌బుక్‌లో ఏర్పాటు చేసిన ఒక గ్రూపు ద్వారా దృశ్య, డిలిన్‌లకు మరో జంట లిండా, జోబీ పరిచయమయ్యారు.

వీళ్లిద్దరూ కూడా ఆస్ట్రేలియా వెళ్లవలసి ఉంది. తమతో పాటూ జొహన్నాను తీసుకెళ్లడానికి లిండా, జోబీ అంగీకరించారు.

"కొన్ని వారాల్లోనే లిండా మాకు బాగా పరిచయమైపోయారు. వారిపై పూర్తి విశ్వాసం కలిగింది. వాళ్లిద్దరూ మా పాపను ఎంతో బాగా చూసుకున్నారు. వాళ్లు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మరచిపోలేం" అని దృశ్య అన్నారు.

లిండా, జోబీ, జొహన్నాను మాత్రమే కాక దాదాపు అదే వయసున్న మరో చిన్నారిని కూడా ఖతార్ ఫ్లైట్‌లో తోడ్కొని వచ్చారు.

అయిదేళ్ల జొహన్నాతో తల్లితండ్రులు

ఇది దృశ్య, డిలిన్‌ల సమస్య మాత్రమే కాదు. ఆస్ట్రేలియాలో ఎందరో తల్లిదండ్రులు వేరెక్కడో చిక్కుకుపోయిన తమ పిల్లలను ఫ్లైట్‌లో తోడ్కొని వచ్చేవారి కోసం ఎదురు చూశారని, ఎంతోమంది సహృదయులు ముందుకు వచ్చి వారికి సహాయం చేశారని ఆస్ట్రేలియన్ మీడియా తెలిపింది.

పాప మీద బెంగతో రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదని, ఒక్కోసారి రాత్రంతా కుర్చుని ఏడ్చేదాన్నని దృశ్య చెప్పారు. ఇప్పుడు పాపను చూశాక ఎంత హాయిగా ఉందో చెప్పలేనని ఆమె అన్నారు.

"మా పాప నన్ను ఎంత మిస్ అయిందో, వచ్చిన దగ్గర నుంచి నాకు అతుక్కుపోయింది. ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టట్లేదు. ఎన్నో రోజుల ఎదురుచూపులు చివరకు ఫలిచాయి" అని దృశ్య అన్నారు.

అయితే, పాప ఇంకా వాళ్ల నాన్నను కలుసుకోలేదు. జొహన్నాతో పాటూ క్వారంటీన్‌లో ఉండడానికి తల్లిదండ్రుల్లో ఒకరిని మాత్రమే అనుమతిస్తారు. 14 రోజుల తరువాత జొహన్నా తన తండ్రిని కలుసుకోబోతోంది.

నాన్న స్ట్రాబెర్రీస్ తీసుకొస్తారని ఆ చిన్నారి ఎదురుచూస్తోంది. అవి ఆమెకు చాలా ఇష్టం.

"ఆస్ట్రేలియా స్ట్రాబెర్రీల నిలయమని పాప అనుకుంటుంది. పాపకు ఆ పళ్లంటే చాలా ఇష్టం. తనకు ఆస్ట్రేలియాకు రావడమంటే స్ట్రాబెర్రీ తోటలో అడుగుపెట్టినట్టు లెక్క" అని దృశ్య నవ్వుతూ చెప్పారు.

తల్లిదండ్రులకు దూరంగా ఇండియాలో చిక్కుకుపోయిన పిల్లలు

ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ట్రేడ్ ( డీఎఫ్ఏటీ) సేకరించిన గణాంకాల ప్రకారం, జూన్ మొదటి వారానికి 203 మంది చిన్నారులు (మైనర్లు) తమ తల్లిదండ్రులకు దూరంగా ఇండియాలో చిక్కుకుపోయారని తేలింది.

వారిలో కొంతమందిని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానాల్లో స్వదేశానికి పంపించారు.

వీరిలో చాలామంది ఇండియాలో తమ బంధువులు, ఆత్మీయుల దగ్గర ఉండిపోయారు.

గత నెల, ఒక ఆస్ట్రేలియన్ సెనేట్ కమిటీ విచారణలో తమ పాపను కలుసుకునేందుకు తాము పడిన పాట్లను డిలిన్ వివరించారు.

ప్రభుత్వం నుంచి తమకు మద్దతు, సహాయం అందకపోవడం, పాప మైనర్ కావడంతో సహా పలు నిబంధనల కారణంగా తమ చిన్నారిని తమ దగ్గరకు రప్పించుకోవడం ఆలశ్యమవుతోందని డిలిన్ వాపోయారు.

జొహన్నా మరీ చిన్న పిల్ల కావడంతో భారత, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన విమానాల్లో లేదా కమర్షియల్ విమానాల్లో ఒంటరిగా ప్రయాణించేందుకు అనుమతి లభించలేదు.

జోహన్నా

అయితే, ఎలాగోలా పాపకు ఒక చార్టెడ్ ప్రయివేటు విమానంలో సీటు సంపాదించగలిగారు.

అంతలోనే ఇండియా నుంచి వచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించబోమని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆ చార్టెడ్ విమానం రద్దయింది.

కాగా, ఈ ఆంక్షలు వివాదాస్పదం కావడంతో విమానాల రద్దును ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది.

అప్పటికీ, రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలోనే విమానాలు నడుస్తున్నాయి. జొహన్నా, డిలిన్ ఇండియా వచ్చి పాపను తీసుకెళదామనుకుంటే పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదు. ఒకవేళ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చిక్కుకుపోతే, మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లలేకపోతే కష్టమవుతుందని వాళ్లు సందేహించారు.

విదేశాల్లో చిక్కుకుపోయిన ఆస్ట్రేలియన్ల పట్ల ఆ దేశ ప్రభుత్వ విధానాలపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఏ సహాయామూ అందక దయనీయ పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

అయితే, గత కొన్ని వారాల్లో తమకు మెరుగైన సహాయం అందిందని, దగ్గరుండి సహాయం చేసే ఒక కార్యకర్త లభించారని దృశ్య తెలిపారు.

"అవసరమైతే మా అమ్మకు వీలైనంత త్వరగా వీసా ఏర్పాటు చేసి జొహన్నాతో పాటు పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కానీ, మా అమ్మ ప్రయాణం చేసే పరిస్థితుల్లో లేరు. ఆమెకు భాష కూడా రాదు. ఇంకే రకంగానూ కుదరకపోతే ఆమె రావాల్సి వస్తుంది. అది చివరి ప్రయత్నంగా అట్టే పెట్టాం.

ఇప్పటికైనా ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తోంది.. ఇంతకన్నా మెరుగైన విధానంతో ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ఇండియాలో చిక్కుకుపోయినవారు ఎందరో ఉన్నారు" అని దృశ్య అన్నారు.

ప్రస్తుతం సుమారు 10,500 ఆస్ట్రేలియన్లు ఇండియాలో ఉన్నారని, వారంతా వెనక్కు రావాలని కోరుకుంటున్నారని, అందుకు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని డీఎఫ్ఏటీ తెలిపింది.

అయితే, వీరిలో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతమంది, మైనర్లు ఎంతమంది అనే వివరాలు తెలుపలేదు.

"కుటుంబాలు తిరిగి కలుసుకోవాలని మేం కోరుకుంటున్నాం. కానీ, మైనర్లు సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నదే మా ధ్యేయం. ఇండియాలో, ఆస్ట్రేలియాలో ఉన్న కుటుంబాలతో డీఎఫ్ఏటీ సంప్రదిస్తోంది. మైనర్లను భద్రంగా వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. మేం ఒక్కోక్క కేసును విడి విడిగా పరిశీలిస్తున్నాం" అని డీఎఫ్ఏటీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
5-year-old joins parents 18 months after being trapped in India by Covid19 lockdown
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X