వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కిమ్ కుక్-సోంగ్

కిమ్ కుక్-సోంగ్ పాత అలవాట్లు ఇంకా పోలేదు. ఆయన ఒక ఇంటర్వ్యూను కొన్ని వారాలపాటు చేయాల్సి వచ్చింది.

తన మాటలు ఎవరైనా వింటున్నారేమోనని ఆయన కంగారు పడిపోయేవారు. కెమెరా ముందు నల్ల కళ్లద్దాలు పెట్టుకునేవారు. ఆయన అసలు పేరు మా మొత్తం టీమ్‌లో ఇద్దరికి మాత్రమే తెలుసుంటుందని నాకు అనిపిస్తోంది.

ఇక కిమ్ కుక్-సోంగ్ గురించి చెప్పాలంటే, ఆయన 30 ఏళ్లపాటు ఉత్తర కొరియాలో ఒక బలమైన నిఘా ఏజెన్సీలో సీనియర్ అధికారిగా పనిచేశారు.

"ఆ నిఘా ఏజెన్సీ సుప్రీమ్ లీడర్‌కు కళ్లు, చెవులు, మెదడులా పనిచేసేది" అని ఆయన చెప్పారు.

వారి రహస్యాలను దాచానని, నేతలను విమర్శించేవారిని హత్య చేయడానికి హంతకులను పంపించానని, వారికోసం నిధులు సేకరించడానికి అక్రమంగా డ్రగ్స్ ల్యాబ్స్ కూడా నడిపించామని ఆయన చెబుతున్నారు.

మాజీ సీనియర్ కల్నల్ కిమ్ కుక్-సోంగ్ ఇప్పుడు తన కథను బీబీసీకి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఉత్తర కొరియాకు చెందిన అంత పెద్ద సీనియర్ సైనికాధికారి ఒక పెద్ద వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇదే మొదటిసారి. తాను చాలా నిజాయితీపరుడైన కమ్యూనిస్టు సేవకుడినని కిమ్ కుక్-సోంగ్ బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

కిమ్ జోంగ్-ఉన్

ఉత్తర కొరియా వ్యూహాలు

కానీ హోదా, నిజాయితీ ఉత్తర కొరియాలో ఒకరి భద్రతకూ ఎలాంటి హామీని ఇవ్వలేవు.

2014లో ఆయన తన ప్రాణాలు కాపాడుకోడానికి ఆ దేశం వీడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఉంటున్నారు. ఆ దేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేస్తున్నారు.

"ఎలాగైనా ఎక్కువ డబ్బు పోగుచేయాలని తెగించిన ఉత్తర కొరియా నేతలు దాని కోసం డ్రగ్స్ విక్రయాల నుంచీ మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలో ఆయుధాల అమ్మకాలు వరకూ అన్ని రకాల పనులూ చేస్తున్నారు" అని ఆయన చెప్పారు.

దక్షిఉత్తర కొరియా నిర్ణయాల వెనుక అసలు ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారు, దక్షిణ కొరియాపై ఎలా దాడులు చేశారో కూడా కిమ్ కుక్-సోంగ్ బీబీసీకి చెప్పారు. ఆ దేశానికి సంబంధించిన గూఢచారులు, సైబర్ నెట్‌వర్క్‌కు ప్రపంచంలో ఏ మూలకైనా చేరుకోగలిగే సామర్థ్యం ఉందని తెలిపారు.

బీబీసీ ఆయన చెప్పినవి స్వతంత్రంగా దర్యాప్తు చేయలేపోయింది. కానీ ఆయన గుర్తింపును నిర్ధారించుకోగలిగింది. దానితోపాటూ ఆయన చెప్పిన కొన్ని విషయాలను కూడా ధ్రువీకరించుకోగలిగింది.

మేం దీనిపై లండన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయం, న్యూయార్కులోని వారి మిషన్‌ను సంప్రదించాం. కానీ, అక్కడ నుంచి ఇప్పటివరకూ మాకు ఎలాంటి సమాచారం అందలేదు.

కిమ్ జోంగ్-ఉన్

ఒక టెర్రర్ టాస్క్ ఫోర్స్

ఉత్తర కొరియాలో సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేసిన కిమ్ కుక్-సోంగ్ తన పదవీకాలం చివరి ఏళ్లలో ప్రారంభమైన ఆ దేశ ప్రస్తుత లీడర్ కిమ్ జాంగ్ ఉన్ కెరియర్ గురించి వివరించారు. కిమ్ తనను ఒక యోధుడుగా నిరూపించుకోవాలని తపించే ఒక యువకుడుగా ఆయన చెప్పారు.

2009లో ఉత్తర కొరియా ఒక కొత్త నిఘా ఏజెన్సీని స్థాపించింది. దాని పేరు 'రికానిసెన్స్ జనరల్ బ్యూరో'. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆయన తండ్రి స్థానంలో కూర్చోబెట్టడానికి కిమ్ జాంగ్ ఉన్‌ను సిద్ధం చేస్తున్నారు. అప్పుడు కిమ్ జోగ్ చోల్ బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. ఆయన్ను ఉత్తర కొరియా నేతకు అత్యంత విశ్వశనీయుడైన సహచరుడుగా భావిస్తారు.

2009 మేలో ఉత్తర కొరియాకు చెందిన ఒక మాజీ అధికారిని హత్య చేయడానికి టెర్రర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ అధికారి దేశం వదిలి దక్షిణ కొరియాలో ఆశ్రయం పొందాడు.

"తన తండ్రి, సుప్రీం లీడర్‌ను సంతృప్తి పరచడానికి కిమ్ జోగ్ ఉన్‌కు అది చేయాలనుకున్నారు. హ్వాంగ్ జాంగ్ యోప్‌ను రహస్యంగా హత్య చేయించడానికి ఒక టెర్రర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఆ పని చేయాలని నాకు వ్యక్తిగతంగా ఆదేశాలు ఇచ్చారు".

"హ్వాంగ్ జాంగ్ యోప్ ఒకప్పుడు ఉత్తర కొరియాలో అత్యంత శక్తివంతమైన అధికారిగా ఉండేవారు. ఉత్తర కొరియా విధానానికి ఆయన ప్రధాన రూపకర్త. 1997లో దక్షిణ కొరియా వెళ్లిపోయిన ఆయన్ను నేతలు ఎప్పటికీ క్షమించలేదు. ఒకసారి ఆయన సియోల్‌లో ఉత్తర కొరియా పాలకులను తీవ్రంగా విమర్శించారు. దాంతో కిమ్ కుటుంబం ఆయనను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది".

ఉత్తర కొరియా

నేతల పట్ల విశ్వాసం

కానీ, యోప్ మీద హత్యాయత్నం విఫలమైంది. ఆ కుట్ర కేసులో ఉత్తర కొరియా సైన్యంలోని ఇద్దరు మేజర్లు సియోల్లో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ కుట్రలో తమ ప్రమేయాన్ని ఉత్తర కొరియా ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈ హత్యకు పూర్తి ప్లాన్ సిద్ధం చేసింది దక్షిణ కొరియానే అని ఆరోపించింది.

కిమ్ కుక్-సోంగ్ చెప్పిన వివరాల్లో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియాలో తీవ్రవాదం కిమ్ జోంగ్-ఇల్, కిమ్ జోంగ్-ఉన్ గౌరవాన్ని కాపాడే ఒక రాజకీయ సాధనంలా ఉండేది. వారసులు తమ సుప్రీం నేతపట్ల విశ్వాసం చూపించడానికి అది ఒక మార్గంలా మారింది.

ఆ పరంపర అక్కడితో ముగిసిపోదు. 2010లో దక్షిణ కొరియా నావీకి చెందిన చెవొనాన్ నౌక టార్పిడో దాడిలో సముద్రంలో మునిగిపోయింది. ఆ ఘటనలో 46 మంది చనిపోయారు. దీని వెనుక తమ హస్తం ఉందనే ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది. తర్వాత అదే ఏడాది నవంబర్‌లో దక్షిణ కొరియా ద్వీపం యోంగ్‌ప్యోంగ్ మీద ఉత్తర కొరియా బాంబు వర్షం కురిపించింది. ఆ దాడిలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారు.

ఆ దాడులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారా అని చాలా చర్చ జరిగేది.

"చెవొనాన్ లేదా యోంగ్‌ప్యోంగ్ ద్వీపంపై జరిగిన దాడుల్లో నేను నేరుగా పాల్గొనలేదు. కానీ, నిఘా ఏజెన్సీ అధికారులకు అది రహస్యం కాదు. ఆ దాడుల గురించి వారు గర్వంగా భావించేవారు, గొప్పలు చెప్పుకునేవారు" అని కిమ్ కుక్ గ్ చెప్పారు.

పైనుంచి ఆదేశాలు లేకుండా అలాంటి ఆపరేషన్లు జరగవు అని ఆయన చెప్పారు.

"ఉత్తర కొరియాలో రోడ్డు వేయాలన్నా నేరుగా సుప్రీం లీడర్ అనుమతి లేకుండా అది సాధ్యం కాదు. ఈ చెవొనన్ మునిగిపోవడం, యోంగ్‌ప్యోంగ్ దీవి మీద బాంబుల దాడులు ఆయన కిందున్న వారు చేయగలిగేవి కాదు అంటారు" సోంగ్

కిమ్ జోంగ్-ఉన్ ప్రత్యేక ఆదేశాలతో ఇలాంటి సైనిక ఆపరేషన్లను డిజైన్ చేసి అమలు పరిచేవారు.

కిమ్ జోంగ్-ఉన్

దక్షిణ కొరియా అధ్యక్షుడి ఆఫీసులో గూఢచారి

తన బాధ్యతల్లో దక్షిణ కొరియాను ఎదుర్కోడానికి వ్యూహాలు సిద్ధం చేయడం అనేది ఒకటని కిమ్ కుక్-సోంగ్ చెప్పారు. "దక్షిణ కొరియాను రాజకీయంగా లొంగదీసుకోవమే మా లక్ష్యం. దానికోసం మాకు క్షేత్రస్థాయిలో జనం అవసరమైంది" అని తెలిపారు.

"దాంతో ఎన్నో సార్లు నేను గూఢచారులను దక్షిణ కొరియాకు వెళ్లాలని ఆదేశించాను. వారి ద్వారా ఆపరేటివ్ మిషన్స్ చేశాను. ఒక కేసులో ఒక ఉత్తర కొరియా ఏజెంట్‌ను పంపించాం. అతడు దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంలో పని పూర్తి చేసుకుని సురక్షితంగా ఉత్తర కొరియాకు తిరిగొచ్చాడు. అది 90వ దశంలో జరిగిన విషయం" అన్నారు సోంగ్.

"బ్లూ హౌస్( దక్షిణ కొరియా అధ్యక్ష భవనం)లో ఐదు నుంచి ఆరేళ్లు పనిచేసిన తర్వాత అతడు సురక్షితంగా తిరిగి వచ్చి, లేబర్ పార్టీ కార్యాలయంలో పనిచేశాడు. వివిధ సామాజిక సంస్థలతోపాటూ దక్షిణ కొరియాలోని ప్రధాన సంస్థల్లో ఉత్తర కొరియా గూఢచారులు చురుగ్గా పనిచేస్తున్నారని నేను మీకు చెప్పగలను" అని ఆయన తెలిపారు.

అయితే ఆయన చెప్పి ఈ వివరాలపై బీబీసీ దర్యాప్తు చేయలేకపోయింది.

హ్యాకర్స్ సైన్యం

దక్షిణ కొరియా జైళ్లు ఎంతోమంది ఉత్తర కొరియా గూఢచారులతో నిండిపోయింది అని ఎన్కే న్యూస్ వ్యవస్థాపకుడు వోకరోల్ ఇటీవలే ఒక ఆర్టికల్‌ రాశాక, నేను దక్షిణ కొరియా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఎంతోమంది గుఢచారులను కలిశాను. వారిని రకరకాల గూఢచర్యం కేసుల్లో దశాబ్దాల నుంచీ అరెస్ట్ చేశారు.

అలాంటి ఘటనలు జరుగుతూనే వచ్చాయి. వీటిలో ఒక్క గూఢచర్యం కేసులో మాత్రమే నేరుగా ఉత్తర కొరియా ప్రమేయం ఉన్నట్టు బయటపడింది.

కానీ, ఎన్కే న్యూస్ గణాంకాల ప్రకారం 2017 తర్వాత గూఢచర్యానికి సంబంధించిన కేసుల్లో దక్షిణ కొరియా చాలా తక్కువ మందిని అరెస్ట్ చేసింది.

నిఘా సమాచారం సేకరించడానికి ఉత్తర కొరియా పాతకాలం పద్ధతులకు బదులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించడమే దీనికి కారణం అని భావిస్తున్నారు.

ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా, మిగతా ప్రపంచ దేశాలకు దూరగా ఏకాకిగా ఉండచ్చు. కానీ ప్యాంగ్యాంగ్ 6 వేల మంది చురుకైన హ్యాకర్లతో ఒక సైన్యాన్ని తయారు చేసిందని గతంలో ఉత్తర కొరియా నుంచి పారిపోయి వేరే దేశాలకు చేరుకున్న వారు హెచ్చరిస్తున్నారు.

ఉత్తర కొరియా మాజీ నేత కిమ్ జోంగ్-ఇల్ 80వ దశకంలో సైబర్ యుద్ధ సన్నాహాల కోసం కొత్త వారికి శిక్షణ ఇప్పించాలని ఆదేశాలు ఇచ్చారన కిమ్ కుక్-సోంగ్ చెప్పారు.

దానికోసం దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తున్న మోరాన్బోంగ్ యూనివర్సిటీ వారికి ఆరేళ్ల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.

ఉత్తర కొరియా గూఢచారులు

బ్రిటన్ ప్రభుత్వ హెల్త్ ఏజెన్సీ ఎన్‌హెచ్ఎస్, ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలపై 2017లో జరిగిన సైబర్ దాడుల వెనుక ఉత్తర కొరియా లాజరస్ గ్రూప్ హస్తం ఉందని బ్రిటన్ నిఘా ఏజెన్సీ అధికారులు భావిస్తున్నారు.

ఇదే హ్యాకర్ల గ్రూప్ 2014లో సోనీ పిక్చర్స్‌ను కూడా టార్గెట్‌గా చేసిందని చెబుతున్నారు.

"ఈ హ్యాకర్ల గ్రూప్ ఉండే ఆఫీసును 414, లీజోన్ ఆఫీస్ అని పిలుస్తారు. మేం దానిని కిమ్ జోంగ్-ఇల్ సమాచార విభాగంగా కూడా చూసేవాళ్లం" అని కిమ్ కుక్-సోంగ్ చెప్పారు.

ఈ కార్యాలయం నుంచి హ్యాకర్లు నేరుగా ఉత్తర కొరియా నేతలతో ఫోన్లో సంప్రదించేవారని ఆయన చెబుతున్నారు.

ఈ గ్రూప్ ఏజెంట్లు చైనా, రష్యా, ఆగ్నేయాసియా దేశాల్లో ఉంటారని తెలుస్తోంది. కానీ ఈ హ్యాకర్లు ఉత్తర కొరియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్తర కొరియా గూఢచారుల పరస్పర కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు కూడా ఈ గ్రూప్ భద్రత అందిస్తుంది.

ఉత్తర కొరియా

డాలర్ల కోసం డ్రగ్స్ తయారీ

కిమ్ జోంగ్-ఉన్ ఇటీవల ఉత్తర కొరియా మరోసారి సంక్షోభంలో పడినట్లు ప్రకటించారు. మరో కరువును ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఏప్రిల్‌లో దేశ ప్రజలకు అపీల్ చేశారు.

90వ దశకంలో కిమ్ జోంగ్-ఇల్ పాలనలో ఉత్తర కొరియా ఒక భయానక కరువును చూసింది. ఆ సమయంలో కిమ్ కుక్-సోంగ్ ఉత్తర కొరియా ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అప్పుడు ఆయనకు సుప్రీం లీడర్ కోసం 'రివల్యూషనరీ ఫండ్స్' సేకరించే బాధ్యతలు అప్పగించారు.

అంటే దానికి 'మాదక ద్రవ్యాల స్మగ్లింగ్' అని అర్థం అంటారు కిమ్ కుక్-సోంగ్

"కిమ్ జోంగ్-ఇల్ సమయంలో కరువు వచ్చినపుడు మాదక ద్రవ్యాల ఉత్పత్తి పతాక స్థాయికి చేరింది. అప్పుడు సుప్రీం లీడర్ కోసం ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లో రివల్యూషనరీ ఫండ్స్ నిండుకున్నాయి.

నాకు ఆ బాధ్యతలు ఇవ్వడంతో నేను విదేశాల నుంచి ముగ్గురిని ఉత్తర కొరియాకు పిలిపించాను. వర్కర్స్ పార్టీ లీజోన్ ఆఫీసు ట్రైనింగ్ సెంటర్‌లో డ్రగ్స్ ఉత్పత్తి ప్రారంభించాం. అక్కడ ఐసీఈ(క్రిస్టల్ మెథ్) తయారుచేసేవాళ్లం. మేం దానిని కిమ్ జాంగ్-ఇల్‌ కోసం డాలర్లుగా మార్చేవాళ్లం" అని సోంగ్ చెప్పారు.

డ్రగ్స్ గురించి కిమ్ కుక్-సోంగ్ బీబీసీకి చెప్పినదాన్లో చాలా వరకూ నిజమేనని మా పరిశీలనలో తేలింది. మాదక ద్రవ్యాల ఉత్పత్తిలో ఉత్తర కొరియాకు తనదైన చరిత్ర ఉంది. అది ఎక్కువగా హెరాయిన్, నల్లమందు డీల్ చేస్తుంటుంది.

బ్రిటన్‌లో పనిచేసిన ఉత్తర కొరియా మాజీ దౌత్యవేత్త థాయె యోంగ్-హో ఆ తర్వాత స్వదేశం విడిచిపెట్టాడు.

తమ దేశం అధికారికంగా మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ చేస్తోందని, దేశంలో భారీగా జనం వాటికి అలవాటు పడ్డారని, ఉత్తర కొరియాలోని వివిధ రంగాలను ఆ సమస్య పట్టి పీడిస్తోందని ఆయన 2019లో ఓస్లో ఫ్రీడం ఫోరంకు చెప్పారు.

ఇరాన్ ఉత్తర కొరియా సంబంధాలు

డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా సంపాదించే డబ్బంతా ఎక్కడికి వెళ్లేది, దానిని ప్రజల కోసం ఖర్చు చేశారా అని నేను కిమ్ కుక్-సోంగ్‌ను అడిగాను.

"మీకు ఒకటి విషయం చెబుతా. దాన్ని బట్టి మొత్తం ఆ డబ్బంతా ఉత్తర కొరియా నేతలదే అని మీకు అర్థమవుతుంది. ఈ డబ్బుతో వాళ్లు విల్లాలు నిర్మించుకున్నారు. కార్లు కొన్నారు. తినడానికి తాగడానికి, బట్టలు, అన్నిరకాల విలాసాలకూ దానిని ఖర్చు చేసేవారు" అని సోంగ్ చెప్పారు.

90వ దశకంలో ఉత్తర కొరియాలో కరువు వచ్చినప్పుడు జనం భారీ సంఖ్యలో చనిపోయారని చెబుతారు.

"ఇరాన్‌కు అక్రమంగా ఆయుధాల విక్రయించడం అనేది ఉత్తర కొరియా మరో ఆదాయ వనరుగా ఉండేది. దీనిని ఆపరేషన్స్ విభాగం ద్వారా నిర్వహించేవారు అని కిమ్ కుక్-సోంగ్ చెప్పారు.

ఉత్తర కొరియా ప్రత్యేక జలాంతర్గాములు, అంటే సెమీ- సబ్‌మెరైన్ లాంటి సమర్థమైన అత్యాధునిక పరికరాలను కూడా తయారు చేయగలిగేది. చాలా సమర్థంమెరతయారు చేయడంలో కూడా తయార చేయడంలో ఉత్తర కొరియా చాలా మెరుగ్గా ఉండేది" అని ఆయన చెప్పారు.

ఉత్తర కొరియా తయారు చేసే జలాంతర్గాములు బాగా శబ్దం వచ్చే డీజిల్ ఇంజన్‌తో నడుస్తాయని కూడా ప్రచారం జరిగింది.

"అయితే, ఈ ఒప్పందాలు ఎంత విజయవంతం అయ్యాయంటే, ఇరాన్‌లోని ఉత్తర కొరియా డిప్యూటీ డైరెక్టర్ వ్యాపారంలో భాగంగా తమ స్విమింగ్ పూల్లో జలకాలాడ్డానికి ఇరాన్ అధికారులను కూడా ఆహ్వానించేవారు" అని కిమ్ కుక్-సోంగ్ చెప్పారు.

ఉత్తర కొరియా అంశాల్లో ప్రముఖ నిపుణులు ప్రొఫెసర్ ఆండ్రెయీ లాంకోవ్ వివరాల ప్రకారం

ఇరాన్‌-ఉత్తర కొరియా ఆయుధాల క్రయవిక్రయాల విషయం 80వ దశకంలోనే ప్రపంచం దృష్టికి వచ్చింది. రెండు దేశాల మధ్య బాలిస్టిక్ మిసైళ్ల ఒప్పందాలు కూడా జరిగాయి.

కిమ్ జోంగ్-ఉన్

ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

ఉత్తర కొరియా తమపై కఠిన అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ భారీ ప్రాణనష్టం కలిగించే సామర్థ్యం ఉన్న ఆయుధాల అభివృద్ధి కార్యక్రమాలను సుదీర్ఘ కాలం నుంచీ కొనసాగిస్తూనే ఉంది.

ఇదే ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా నాలుగు కొత్త రకం క్షిపణులను పరీక్షించింది. వీటిలో సుదూర దూరాలను ఛేదించే సామర్థ్యం ఉన్న క్రూయిజ్ మిసైల్ కూడా ఉంది. ఈ క్షిపణుల్లో నడుస్తున్న రైలు నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్, హైపర్‌సోనిక్ మిసైల్, ఒక యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ కూడా ఉన్నాయి.

ఉత్తర కొరియా మారుతున్న కాలంతోపాటూ అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటోంది.

అంతర్యుద్ధంతో విలవిల్లాడుతున్న దేశాలకు కూడా ఉత్తర కొరియా తమ టెక్నాలజీని విక్రయించినట్లు కిమ్ కుక్-సోంగ్ చెప్పారు. సిరియా, మయన్మార్, లిబియా, సూడాన్‌కు కూడా ఉత్తర కొరియా ఆయుధాలు ఎగుమతి చేసిందని ఇటీవల ఐక్యరాజ్యసమితి ఆరోపించింది.

ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన ఆయుధాలు ప్రపంచంలో యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో సమస్యలను మరింత పెంచవచ్చని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

కిమ్ జోంగ్-ఉన్

నమ్మకస్తుడైన సేవకుడు మోసం చేశాడు

కిమ్ కుక్-సోంగ్ ఉత్తర కొరియాలో ప్రత్యేక సౌకర్యాలున్న విలాసవంతమైన జీవితం గడిపారు.

మెర్సిడెస్ బెంజ్ కార్ ఉపయోగించడానికి కిమ్ జోంగ్-ఉన్ ఆంటీ తనకు అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఉత్తర కొరియా నేతల కోసం డబ్బు సేకరించడానికి తను స్వేచ్ఛగా విదేశాలకు కూడా వెళ్లగలిగానని తెలిపారు.

అరుదైన లోహాలు, బొగ్గును విదేశాల్లో విక్రయించేవాడినని లక్షల డాలర్లు సేకరించి దానిని ఒక సూట్‌కేస్‌లో నింపుకుని ఉత్తర కొరియా తీసుకొచ్చేవాడినని సోంగ్ చెప్పారు.

జనం తినడానికి తిండి కూడా లేని ఒక పేద దేశంలో ఇలాంటి విలాసవంతమైన జీవితాన్ని అసలు ఊహించలేం.

కానీ, తన వివాహం ద్వారా ఏర్పడిన బలమైన రాజకీయ సంబంధాల వల్ల వివిధ నిఘా సంస్థల మధ్య తాను తిరగగలిగానని సోంగ్ చెప్పారు. అయితే, ఆ సంబంధాలే తనను, తన కుటుంబాన్ని ప్రమాదంలో కూడా పడేశాయని తెలిపారు.

2011లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్-ఉన్ కొంత కాలం తర్వాత తనను, తన చిన్నాన్న జంగ్ సోంగ్ థైక్‌ను ప్రమాదంగా భావించే వారినందరినీ అంతం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

కిమ్ జోంగ్-ఇల్ ఆరోగ్యం పాడయినప్పటి నుంచీ జంగ్‌ను అందరూ ఉత్తర కొరియా తర్వాత నేతగా చూస్తుండేవారు.

"జంగ్ సోంగ్-థైక్‌కు కిమ్ జోంగ్-ఉన్‌ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉండేది. జంగ్ ఎక్కువ కాలం పాటు ఉండరేమోనని నాకు అప్పుడే అనిపించింది" అంటారు కిమ్ కుక్-సోంగ్

కానీ 2013 డిసెంబర్‌లో జంగ్‌కు మరణ శిక్ష విధించినట్లు ఉత్తర కొరియా మీడియా ప్రకటించింది.

నేను ఆశ్చర్యపోయా. అది చాలా ఘోరమైన దెబ్బ. నేను భయపడ్డాను. నా ప్రాణానికి ప్రమాదం ఉంటుందని, ఇక ఉత్తర కొరియాలో ఉండలేననే విషయం నాకు అర్థమైంది.

జంగ్‌కు మరణశిక్ష పడిందనే విషయం పత్రికలో చదివినప్పుడు సోంగ్ విదేశాల్లో ఉన్నారు. దాంతో ఆయన తన కుటుంబంతో సహా దక్షిణ కొరియాకు పారిపోయే పథకం వేశారు.

ఆ సమయంలో నా పూర్వీకుల సమాధులు, నా కుటుంబం ఉన్న స్వదేశాన్ని వదిలి నేను విదేశంగా అనుకంటూ వచ్చిన దక్షిణ కొరియాకు పారిపోవడం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది అత్యంత బాధాకరమైన నిర్ణయం అన్నారు సోంగ్.

ఆ నల్ల కళ్లజోడు వెనుక కూడా ఆ జ్ఞాపకాలు ఆయన్ను ఎంత బాధపెడుతున్నాయో నేను చూడగలిగాను.

కిమ్ జోంగ్-ఉన్

కలిసిన ప్రతిసారీ నేను ఆయన్ను నేను ఒకే ప్రశ్న అడిగాను. "మీరు ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడాలని నిర్ణయించారు".

"నేను చేయగలిగిన ఏకైక పని ఇదే. ఉత్తర కొరియాలోని నా సోదరులను నియంతృత్వం నుంచి విడిపించడానికి, వారికి నిజమైన స్వేచ్ఛను అందించడానికి నేను ఇక మరింత చురుగ్గా ఉంటాను" అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఆయన లాంటి వారు దక్షిణ కొరియాలో 30 వేల మందికి పైగా ఉన్నారు.

వారిలో కొంతమందే మీడియా ముందు మాట్లాడాలని నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. వీరి హోదా ఎంత పెద్దదైతే వారికి, వారి కుటుంబానికి అంత ముప్పు ఉంటుంది.

పారిపోయి వచ్చి దక్షిణ కొరియాలో జీవించే వారిని ఆ దేశంలో సందేహంగా చూసే వారు కూడా ఉన్నారు. వారు చెప్పే కథలను ఎవరైనా ఎలా ధ్రువీకరించుకోగలరు?

కిమ్ కుక్-సోంగ్ అత్యంత అసాధారణ జీవితం అనుభవించారు. ఆయన చెప్పిన దీనిని ఉత్తర కొరియా కథలో కొంత భాగంగా అయినా అనుకోవచ్చు.

కానీ, ఆయన కథ మనకు కొంతమంది తప్పించుకోగలిగిన ఒక పాలన గురించి చెబుతుంది. ఆ పాలనలో మనుగడ సాగించాలంటే ఏది అవసరమో కూడా వివరిస్తుంది.

"ఉత్తర కొరియాలో రాజకీయ సమాజం, వారి నిర్ణయాలు, వారి ఆలోచనా ప్రక్రియలు అన్నీ సుప్రీం నేత పట్ల విధేయత అనేదాన్నే అనుసరిస్తాయి. తరతరాలుగా అది వారిపై ఒక విశ్వాసం ఏర్పడేలా చేసింది" అంటారు సోంగ్.

కిమ్ కుక్-సోంగ్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన టైమింగ్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది.

"కొన్ని షరతులు నెరవేరితే సమీప భవిష్యత్తులో దక్షిణ కొరియాతో చర్చలు జరగవచ్చు" అని కింగ్ జోంగ్-ఉన్ ఇటీవల సంకేతాలు ఇచ్చారు.

కానీ, అప్పుడే ఆయన ఒక హెచ్చరిక కూడా చేశారు.

"నేను ఇక్కడికి వచ్చి ఏళ్లవుతోంది. కానీ ఉత్తర కొరియా అస్సలు మారలేదు. మేం సెట్ చేసిన వ్యూహాలు కొనసాగుతాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉత్తర కొరియా 0.01 శాతం కూడా మారలేదు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A secret agent involved in drug, terrorism and arms trafficking in North Korea
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X