ఆఫ్గన్‌లో మహిళలపై తాలిబన్ల అరాచకం-వంట సరిగా వండలేదని సజీవ దహనం-సెక్స్ బానిసలుగా యువతుల తరలింపు
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు మొదలయ్యాయి.అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందినట్లుగానే మహిళల పట్ల తాలిబన్లు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు.పైకి శాంతి వచనాలు వల్లిస్తూనే మహిళలు,సామాన్యుల పట్ల హింసకు పాల్పడుతున్నారు. తాజాగా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన నజ్లా అయౌబి అనే ఆఫ్గనిస్తాన్ మాజీ న్యాయవాది,ఎవ్రీ వుమెన్ ట్రీటి(మహిళా హక్కుల కోసం పాటు పడే సంస్థ) సంస్థ చీఫ్ అక్కడి మహిళల ధీన స్థితి గురించి బాహ్య ప్రపంచానికి తెలియపరిచారు.నిత్యం మహిళ హక్కుల కోసం గొంతెత్తున్న తాను... తన ప్రాణాలు కాపాడుకునేందుకు ఇప్పటికిప్పుడు దేశం విడిచి పారిపోవాలనుకుంటున్నట్లు తెలిపారు.
Recommended Video

వంట సరిగా చేయలేదని...
తాలిబన్ల అరాచకాల గురించి చెబుతూ... ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను నజ్లా అయౌబి ఉదహరించారు. తాలిబన్ ఫైటర్లకు వంట సరిగా చేయలేదనే కారణంతో ఓ మహిళను సజీవదహనం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో తిండికి కూడా ప్రజలు అలమటిస్తున్నారని... ఇలాంటి తరుణంలో తాలిబన్లు తమకు తిండి పెట్టాలని స్థానికులను వేధిస్తున్నారని,హింసిస్తున్నారని చెప్పారు. అంతేకాదు,గత కొద్ది వారాలుగా ఎంతోమంది యువతులను శవపేటికల్లో పొరుగు దేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. వారిని సెక్స్ బానిసలుగా వాడుకునేందుకే ఇలా తరలిస్తున్నారని తెలిపారు.

ఆడపిల్లల కుటుంబాలకు వేధింపులు...
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను తాలిబన్లు వేధింపులకు గురిచేస్తున్నారని నజ్లా అయౌబి తెలిపారు. మీ కూతుళ్లను తమకిచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే... మరోవైపు ఇలాంటి అరాచకాలకు తెగబడటమేంటని ప్రశ్నించారు. తాలిబన్ల పాలనలో జీవితమొక కాళరాత్రిగా మారిపోయిందన్నారు. తాలిబన్ల రాకకు ముందు రోజు వరకు తాను శక్తివంతమైన స్థానంలో ఉన్నానని... ఇప్పుడు తన స్థానం నథింగ్ అని వాపోయారు.

మహిళా జర్నలిస్టుల పరిస్థితి...
ఇటీవలే షబ్నమ్ అనే ఓ మహిళా జర్నలిస్ట్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఆఫ్గన్ మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో తాను ఉద్యోగం కోల్పోయినట్లు తెలిపారు. తాను పనిచేసే టీవీ ఛానెల్ వారు ఇక తనను ఆఫీస్‌కు రావొద్దని చెప్పారని అన్నారు. తాను ఆఫీస్ వద్దకు వెళ్లగా లోపలికి రానివ్వలేదని... కేవలం పురుషులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారని వెల్లడించారు. తాలిబన్ల పాలనతో వ్యవస్థ మారిపోయిందని... ఇక తనను ఆఫీస్‌కు రావొద్దని చెప్పారన్నారు. ఆఫ్గన్‌లో మహిళా హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ... ఓ మహిళా జర్నలిస్ట్ దీనిపై తాలిబన్లనే సూటిగా ప్రశ్నించింది. తాలిబన్ల పాలనలో మహిళా నాయకులకు ఓటు వేసే అవకాశం ప్రజలకు ఇస్తారా అని అడిగింది. అందుకు వారు... అదో పిచ్చి ప్రశ్న అన్నట్లుగా ఎగతాళి నవ్వు నవ్వారు. అంతేకాదు,కెమెరా ఆఫ్ చేయాలని హుకుం జారీ చేశారు. దీంతో ఆ మహిళా జర్నలిస్ట్ మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది.

ఫస్ట్ ప్రెస్ మీట్‌లో తాలిబన్లు మహిళా హక్కులపై ఏమన్నారు...
ఓవైపు మహిళల పట్ల ఇంత హింసకు పాల్పడుతూనే... తాము ఎవరికీ హాని తలపెట్టమని తాలిబన్లు శాంతి వచనాలు వల్లె వేస్తున్నారు. ఆఫ్గన్‌ను చేజిక్కించుకున్నాక నిర్వహించిన మొదటి ప్రెస్‌మీట్‌లో.. 'ఇక నుంచి ఆఫ్గనిస్తాన్‌లో ఎలాంటి యుద్ధం ఉండదు. అశాంతికి ఆస్కారం లేదు. ఏ దేశంతోనూ మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు. మాకు ఎవరిపైనా పగ లేదు.మేమెవరినీ శత్రువుల్లా భావించట్లేదు. విదేశీ విధానాలను అమలుచేసిన మాజీ సైనిక సభ్యులతో పాటు అందరినీ క్షమించేశాం... వారి ఇళ్ల కోసం ఎవరూ వెతకరు... ఎవరిపైనా మేము ప్రతీకారాన్ని కోరుకోవట్లేదు. ఇస్లామిక్ షరియా చట్ట ప్రకారం మహిళా హక్కులు గౌరవించబడుతాయి.ఎడ్యుకేషన్,హెల్త్ సెక్టార్‌లతో పాటు వారి సేవలు ఏయే రంగాల్లో అవసరమో.. అక్కడ వారు పనిచేయవచ్చు.వారి పట్ల వివక్ష ఉండదు.' అని తాలిబన్ల ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ తెలిపారు. తాలిబన్ల మాటలు చాలా ఉదారంగా కనిపించినప్పటికీ... వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి.

మీడియాపై తాలిబన్ల నియంత్రణ...
'అన్ని మీడియా సంస్థలు వారి ప్రసారాలను,కార్యకలాపాలను కొనసాగించవచ్చు.అయితే వారికి మూడు సూచనలు.ఇస్లామిక్ విలువలకు విరుద్ధంగా ఏ కార్యక్రమాన్ని ప్రసారం చేయరాదు. పారదర్శకంగా వ్యవహరించాలి. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ప్రసారాలు చేయకూడదు.' అని తాలిబన్లు మీడియాకు సూచనలు చేశారు. ప్రస్తుత సందర్భం ఆఫ్గన్ మొత్తానికి గర్వించదగ్గ క్షణమని పేర్కొన్నారు. మన చట్టబద్దమైన మనం సాధించుకున్నామని చెప్పారు. ఒకసారి ప్రభుత్వ ఏర్పాటు జరిగాక... ఏ రకమైన చట్టాలు అమలు జరగాలనే దానిపై నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశంలోని సహజ వనరులను వినియోగించుకుని ఆఫ్గన్‌ను పునర్నిర్మాణానికి,శ్రేయస్సుకు కృషఇ చేస్తామన్నారు. అంతర్గతంగా లేదా ఆఫ్గన్ వెలుపల ఎవరితోనూ తాము శత్రుత్వాన్ని కోరుకోవట్లేదని... ప్రస్తుతం తామొక చరిత్రాత్మక సందర్భంలో ఉన్నామని చెప్పారు.20 ఏళ్ల పోరాటంతో ఎట్టకేలకు ఆఫ్గనిస్తాన్‌కు విముక్తి కల్పించామన్నారు.

ఇటీవల ఆఫ్గన్ తొలి మేయర్ ఆందోళన...
అందరి హక్కులు,రక్షణకు తాలిబన్లు హామీ ఇస్తున్నప్పటికీ ఆఫ్గన్ ప్రజల్లో నమ్మకం కుదరడం లేదు. ఆఫ్గన్‌లో తొలి మహిళ మేయర్ అయిన 29 ఏళ్ల జరిఫా గఫారీ తనను తాలిబన్లు చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఫ్గన్‌లో మహిళల సాధికారత కోసం ఆమె కృషి చేశారు. అక్కడి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. 2019లో బీబీసీ రూపొందించిన టాప్ 100 ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2020లో అమెరికా విదేశాంగ శాఖ జరిఫాను ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆఫ్గన్‌లో పరిస్థితులు చూసి ఆమె తల్లడిల్లిపోతున్నారు. జరిఫా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే ఆమెను చంపేస్తామని తాలిబన్లు హెచ్చరించాయి. పలుమార్లు హత్యాయత్నం కూడా జరిగింది. ఆమె తండ్రిని కూడా చంపేశారు. ఇప్పుడు ఆఫ్గన్ మరోసారి తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications