వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: పంజ్‌షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్‌లు దాడి చేశాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పంజ్‌షీర్ లోయలో తాలిబాన్-వ్యతిరేక సాయుధులు

తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌పై తమ పట్టును సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తూనే, తాలిబాన్ వ్యతిరేక శక్తులను నిర్మూలించేందుకు పాకిస్తాన్ డ్రోన్‌ల సహాయం తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బీబీసీ ఈ ఆరోపణలను పరిశోధించింది. అయితే, అలాంటి ఆరోపణలను పాకిస్తాన్ ఖండించింది.

పంజ్‌షీర్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లతో దాడులు చేసిందనే ఆరోపణలు వచ్చాయి

డ్రోన్‌లపై వాదనలు ఏమిటి?

కాబుల్‌కు ఈశాన్యంగా ఉన్న పంజ్‌షీర్ ప్రావిన్స్‌‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. అఫ్గానిస్తాన్లో తాలిబాన్లను చివరి వరకూ ప్రతిఘటించిన చిట్ట చివరి ప్రాంతం ఇదే.

అయితే, తాలిబాన్లు తమ ప్రత్యర్థులను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ సహాయంతో డ్రోన్‌లను ఉపయోగించారనే వాదనలు తెరపైకి వచ్చాయి.

అఫ్గాన్ జర్నలిస్ట్ తాజుద్దీన్ సోరౌష్ అది నిజమేనని తనకు సమాచారం ఉందంటున్నారు.

"పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లోని పంజ్‌షీర్ లోయలో డ్రోన్‌లతో బాంబులను పేల్చింది" అని పంజ్‌షీర్ గవర్నర్ కమాలుద్దీన్ నిజామి తనతో చెప్పినట్టు తాజుద్దీన్ సోరౌష్ చెప్పారు.

కొన్ని లక్ష్యాలపై గాలిలోనుంచే దాడులు జరిగాయని మరికొంత మంది చెబుతున్నారు. అలా చేయగల సామర్థ్యం తాలిబాన్లకు లేదు, పాకిస్తాన్‌కే ఉంది.

ఈ వాదనలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన అఫ్గానిస్తాన్ వ్యవహారాలలో పాకిస్తాన్ జోక్యానికి నిదర్శనం అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందని ఇరాన్, భారత్ మీడియాలు ఆరోపిస్తున్నాయి. వీరి నివేదికల్లో కొన్నిచోట్ల, పాకిస్తాన్ సైన్యం, ఆయుధాలు అని చెబుతూ తప్పుదోవ పట్టించే ఫోటోలు ఉపయోగించారు. అయితే, పాకిస్తాన్‌తో పాటు, తాలిబాన్లు కూడా ఈ వాదనలను కొట్టిపారేశారు.

పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి జనరల్ బాబర్ ఇఫ్తిఖర్ బీబీసీతో మాట్లాడారు. "ఇది పూర్తిగా అవాస్తవం", "భారతదేశం చేస్తున్న అహేతుకమైన ప్రచారం" అని అన్నారు.

"అఫ్గానిస్తాన్ లోపల ఏం జరిగినా పాకిస్తాన్‌కు సంబంధం లేదు, అది పంజ్‌షీర్ లేదా మరెక్కడైనా సరే" అని అన్నారు.

తాలిబాన్‌కు పాకిస్తాన్ మద్దతు ఇస్తోందని అమెరికాతో పాటు ఇతర దేశాలు చాలాకాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే, వీటిని పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.

కానీ, పాక్ సైనిక, గూఢచార సంస్థలలోని చాలా మంది తాలిబాన్‌తో సంబంధాలు కొనసాగించారు.

బీజింగ్ ఏవియేషన్ షోలో ప్రదర్శించిన CH-4 (ఫైల్ ఫోటో)

పాకిస్తాన్‌కు సొంత డ్రోన్‌లు ఉన్నాయా?

అవును, ఉన్నాయి.

మార్చి 2015 లో, ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నట్లు పాకిస్తాన్ నివేదించింది.

ఆ దాడిలో, దేశీయంగా తయారు చేసిన 'బుర్రాక్ డ్రోన్' ఉపయోగించారు. ఇది గాలిలో నుంచి ఉపరితలంపై లేజర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించగలదు.

బురాక్ డ్రోన్‌ను పాకిస్తాన్ జాతీయ ఇంజనీరింగ్, సైంటిఫిక్ కమిషన్ రూపొందించి అభివృద్ధి చేసింది. పాకిస్తాన్ టర్కీ లేదా చైనా లేదా రెండింటి సహాయంతో లాంగ్-రేంజ్ డ్రోన్‌లను కొనుగోలు చేసినట్లు కూడా నివేదికలు వచ్చాయి.

గత సంవత్సరం, చైనాలో తయారైన 'వింగ్ లూంగ్ II' ని పాకిస్తాన్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. లిబియా వివాదంలో యూఏఈ కూడా దీనిని ఉపయోగించినట్లు బీబీసీ విచారణలో వెల్లడైంది.

అయితే, వీటన్నిటిలో ముఖ్యమైన నివేదిక ఏమిటంటే, చైనాలో తయారైన సీహెచ్-4 డ్రోన్‌లను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. ఈ డ్రోన్ గూఢచర్యంతో పాటు దాడి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులతో పోరాడటానికి సౌదీ అరేబియా ఉపయోగిస్తున్న డ్రోన్‌లు ఇవే.

డిఫెన్స్ జర్నల్ 'జేన్స్ డిఫెన్స్ వీక్లీ' ప్రకారం, సీహెచ్-4 యూఏవీ రకానికి చెందిన మానవ రహిత వాహనం.

దీనిలో ఒక వేరియంట్, సీహెచ్-4ఏ, ప్రధానంగా నిఘా కోసం ఉపయోగిస్తారు. ఇది సుమారు 30 గంటలు గాలిలో ఉంటుంది. అదే సమయంలో, దాని రెండవ రకం సీహెచ్-4బీ. ఇది 345 కిలోల పేలుడు పదార్థాలను మోయగలదు. అది 14 గంటలు మాత్రమే గాలిలో ఉంటుంది.

పాకిస్తాన్ ఏ రకమైన వెర్షన్‌ని కలిగివుంది. అవి ఇప్పటికీ ఉపయోగంలో ఉన్నాయా లేదా అనే అంశంపై క్లారిటీలేదు. అదే సమయంలో, పాకిస్తాన్ అధికారులు లాంగ్-రేంజ్ డ్రోన్‌లు తమ వద్ద ఉన్నాయన్న వాదనను ఖండించారు.

ఇది కాకుండా, పాకిస్తాన్ వద్ద షాహపర్ 2 డ్రోన్ ఉంది. ఇది 14 గంటల పాటు గాలిలో ప్రయాణించగలదు. ఆయుధాలను కూడా మోయగలదు. పాకిస్తాన్‌లో ఇతర డ్రోన్‌లు కూడా ఉన్నాయి. కానీ, వాటిని నిఘా కోసం ఉపయోగిస్తారు. వాటికి ఆయుధాలను అమర్చలేరు.

పాకిస్తాన్ 2015లో చేసిన మిలటరీ పరేడ్‌లో ప్రదర్శించిన బుర్రాక్ డ్రోన్

అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ డ్రోన్‌లను ప్రయోగించగలదా?

ప్రస్తుతానికి, దీనికి సంబంధించి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు.

పాకిస్తాన్ డ్రోన్ ప్రోగ్రామ్‌ను సంవత్సరాలుగా ట్రాక్ చేస్తున్న ఓపెన్ సోర్స్ పరిశోధకులు సీహెచ్-4 డ్రోన్ చిత్రాన్ని పంచుకున్నారు. ఇది ఈ ఏడాది జూలై 12 నాటి చిత్రం. దీనిని 'గూగుల్ ఎర్త్' లో చూడవచ్చు. ఇందులో, బహవల్‌పూర్ సమీపంలోని ఎయిర్‌బేస్‌లో నాలుగు డ్రోన్‌లు కనిపిస్తాయి.

పాకిస్తాన్ డ్రోన్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ ఫోటో ఉపయోగపడవచ్చు. అయితే, ఈ డ్రోన్‌లను ఇటీవల పంజ్‌షీర్‌లో ఉపయోగించినట్లు మాత్రం రుజువు చేయలేం.

లండన్‌లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన జస్టిన్ బ్రోంక్ ఈ డ్రోన్‌ల ప్రమేయాన్ని అనుమానిస్తున్నారు.

చైనాలో తయారైన సీహెచ్-4 డ్రోన్, లాంగ్-రేంజ్ టార్గెట్‌లను గుర్తించడానికి చైనా శాటిలైట్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ను ఉపయోగించిందని ఆయన వివరించారు.

"పాకిస్తాన్ సరిహద్దు వెలుపల దాడులకు చైనా సిద్ధంగా ఉండదు" అని ఆయన చెప్పారు.

"అటువంటి పరిస్థితిలో, సీహెచ్-4కి గ్రౌండ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ లైన్-ఆఫ్-సైట్ రేడియో కంట్రోల్ లింక్ అవసరమవుతుంది. ఇది పాకిస్తాన్ సరిహద్దులోని కఠినమైన భూభాగంలో పని చేయడం చాలా కష్టతరం చేస్తుంది, కానీ, అసాధ్యం కాదు."

ఈ దాడి వల్ల అసలు పాకిస్తాన్ కి ఏం లాభం చేకూరుతుందనేది కూడా కీలక ప్రశ్నే.

"పాకిస్తాన్‌కు డ్రోన్‌ల సామర్థ్యం ఉందా లేదా అనే అంశాన్ని పక్కన పెడితే, ఈ దాడితో పాక్ కు వ్యూహాత్మక ప్రయోజనాలు అంటూ ఏమీ లేవు" అని ఇస్లామాబాద్‌కు చెందిన రక్షణ విశ్లేషకులు డాక్టర్ మరియా సుల్తాన్ చెప్పారు.

"అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితిని బట్టి, పాకిస్తాన్ నేరుగా అక్కడ జోక్యం చేసుకోవడం వల్ల వ్యూహాత్మక ప్రయోజనం ఏమైనా ఉంటుందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు"అని జస్టిన్ బ్రోంక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Afghanistan: Did Pak drones attack on Panjsheer valley
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X