AP Weather: ఏపీలో రేపు వీరికి ఎండలు- వారికి వర్షాలు..! ఎక్కడెక్కడ ఎలా..?
ఆంధ్రప్రదేశ్ లో మిశ్రమ వాతావరణ పరిస్ధితులు (Weather) కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల వడగాల్పులలతో జనం అల్లాడుతుంటే, మరికొన్నిచోట్ల మాత్రం వర్షాలతో కాస్త సేదతీరుతున్నారు. రేపు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్ధితులే ఉంటాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఇవాళ కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వర్షాలు కూడా కురిశాయి.
రేపు శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,మార్కాపురం, ప్రకాశం,నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప,తిరుపతి జిల్లాల్లోఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42-44 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం తెలిపింది. రేపు తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, కంచిలి, నందిగం,పాతపట్నం, సోంపేట, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం,వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట,గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాలు ఉన్నాయి.

మరోవైపు కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.














Click it and Unblock the Notifications