తాలిబన్ల అంతులేని అరాచకాలు-15 ఏళ్లు పైబడిన బాలికల కోసం వేట-బలవంతపు పెళ్లిళ్లు,గ్యాంగ్ రేప్స్
ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అంతు లేని అరాచకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఇతర దేశాలకు పారిపోతున్న ఆఫ్గనిస్తానీలు... తాలిబన్లు ఎంతటి ఉన్మాదులో బయటి ప్రపంచానికి చెబుతున్నారు. తాజాగా హోలీ,మెక్‌కే అనే మహిళా జర్నలిస్ట్ తాలిబన్ల దురాగతాలు,ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి బయటి ప్రపంచానికి తెలియజేశారు. డల్లాస్ మార్నింగ్ న్యూస్‌లో ఆమె రాసిన కథనం ద్వారాఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ తాలిబన్ల గురించి ఆమె చెప్పారంటే...

15 ఏళ్లు పైబడిన బాలికల కోసం తాలిబన్ల వెతుకులాట...
'గత వారం ఆఫ్గనిస్తాన్ దురాక్రమణ పూర్తయ్యాక... తాలిబన్లు ఇంటింటికి వెళ్లి మహిళలు,15 ఏళ్లు పైబడిన బాలికల కోసం వెతుకుతున్నారు.వారిని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నారు' అని మెక్ కే తెలిపారు. తాను ఆఫ్గనిస్తాన్‌ను వదిలి వచ్చినప్పటికీ... అక్కడున్న తన స్నేహితుల గురించి తలుచుకుంటే బాధగా ఉందన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని స్థితిలో వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు చెప్పారు. ఒకప్పుడు ఆఫ్గన్ గడ్డపై మహిళా హక్కుల కోసం తామెంతలా పోరాడమో గుర్తుచేసుకుంటున్నట్లు తెలిపారు.

ఆమె హృదయం ముక్కలవుతోంది...
ఆఫ్గనిస్తాన్ నుంచి పారిపోయే క్రమంలో కాబూల్‌లో ఓ 14 ఏళ్ల బాలికతో తాను మాట్లాడానని మెక్ కే తెలిపారు. ఆ బాలిక తనకు చదువుకోవాలని ఉందని... భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటున్నానని చెప్పిందన్నారు. కుందుజ్‌కి చెందిన ఆ బాలిక ప్రస్తుత పరిస్థితుల కారణంగా కుటుంబంతో కలిసి దేశం వీడుతోందన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో మహిళా హక్కుల కోసం పనిచేస్తూ... వారిపై అణచివేతను బయటి ప్రపంచానికి తెలియజేసిన ఫరీహా ఈసర్... ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులకు హృదయం ముక్కలయ్యేలా రోధిస్తోందన్నారు. 'నన్ను ఆఫ్గన్ నుంచి త్వరగా వచ్చేయాలని బయటి దేశాల్లోని మిత్రులు కోరారు. కానీ ఎలా వచ్చేది... ఇక్కడ నా అక్కాచెల్లెళ్లు ఇంత బాధను అనుభవిస్తుంటే... నేను మాత్రం ఎలా దేశం దాటిపోయేది..' అని ఆవేదన వ్యక్తం చేశారు.

బలవంతంగా 21 ఏళ్ల యువతిని తీసుకెళ్లిపోయారు...
బదాక్షన్ ప్రావిన్స్‌లో కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఘటన గురించి ఫరీహా తనతో చెప్పిందన్నారు. ఆ వివరాల ప్రకారం... తాలిబన్లు ఇంటింటికీ తిరుగుతూ 15 ఏళ్లు దాటిన బాలికల గురించి ఆరా తీస్తున్నారు. తమను తాము ఆఫ్గన్ రక్షకులమని,ఇస్లాం దూతలమని వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఓ ఇంటికి వెళ్లి ఆ కుటుంబ పెద్దతో మాట్లాడుతూ... అతని కూతుళ్లను తమ వెంట పంపించాలని కోరారు. తాలిబన్లు అడిగాక ఇక ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పని లేదు... నచ్చినా,నచ్చకపోయినా వారి వెంట తీసుకెళ్తారు. అలా 21 ఏళ్ల ఆ పెద్దాయన కూతురిని ఆ రాత్రి తాలిబన్లు బలవంతంగా తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఆ సమయంలో ఆమె తండ్రి నిస్సహాయుడిగా చూస్తుండిపోయాడు తప్ప ఏమీ చేయలేకపోయాడన్నారు.

ప్రతీ రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్...
ఆ తర్వాత మూడు రోజులకు ఆ తండ్రికి గుండె పగిలే విషయం తెలిసిందని మెక్ కే పేర్కొన్నారు. ఆమెను తీసుకెళ్లిన తాలిబన్ వ్యక్తితో పాటు మరో నలుగురు ప్రతీ రాత్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. ఇదే విషయాన్ని ఆ తండ్రి.. మరుసటిరోజు స్థానిక గవర్నర్ వద్దకు వెళ్లి వివరించాడు. అయితే ఆ గవర్నర్ తన చేతుల్లో ఏమీ లేదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీకై నువ్వు ఏమైనా చేయాలనుకుంటే చేయడం తప్ప తానేమీ చేయలేనని చెప్పారు. ఇలాంటి పరిస్థితులతో లక్షలాది మంది ఆఫ్గన్ బాలికలు,మహిళల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందని మెక్ కే ఆవేదన వ్యక్తం చేశారు.

తాలిబన్లు ఏమీ మారలేదు...
'తాము మారిపోయామని చెప్పేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. కానీ ఏమీ మారలేదు. ఇప్పుడే కాదు.. ఇంకెన్నటికీ వారు మారరు.తాలిబన్లు అంటేనే... హత్యలు,హింస,మానవ హక్కుల ఉల్లంఘన.' అని ఫరీహా వాపోయినట్లు మెక్ కే చెప్పారు.'నా సొంత అనుభవంలో ఉన్నది చెబుతాను. గత శనివారం మజర్ ఇ షరీఫ్ నగరాన్ని తాలిబన్లు ఆక్రమించుకోగానే ఒక్కసారిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. మహిళలతో కళకళలాడే ఆ నగరం ఘోస్ట్ సిటీ తరహాలో నిర్మానుష్యంగా మారిపోయింది. బయటకు వచ్చిన కొద్ది మహిళలు కూడా పూర్తిగా బుర్ఖాల్లో వచ్చారు.' అని మెక్ కే ఆఫ్గన్‌లో పరిస్థితుల గురించి వివరించారు.

సెక్స్ బానిసలుగా మహిళలు...
నజ్లా అయౌబి అనే ఆఫ్గనిస్తాన్ మాజీ న్యాయమూర్తి,మహిళా హక్కుల కార్యకర్త కూడా ఇటీవల అక్కడ చోటు చేసుకుంటున్న తాలిబన్ల అరాచకాలను అంతర్జాతీయ మీడియాకు వివరించారు.తాలిబన్ల అరాచకాల గురించి చెబుతూ... ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను నజ్లా అయౌబి ఉదహరించారు. తాలిబన్ ఫైటర్లకు వంట సరిగా చేయలేదనే కారణంతో ఓ మహిళను సజీవదహనం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో తిండికి కూడా ప్రజలు అలమటిస్తున్నారని... ఇలాంటి తరుణంలో తాలిబన్లు తమకు తిండి పెట్టాలని స్థానికులను వేధిస్తున్నారని,హింసిస్తున్నారని చెప్పారు. అంతేకాదు,గత కొద్ది వారాలుగా ఎంతోమంది యువతులను శవపేటికల్లో పొరుగు దేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. వారిని సెక్స్ బానిసలుగా వాడుకునేందుకే ఇలా తరలిస్తున్నారని తెలిపారు.
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలను తాలిబన్లు వేధింపులకు గురిచేస్తున్నారని నజ్లా అయౌబి తెలిపారు. మీ కూతుళ్లను తమకిచ్చి పెళ్లి చేయాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు. ఓవైపు ఇస్లామిక్ షరియా చట్టాలకు లోబడి మహిళలకు విద్య,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే... మరోవైపు ఇలాంటి అరాచకాలకు తెగబడటమేంటని ప్రశ్నించారు. తాలిబన్ల పాలనలో జీవితమొక కాళరాత్రిగా మారిపోయిందన్నారు. తాలిబన్ల రాకకు ముందు రోజు వరకు తాను శక్తివంతమైన స్థానంలో ఉన్నానని... ఇప్పుడు తన స్థానం నథింగ్ అని వాపోయారు.












Click it and Unblock the Notifications