వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అనుమతించాలని కోరిన తాలిబాన్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ

న్యూయార్క్ నగరంలో ఈ వారం జరగబోతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించేందుకు అనుమతించాలని తాలిబాన్లు అభ్యర్థించారు.

ఐరాసను అభ్యర్థిస్తూ తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ సోమవారం ఓ లేఖ రాశారు. ఈ విషయంపై ఐరాస ఉన్నత స్థాయి కమిటీ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

దోహాలో తమకు అధికార ప్రతినిధిగా కొనసాగిన సుహైల్ షహీన్‌ను ఐరాస రాయబారిగా తాలిబాన్లు నామినేట్ చేశారు.

మరోవైపు ఘనీ ప్రభుత్వం తరఫున ఐరాస రాయబారిగా పనిచేసిన దౌత్యవేత్త ఘులాం ఇసాక్‌జాయ్‌ను ఈ పదవి నుంచి తొలగించినట్లు తాలిబాన్లు స్పష్టంచేశారు.

ఐరాస ఉన్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని తాలిబాన్లు చేసిన అభ్యర్థనను అమెరికా, చైనా, రష్యా తదితర దేశాల ప్రతినిధులతో కూడిన క్రిడెన్షియల్స్ కమిటీ పరిశీలిస్తున్నట్లు ఐరాస అధికార ప్రతినిధి తెలిపారు.

అయితే, వచ్చే సోమవారం తర్వాతే ఈ కమిటీ సమావేశమయ్యే అవకాశముంది. మరోవైపు సోమవారంతో సర్వప్రతినిధి సభ సమావేశాలు ముగుస్తాయి. ఐరాస నిబంధనల ప్రకారం.. అఫ్గాన్ రాయబారి పదవిలో గులాం ఇంకా కొనసాగుతున్నారు.

తాలిబాన్లు

సమావేశాల చివరి రోజు, అంటే సోమవారం ప్రపంచ నాయకులను ఉద్దేశించి గులాం ప్రసంగించే అవకాశముంది. అయితే, ఆయన తమ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించట్లేదని తాలిబాన్లు స్పష్టంచేశారు. మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీని చాలా దేశాలు నేడు గుర్తించడంలేదని తాలిబాన్లు వివరించారు.

ఆగస్టు 15న కాబుల్‌ను తాలిబాన్లు ఆక్రమించడంతో, ఘనీ దేశాన్ని వదిలివెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యూఏఈలో ఆశ్రయం పొందుతున్నారు.

1996 నుంచి 2001 మధ్య అఫ్గాన్‌ను తాలిబాన్లు పాలించినప్పుడు, ఇదివరకటి ఐరాస రాయబారి ఆ పదవిలోనే కొనసాగారు. తాలిబాన్లు తమ కొత్త రాయబారిని గుర్తించాలని చేసిన అభ్యర్థనకు ఐరాస నిరాకరించింది.

అయితే, తాలిబాన్లతో కలిసి పనిచేయాలని ఐరాసను మంగళవారం ఖతార్ అభ్యర్థించింది.

''వారిని బహిష్కరిస్తే, ప్రపంచ దేశాలు గ్రూపులుగా విడిపోయే అవకాశముంది. వీరితో చర్చల వల్ల ప్రయోజనాలు ఉంటాయి’’అని ఖతార్ ప్రధాని షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ అన్నారు.

అఫ్గాన్ శాంతి చర్చల్లో ఖతార్ ప్రధాన పాత్ర పోషించింది. తాలిబాన్లు, అమెరికాల మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. 2020లో వీరి మధ్య కుదిరిన ఒప్పందంతో, అఫ్గాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణకు అమెరికా అంగీకరించిన సంగతి తెలిసిందే.

తాలిబాన్లు అధికారంలోకి రావడంతో అఫ్గాన్‌ను వదిలి వెళ్లిపోతున్న విదేశీయులకు కూడా ఖతార్ సాయం అందిస్తోంది. మరోవైపు అఫ్గాన్‌లో తాలిబాన్ల చర్చల్లోనూ ఖతార్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఐపీఎల్

ఐపీఎల్ ప్రసారాలపై తాలిబాన్ నిషేధం

యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై అఫ్గాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఆదివారం దుబాయిలో ఐపీఎల్-2021 మొదలైంది.

అయితే, స్టేడియంకు మహిళా ప్రేక్షకులు పెద్దయెత్తున రావడంతోపాటు అమ్మాయిల డ్యాన్స్‌ల వల్లే ఐపీఎల్ ప్రసారాలపై ఈ ఆంక్షలు విధించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఈ విషయంపై టోలో న్యూస్‌లో పనిచేస్తున్న అఫ్గాన్ జర్నలిస్టు, అఫ్గాన్ రక్షణ శాఖ మాజీ అధికార ప్రతినిధి ఫవాద్ అమన్ ఒక ట్వీట్ చేశారు.

https://twitter.com/FawadAman2/status/1440194549234626561

''ఐపీఎల్ ప్రసారాలపై అఫ్గానిస్తాన్‌లో నిషేధం విధించారు. క్రికెట్ గ్రౌండ్‌కు మహిళలు పెద్దయెత్తున రావడంతో పాటు మహిళల డ్యాన్స్‌ల వల్ల ఈ ప్రసారాలను నిలిపివేయాలని అఫ్గాన్ మీడియా సంస్థలకు తాలిబాన్లు ఆదేశాలు జారీచేశారు''అని ఫవాద్ ట్వీట్ చేశారు.

తాలిబాన్లు

క్రికెట్ బోర్డు సీఈవోకు ఉద్వాసన

అఫ్గాన్ క్రికెట్ బోర్డు సీఈవో హమిద్ షిన్వారీని తాలిబాన్లు పదవి నుంచి తొలగించినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.

హక్కానీ నెట్‌వర్క్ ప్రధాన నాయకుల్లో ఒకరైన అనాస్ హక్కానీకి తాలిబాన్ ఈ పదవి అప్పగించింది. తాలిబాన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీకి అనాస్ హక్కానీ తమ్ముడు.

ఇదివకరటి తాలిబాన్ ప్రభుత్వంలో అన్ని ఎంటర్‌టైన్మెంట్ కార్యక్రమాలపైనా తాలిబాన్లు నిషేధం విధించారు. క్రికెట్‌తోపాటు అన్ని స్పోర్ట్స్‌పైనా ఆంక్షలు కొనసాగాయి.

ఆనాడు క్రికెట్ స్టేడియంలో ప్రజలకు బహిరంగంగా శిక్షలు విధించేవారు. మహిళలు ఎలాంటి స్పోర్ట్స్‌లోనూ పాల్గొనకుండా ఆంక్షలు అమలులో ఉండేవి.

అయితే, ప్రస్తుతం స్పోర్ట్స్‌లో మహిళలు పాల్గొనడంపై తమ విధానాలు ఏమిటో ఇంకా తాలిబాన్లు ప్రకటించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Afghanistan: Taliban seek permission to address UN General Assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X