• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఫ్గానిస్తాన్: ‘ఇక్కడ నిత్యం ప్రాణభయంతో బతుకుతున్నాం’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అఫ్గానిస్తాన్ మహిళలు

అఫ్గానిస్తాన్‌ నుంచి అక్కడి పౌరులు బ్రిటన్ రావడానికి సాయం చేసేందుకు బ్రిటన్ అఫ్గాన్ సిటిజన్స్ రీసెటిల్‌మెంట్ స్కీమ్ (ఏసీఆర్ఎస్) ప్రారంభించి దాదాపు సంవత్సరం కావస్తోంది.

కానీ ఈ పథకం అమలు నత్తనడకన సాగుతోందని.. ఫలితంగా తీవ్ర ప్రమాదంలో ఉన్నవారు అఫ్గానిస్తాన్‌లోనే చిక్కుకుపోతున్నారని పార్లమెంటు సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

''అనుక్షణం భయంభయంగా గడుపుతున్నాం. మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నాం’’ అంటున్నారు ఘాజల్.

2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవటానికి ముందు ఆమె జర్నలిస్ట్‌గా, లెక్చరర్‌గా పని చేశారు.

మహిళల హక్కుల కోసం కూడా గళమెత్తారు. అందువల్ల తాలిబాన్ల నుంచి తనకు ముప్పు ఉందని ఆమె ఆందోళన చెందుతున్నారు.

ఛాందసవాద ఇస్లామిక్ గ్రూప్ తాలిబాన్.. తనను వేధించే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన చెందుతుండటంతో బీబీసీ ఆమె అసలు పేరును వెల్లడించటంలేదు.

ఏసీఆర్ఎస్ పథకం ద్వారా బ్రిటన్ రావటం కోసం ఆమె ఈ ఏడాది జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు రిఫరెన్స్ కూడా ఆమెకు వచ్చింది. కానీ ఆ తర్వాత ఇంతవరకూ ఎలాంటి సమాచారం అందలేదు.

ఆమె ఇంకా అఫ్గానిస్తాన్‌లోనే ఉన్నందున ఈ పథకం తొలి ఏడాదిలో ఆమె బ్రిటన్ రావటానికి అర్హురాలు కాదు. ఈ పథకం తొలి ఏడాదిలో ప్రమాదంలో ఉన్న మూడు రకాల బృందాల్లోని వారిని మాత్రమే బ్రిటన్ తీసుకురావటానికి పరిగణనలోకి తీసుకుంటున్నారు.

మరోవైపు తాలిబాన్లకు దొరకకుండా తప్పించుకోవటానికి ఘాజల్ తన బంధువులు, స్నేహితుల ఇళ్లలో దాక్కుంటూ స్థావరాలు మారుస్తూ భయంభయంగా గడుపుతున్నారు.

అఫ్గాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక మహిళల హక్కులను హరించారు.

మహిళలను కొన్ని రకాల ఉద్యోగాలు, వృత్తులు చేయకుండా నిషేధించారు. ప్రాథమికోన్నత విద్య చదువుకోవటాన్నీ నిషేధించారు. పురుష సంరక్షకుడి తోడు లేకుండా ఎక్కువ దూరాలు ప్రయాణించటాన్నీ నిషేధించారు.

ఘాజల్ అవివాహితురాలు. ఆమె పాత ఉద్యోగం చేయలేకపోతున్నారు. దీంతో ఆర్థికంగా కూడా తీవ్ర కష్టాలు పడుతున్నారు. దాచుకున్న కాస్తో కూస్తో డబ్బులు కూడా అయిపోయాయి.

''నాకు చాలా గౌరవం ఉండేది. మంచి కెరీర్ ఉండేది. ఆర్థికంగా కూడా అప్పుడు మంచి స్థితిలో ఉన్నాను. నా కలల ఉద్యోగం చేసేదాన్ని. కానీ అకస్మాత్తుగా అగాథంలోకి జారిపోయాను. ఇప్పుడు కనీసం నాకు ఒక గుర్తింపంటూ ఏదీ లేదు. ఇది చాలా బాధాకరంగా ఉంది. తీవ్ర అలజడి, ఆందోళన కలిగిస్తోంది’’ అని ఆమె ఒక దుబాసీ ద్వారా బీబీసీతో మాట్లాడుతూ తన పరిస్థితిని వివరించారు.

'అఫ్గానిస్తాన్‌లోనే ఉంటే మీకు, మీ సోదరికి ఏం జరుగుతుందని మీరు భయపడుతున్నారు?’ అని ప్రశ్నించగా.. ''బహుశా ఎవరైనా మమ్మల్ని చంపేయొచ్చు. లేదంటే మేమే ఆత్మహత్య చేసుకుంటామేమో. కాదంటే గుండెపోటు వచ్చి చచ్చిపోతామేమో’’ అని ఆమె బదులిచ్చారు.

''భవిష్యత్తు గురించి మాకు ఏ ఆశా లేదు’’ అన్నారు.

ప్రజాస్వామ్యం కోసం కృషి చేసిన బృందాలు, మహిళా హక్కుల ఉద్యమకారులు, ఎల్‌జీబీటీ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని లేబర్ పార్టీకి చెందిన ఎంపీ స్టీఫెన్ కినాక్ గుర్తుచేశారు.

కానీ ఏసీఆర్‌సీ పథకం తొలి ఏడాదిలో ఈ పథకం కింద పరిగణనలోకి తీసుకోవాల్సిన అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారు ఇప్పటికే అఫ్గానిస్తాన్ విడిచి వచ్చేసి ఉండాల్సింది.

అఫ్గాన్ నుంచి పొరుగు దేశాల్లోకి వెళ్లటానికి సరిహద్దు దాటటం ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే అందుకు అవసరమైన ప్రయాణ పత్రాలు పొందటం చాలా కష్టం. ముఖ్యంగా తాలిబాన్ల కంటపడకుండా తప్పించుకుని తిరుగుతున్న వారికి ఆ పత్రాలు దొరకటం దాదాపుగా అసాధ్యం.

అఫ్గానిస్తాన్‌లో ప్రమాదంలో ఉన్న వారందరూ ఏసీఆర్‌సీ పథకం తొలి ఏడాదిలోనే రీసెటిల్‌మెంట్‌కు అర్హులు కావాలని, వారు ఆ దేశం విడిచి వెళ్లటానికి సాయం చేయాలని కినాక్ పేర్కొన్నారు.

''మన బాధ్యతలను నెరవేర్చటంలో, వారికి మద్దతు ఇవ్వటంలో మనం విఫలమవటం నిజంగా సిగ్గుచేటు’’ అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు.

''మనం గొప్పగా భావించే విలువల కోసం – ప్రజాస్వామ్యం, సమ్మిళితం, చట్టబద్ధత అనే విలువల కోసం వారు నిలబడ్డారు. దాని ఫలితంగా వారు తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టారు. చాలా ఉదంతాల్లో మనం వారిని పట్టించుకోకుండా వదిలేశాం’’ అని ఆయన పేర్కొన్నారు.

బ్రిటన్‌కు వచ్చిన అఫ్గాన్లలో చాలా మందిని 'ఆపరేషన్ పిటింగ్’ ద్వారా అక్కడి నుంచి తరలించారు. 2021 ఆగస్టులో కాబూల్‌ను తాలిబాన్లు ఆక్రమించుకుంటున్న సమయంలో ఈ ఆపరేషన్ ద్వారా దాదాపు 15,000 మందిని విమానాల్లో తీసుకువచ్చారు.

వారిలో చాలా మంది బ్రిటిష్ జాతీయులు, అఫ్గాన్‌లో బ్రిటన్ కోసం పని చేసిన వారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా అఫ్గాన్ రిలొకేషన్స్ అండ్ అసిస్టెన్స్ పాలసీ కింద అర్హులైన వారు.

అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకున్న అనంతరం.. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న 20,000 మంది వరకూ అఫ్గాన్లకు రాబోయే సంవత్సరాల్లో ఏసీఆర్‌సీ పథకం కింద పునరావాసం కల్పిస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది.

ఏసీఆర్‌సీ కింద రీసెటిల్‌మెంట్‌కు మూడు మార్గాలున్నాయి:

  • ఒకటో మార్గం కింద.. గత ఏడాది మొదటిసారి తరలించినపుడు బ్రిటన్ చేరుకున్న వ్యక్తులను ఏసీఆర్‌సీ కింద ముందుగా అంగీకరిస్తారు. అఫ్గాన్ నుంచి తరలించటానికి అనుమతి పొంది, అనంతర కాలంలో ఏదో విధంగా బ్రిటన్ చేరుకున్న వారిని కూడా ఈ మార్గం కింద అంగీకరిస్తారు.
  • రెండో మార్గం కింద.. అఫ్గానిస్తాన్ నుంచి పారిపోయి పొరుగు దేశాలకు చేరుకోగలిగిన వారిలో.. ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ, మానవ హక్కుల సంస్థలు సిఫారసు చేసిన వారిని బ్రిటన్ అంగీకరిస్తుంది.
  • మూడో మార్గం కింద.. తొలి ఏడాది కేవలం మూడు రకాల బృందాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. బ్రిటిష్ కౌన్సిల్ కాంట్రాక్టర్లు, కాబూల్‌లో బ్రిటిష్ రాయబార కార్యాలయానికి భద్రత అందించిన గార్డావరల్డ్ కంపెనీ కాంట్రాక్టర్లు, బ్రిటన్‌కు చెందిన చెవెనింగ్ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ పథకం పాత విద్యార్థులు.. ఈ మూడు బృందాల వారు.
  • మొదటి సంవత్సరం తర్వాత.. అఫ్గానిస్తాన్‌లో ప్రమాదంలో ఉన్న మరింత విస్తృత బృందాలను మూడో మార్గం కింద పరిగణనలోకి తీసుకుంటారు. వారిలో మహిళలు, మతపరమైన మైనారిటీలు, వివక్షాపూరిత దాడులకు గురికాగల ఇతరులు ఈ బృందాల్లో ఉన్నారు.
అఫ్గాన్ మహిళల నిరసనలు

ఏసీఆర్‌సీ పథకాన్ని 2022 జనవరిలో లాంఛనంగా ప్రారంభించినప్పటికీ.. రెండు, మూడ్ మార్గాలు జూన్ నెలలో ఆరంభమయ్యాయి.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి 801 మంది అఫ్గాన్ శరణార్థులను బ్రిటన్‌కు సిఫారసు చేసింది. కానీ వారిలో 67 మంది మాత్రమే రిసెటిల్‌మెంట్ కోసం బయలుదేరారని తాజా గణాంకాలు చెప్తున్నాయి.

అలాగే ఏసీఆర్‌సీ పథకంలో రెండో మార్గం ద్వారా సెప్టెంబర్ చివరి నాటికి కేవలం నలుగురు వ్యక్తులను మాత్రమే రిసెటిల్ చేసినట్లు హోం ఆఫీస్ గణాంకాలు చెప్తున్నాయి.

జనం శరణార్థి శిబిరాల్లో మగ్గిపోకుండా చూడటానికి, తమను తిరిగి అఫ్గానిస్తాన్ పంపించివేస్తారేమోనని నిరంతరం భయం నీడలో ఉండకుండా చూడటానికి.. ఈ కేసుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరముందని కినాక్ పేర్కొన్నారు.

ఏసీఆర్‌సీ పథకంలో మూడో మార్గం కింద తొలి ఏడాది 1,500 మందికి అవకాశం ఉంది. కానీ ఈ మార్గంలో ఎవరైనా బ్రిటన్ చేరుకోవటం మొదలైందా లేదా అన్న విషయాన్ని హోం ఆఫీస్ నిర్ధారించలేదు.

ఈ పథకంలో మొదటి మార్గం కింద దాదాపు 6,300 అఫ్గాన్లకు నిరవధికంగా బ్రిటన్‌లో ఉండటానికి అనుమతి మంజూరు చేశారు.

''ప్రజాస్వామ్యం, వాక్‌స్వాతంత్ర్యం వంటి విలువల కోసం కృషి చేసిన వారి’’తో పాటు, మహిళలు, బాలికలు సహా ప్రమాదంలో ఉన్న వ్యక్తులు ఈ 6,300 మంది అఫ్గాన్లలో ఉన్నారని హోం ఆఫీస్ అధికార ప్రతినిధి చెప్పారు.

ప్రమాదంలో ఉన్న అఫ్గాన్ మహిళలకు నిర్దిష్ట ఆశ్రయ మార్గం ప్రకటించాలంటూ వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలు, వారి సహచరులు విదేశాంగ మంత్రికి ఒక లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

''అఫ్గాన్ మహిళా కార్యకర్తలు బ్రిటన్ రావటానికి సురక్షితమైన మార్గం కనుగొనటం దాదాపుగా అసాధ్యంగా ఉంది. మనం వారిని గాలికి వదిలేస్తున్నాం’’ అని ఆ లేఖ మీద సంతకం చేసిన కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కారొలిన్ నోక్స్ విచారం వ్యక్తంచేశారు.

''అత్యంత ప్రమాదంలో ఉన్న వారికి ఏసీఆర్‌సీ తక్షణ ప్రాధాన్యం ఇవ్వటం లేదని రెఫ్యూజీ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థకు చెందిన టామ్సిన్ బాక్స్‌టర్ విమర్శించారు.

''ప్రాణాలు ప్రమాదంలో ఉన్న జనం గురించి మేం మాట్లాడుతన్నాం’’ అన్నారామె.

గత ఏడాది తొలుత అఫ్గాన్ నుంచి విమానాల్లో తరలించిన అనంతరం రిసెటిల్‌మెంట్ ప్రక్రియ గణనీయంగా స్తంభించిపోయిందని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Afghanistan: 'We live in constant fear of life here'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X