ఎయిర్ ఇండియా క్రాష్ లో మరో ట్విస్ట్..! మృతదేహాలు ఒకరికి బదులు మరొకరికి.. !
గత నెలలో జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో 275 మంది వరకూ చనిపోయారు. వీరిలో 50 మంది వరకూ బ్రిటిష్ పౌరులున్నారు. ఈ ప్రమాదం తర్వాత వీరి మృతదేహాల్ని గుర్తించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి యూకేకు పంపారు. అయితే వీటిని అందుకున్న బ్రిటిష్ కుటుంబాలు.. తమ వారి మృతదేహాలకు బదులు ఇంకొకరివి వచ్చాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బ్రిటీష్ మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధితుల కుటుంబాలకు తప్పుడు మృతదేహాలను పంపారని, కొంతమందికి జూన్ 12న జరిగిన సంఘటనలో మరణించిన ఒకరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల అవశేషాలు కలిసి పోయి వచ్చాయని బ్రిటన్ కు చెందిన డైలీ మెయిల్ పేర్కొంది. అయితే భారత్ లో అప్పగించిన మృతదేహాల విషయంలో ఇలాంటి పొరబాటు జరగలేదని తెలిపింది. దీంతో విమర్శలు వచ్చాయి.

కొన్ని కుటుంబాలు తమ వారి మృతదేహాలను బ్రిటన్ కు తరలించే ముందు తప్పుగా గుర్తించబడ్డాయని పేర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో తమకు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల అవశేషాలు కూడా వచ్చాయని ఆరోపించాయి. ఇలాంటి రెండు ఘటనలు జరిగినట్లు బ్రిటీష్ మీడియా తెలిపింది. ఇన్నర్ వెస్ట్ లండన్ కరోనర్ డాక్టర్ ఫియోనా విల్కాక్స్ కుటుంబాలు అందించిన నమూనాలతో వారి డీఎన్ఏను సరిపోల్చడం ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చిన తమ పౌరుల గుర్తింపులను ధృవీకరించడానికి ప్రయత్నించిన తర్వాత ఈ విషయం వెల్లడైందని పేర్కొంది.

దీనిపై భారత్ స్పందించింది. ఈ ఫిర్యాదులు పరిష్కరించడానికి భారత అధికారులు యూకేలోని తమ అధికారులతో కలిసి పని చేస్తూనే ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము బ్రిటీష్ మీడియా కథనాలను చూశామని, ఈ ఫిర్యాదులు తమ దృష్టికి రాగానే బ్రిటన్ తో కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. సంబంధిత అధికారులు అమల్లో ఉన్న ప్రోటోకాల్‌లు , సాంకేతిక అవసరాల ప్రకారం బాధితుల గుర్తింపును చేపట్టారని తెలిపారు.
అన్ని మృతదేహాలను అత్యంత వృత్తి నైపుణ్యంతో , మరణించిన వారి గౌరవానికి భంగం కలగకుండా పంపామన్నారు.












Click it and Unblock the Notifications