Amazon: మంటల్లో డ్రోన్ సెంటర్లు-అమెజాన్ షాకింగ్-కస్టమర్లకు కీలక అప్డేట్..!
ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel)ప్రారంభించిన దాడులు, వాటికి ప్రతీకారంగా ఆ దేశం చేస్తున్న ప్రతిదాడుల్లో పశ్చిమాసియా రావణకాష్టంలా మారుతోంది. దీంతో ఇన్నాళ్లూ గల్ఫ్ దేశాలు సురక్షితమని భావించి ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టిన అమెరికా సంస్థలకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సుప్రీం లీడర్ ఖమేనీ హత్య తర్వాత పశ్చిమాసియాలో అమెరికా ఆస్తుల్లో ఏ ఒక్క దాన్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించిన ఇరాన్ అన్నంత పనీ చేస్తోంది. ఇదే క్రమంలో రెండు గల్ఫ్ దేశాల్లోని అమెజాన్ డేటా సెంటర్ల (amazon data centres)పై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.
ఈ దాడుల్లో యూఏఈ (UAE), బహ్రెయిన్ (bahrain)లోని అమెజాన్ డేటా సెంటర్లు భారీగా దెబ్బతినడంతో పాటు మంటలు కూడా చెలరేగినట్లు ఇవాళ ఆ సంస్థ వెల్లడించింది. డ్రోన్ దాడుల్లో రెండు దేశాల్లో తమ డేటా సెంటర్లు దెబ్బ తిన్నాయని అంగీకరించిన అమెజాన్.. ఈ మేరకు ఇవి అందిస్తున్న సేవల్లో అంతరాయాలు కొనసాగుతాయని ప్రకటించింది. వీటిని వెంటనే సాధారణ స్దితికి తీసుకురావడం కష్టం కాబట్టి మరికొంతకాలం అంతరాయాల బాధ తప్పదని తమ కస్టమర్లకు తేల్చేసింది.

డ్రోన్ దాడుల వల్ల దెబ్బతిన్న తమ డేటా సెంటర్ల పునరుద్దరణకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు అమెజాన్ తెలిపింది. అలాగే యూజర్లు అప్పటివరకూ తమ డేటాను సురక్షితంగా ఉంచుకుని, తమ ఇతర డేటా సెంటర్లకు వాటిని మార్చుకోవాలని కోరుతోంది. దీంతో యూజర్లకు కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ దాడులు మరికొన్ని రోజులు కొనసాగితే అమెజాన్ క్లౌడ్ సేవలకు మరిన్ని అంతరాయాలు తప్పేలా కనిపించడం లేదు. దీంతో అమెజాన్ ప్రత్యామ్నాయ మార్గాల్ని కూడా అన్వేషిస్తోంది. ప్రస్తుతానికి యూజర్లు డేటాను ఇతర డేటా సెంటర్లకు మార్చుకోవాలని మాత్రం అమెజాన్ కోరింది.












Click it and Unblock the Notifications