అమెరికాలోనూ ఆకస్మిక వరదలు.. 20 మందికిపైగా గల్లంతు.. సహాయక చర్యలు ముమ్మరం
ఓ వైపు ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకున్న నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలోనూ ఆకస్మిక వరదలు సంభవించాయి. ఆరిజోనాలోని గ్రాండ్ కాన్యన్ నేషనల్ పార్క్ లో సంభవించిన వరదల ధాటికి 20 మందికి పైగా గల్లంతైనట్లు సమాచారం. వరదల కారణంగా పార్క్ లోని బ్రైట్ ఏంజెల్ కాన్యన్, ఫాంటమ్ రాంచ్ ప్రాంతాలు నీట మునిగాయి.
ఈ వరదల ధాటికి ఆ ప్రాంతాల్లోని పెద్ద బండరాళ్లు, లోహపు నిర్మాణాలు కొలరాడో నదిలోకి కొట్టుకుపోయాయి. ఇక ఈ వరదల్లో 20 మందికి పైగా గల్లంతు కాగా.. వారిలో ఎక్కువ శాతం అంటే దాదాపు 15 మంది పర్వతారోహకులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఆకస్మిక వరదలకు సంబంధించిన సమాచారం అందగానే వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ మేరకు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం సుమారు 2 గంటల 30 నిముషాల సమయంలో బ్రైట్ ఏంజెల్ క్రీక్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతంగా పెరిగింది. వరద నీరు కొలరాడో నదిలోకి దూసుకెళ్లడంతో మార్గంలోని ఫుట్ బ్రిడ్జ్ లు ధ్వంసం అయ్యాయి. భారీ వరద ప్రవాహం కారణంగా అక్కడి భౌగోళిక స్వరూపమే మారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా పెరిగిందని అన్నారు. ఇక ఇప్పటివరకూ వరదల బారి నుంచి 62 మందిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు నేషనల్ పార్క్ సర్వీస్ వెల్లడించింది.

అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదైనట్లు అధికారులు వెల్లడించలేదని పేర్కొంది. గల్లంతైన వారికోసం ప్రస్తుతం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతోందని స్పష్టం చేసింది. ఇక సోమవారం మరింత భారీ స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉన్న తరుణంలో అక్కడి వాతావరణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారులు, ప్రజల్ని అప్రమత్తం చేసింది. మరోసారి ఆకస్మిక వరదలతోపాటు శిథిలాల ప్రవాహం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఈ మేరకు అధికారులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications