మొన్న కార్చిచ్చు, నేడు తుఫాను.. మరోసారి ప్రకృతి ప్రకోపానికి అమెరికా విలవిల.. 34 మంది మృతి
ప్రకృతి ప్రకోపానికి అగ్రరాజ్యం విలవిల్లాడుతోంది. మొన్న ఆ మధ్య కార్చిచ్చు కారణంగా తీరని నష్టం చూసిన అమెరికాను.. ఈసారి తుఫాను విషాదంలో మునిగిపోయేలా చేస్తోంది. అమెరికాలో తుఫాను భీభత్సం సృష్టించింది. దేశవ్యాప్తంగా 16 కౌంటీల్లో అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వ్యాపార సంస్థలు సైతం నష్టపోగా.. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లుగా సమాచారం. ఈ విషాద ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే మిస్సౌరీలో సుడిగాలి కారణంగా 11 మంది మరణించారని, 29 మందికి పైగా గాయపడ్డారని స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు స్పష్టం చేశారు. అర్కాన్సాస్ లోని ఇండిపెండెన్స్ కౌంటీలో ముగ్దురు మరణించగా, 29 మంది గాయపడ్డారు. అలానే టెక్సాస్ లోని అమరిల్లో ముగ్దురు మరణించారు. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో మూడు కౌంటీలలో ఆరుగురు మరణించారని.. ముగ్గురు తప్పిపోయారని మిస్సిసిప్పి గవర్నర్ ప్రకటించారు.

అంతే కాకుండా తుఫాను విధ్వంసానికి అమెరికాలోని 100కు పైగా ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయని వాపోతున్నారు. టెక్సాస్ పాన్ హ్యాండిల్‌లోని అమరిల్లోలో దుమ్ము తుఫాను కారణంగా కారు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారని భద్రతా సిబ్బంది తెలిపారు. పదుల సంఖ్యలో అడవుల్లో మంటలు చెలరేగినట్లు కూడా భావిస్తున్నారు. అమెరికాలోని రాష్ట్రాలన్నింటిలో కలిపి దాదాపు 2 లక్షలకు పైగా ఇళ్లలో కరెంటు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
మరో వైపు మిన్నెసోటా లోని పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ డకోటా లోని తూర్పు ప్రాంతాలకు జాతీయ వాతావరణ సేవ మంచు తుఫాను హెచ్చరికను జారీ చేసింది. 3 నుంచి 6 అంగుళాల మంచు పేరుకుపోయే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ విధ్వంసకర పరిస్థితుల్లో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై కార్లతో పాటు పెద్ద పెద్ద ట్రక్కులు కూడా బోల్లాపడినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications