డొక్లాం స్టాండప్: యుద్ధం అనివార్యమైతే ఇరువైపులా...

భారత్ - భూటాన్ - చైనా మధ్య గల డొక్లాం కనుమ. సరిహద్దుల్లో ఉన్న ముక్కోణ జంక్షన్.. ఇప్పటికే నేపాల్‌ను తన దారికి తెచ్చుకున్న చైనా.. భూటాన్‌ను కూడా తనతో కలిపేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది.

బీజింగ్/ న్యూఢిల్లీ: భారత్ - భూటాన్ - చైనా మధ్య గల డొక్లాం కనుమ. సరిహద్దుల్లో ఉన్న ముక్కోణ జంక్షన్.. ఇప్పటికే నేపాల్‌ను తన దారికి తెచ్చుకున్న చైనా.. భూటాన్‌ను కూడా తనతో కలిపేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. అందుకే డొక్లాం వద్ద ఉద్రిక్తతకు తెరదీసింది. అతి చిన్న దేశమైన భూటాన్.. దౌత్యసాయం కోసం భారత్‌ను అభ్యర్థించింది. అదే చైనాకు కంటగింపుగా మారింది.

దానికి బదులు భారత సైన్యం తమ భూభాగంలోకి వచ్చిందని.. భారత్ ప్రభుత్వం.. తొలి ప్రధాని నెహ్రూ సూచించిన 'పంచశీల' సూత్రాలను ఉల్లంఘిస్తున్నదని.. భారత సైన్యం వెనక్కు తగ్గకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలతో.. అధికార మీడియా మాటున వండి వార్చిన కథనాలను వెలువరిస్తున్నది. తాజాగా సిక్కింకు స్వాతంత్ర్యం ప్రసాదిస్తామనే వరకూ వెళ్లింది. కానీ భారత్ కూడా ఆచితూచి స్పందిస్తూనే ఉన్నది. భూటాన్ విషయంలో దౌత్య పరమైన చర్చలకు సిద్ధమైతే సమస్య పరిష్కారానికి సిద్ధమని సంకేతాలిచ్చింది.

గమ్మత్తేమిటంటే జర్మనీలోని హంబర్గ్ నగరంలో శుక్ర, శనివారాల్లో జరిగే 'జీ - 20' సదస్సులో ఇరు దేశాధినేతలు నరేంద్రమోదీ, జీ జిన్‌పింగ్ పాల్గొంటారు. ప్రపంచ దేశాధినేతలు అంతర్జాతీయ సదస్సులకు హాజరైనప్పుడు పరస్పరం భేటీలు కావడం సంప్రదాయం కూడా. అందునా పొరుగు దేశాలూ.. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలను అందించేందుకు ఏర్పాటైన 'బ్రిక్స్' కూటమిలో కీలక సభ్య దేశాలు భారత్, చైనా. కానీ చైనా అధికారులకు మాత్రం ఈ సంగతేం పట్టినట్లు కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ అధ్యక్షుడు జిన్ పింగ్.. భారత ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కాబోరని పేర్కొంటే.. తామేమీ సమయం కేటాయించమని చైనాను కోరలేదని దీటుగా భారత్ సమాధానమిచ్చింది.

ఆసియాలో పెద్దన్న పాత్ర కోసం చైనా పాట్లు

రెండు దేశాలు అమెరికాతో సంబంధాలు సాగిస్తూనే ఉన్నాయి. కానీ ఆసియా ఖండంలో పెద్దన్న పాత్ర పోషించాలని చైనా కలలు కంటున్నది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, చైనా మధ్య యుద్ధం వస్తే రెండు దేశాలకు ఆర్థికంగా నష్టం చేకూరుతుందే తప్ప, ఒనగూడేదేమీ లేదు. రెండు దేశాలు పరస్పరం ఆధారపడి వాణిజ్య లావాదేవీలు సాగిస్తూ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. అంతేకాదు... అత్యధిక జనాభా ఉన్న దేశాలు కూడా. ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు ఈ రెండు దేశాల్లోనే ఉంది.

అటువంటి రెండు దేశాలు చిన్న సరిహద్దు తగాదా విషయంలో యుద్ధానికి దిగితే? అది ద్వైపాక్షిక వాణిజ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఆర్థికంగా నష్టం ఏస్థాయిలో ఉంటుంది ? ఏ దేశం ఎక్కువగా నష్టపోతుంది? అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ దేశాలు ఏవో కాదు, ఒకటి భారత్‌, మరొకటి చైనా. ఇరుగుపొరుగు దేశాలే అయినా ఏనాడూ సఖ్యత లేని పరిస్థితి.

Amid Sikkim stand-off, Chinese army demonstrates battle-readiness with armoured drill in Tibet

ఒకరంటే మరొకరికి అపనమ్మకం. తన ఆధిపత్యానికి పొరుగుదేశం ఎక్కడ అడ్డుతగులుతుందోననే ఇరు దేశాల మధ్య అనుమానం ఉంది. ఇది భారత్‌- భూటాన్‌- చైనా కూడలిలో తలెత్తిన సరిహద్దు తగాదా యుద్ధం వరకూ వెళ్తుందని ఎవరూ అనుకోవటం లేదు. కానీ పరిస్థితులు చేజారి, ఉద్రిక్తతలు పెరిగి ఇరుపక్షాలూ పట్టుదలకు పోతే యుద్ధం అనివార్యం అవుతుంది. అది రెండు దేశాలకూ ఆర్థికంగా ఎంతో నష్టం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

భారత్ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదురెట్లు అధికం

భారతదేశంతో పోల్చితే చైనా ఆర్థిక వ్యవస్థ అయిదు రెట్లు పెద్దది. దాదాపు 11.5 ట్రిలియన్‌ డాలర్ల చైనా ఆర్థిక వ్యవస్థ ఏటా 6- 7 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఒక ట్రిలియన్‌ డాలర్లంటే భారత కరెన్సీలో 65 లక్షల కోట్ల రూపాయలకు సమానమన్నమాట. చైనా ఎదుగుదలలో ఎగుమతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచంలో ఏమూల ఏదేశంలో చూసినా చైనా వస్తువులు కనిపిస్తాయి.

తయారీ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలే ఆ దేశం అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేశాయి.అగ్రరాజ్యమైన అమెరికాను సవాలు చేయాలని చైనా కలలు కనడానికి గత రెండు దశాబ్దాల కాలంలో ఆ దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగటమే కారణం. ఎలక్ట్రానిక్స్‌, ప్లాస్టిక్స్‌, స్టీలు, బల్క్‌ డ్రగ్స్‌, సోలార్‌ ప్యానెళ్ల తయారీలో ఇప్పట్లో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసే దేశం లేదంటే అతిశయోక్తి కాదు. రక్షణ తయారీ, అంతరిక్ష పరిజ్ఞానం, నిర్మాణ రంగాల్లో ఆ దేశానిది బలమైన ముద్ర. సైన్యంపై చైనా పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోంది.

భారత్‌ది విభిన్నమైన నేపథ్యం

భారతదేశం ప్రత్యేకతలు వేరు. మన దేశ ఆర్థిక వ్యవస్థ 2.5 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమైనా అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏటా ఏడు శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తున్నది మనదేశమే. రెండు దశాబ్దాల క్రితం చైనా ఆర్థిక వ్యవస్థ ఏవిధంగా ఉందో భారతదేశం ఇప్పుడు అలా ఉన్నట్లు స్వల్పకాలంలోనే భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, జపాన్‌ లకు దీటుగా మారుతుందని అంతర్జాతీయ సంస్థలు భావిస్తున్నాయి.
చైనాకు భిన్నంగా దేశీయ వినియోగంపై భారత ఆర్థిక వ్యవస్థ అధికంగా ఆధారపడి ఉంది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మాసూటికల్స్‌, ఆటోమొబైల్‌, దుస్తుల తయారీ, వజ్రాభరణాల తయారీలో భారత్‌ది పైచేయి. జీఎస్‌టీ వంటి సంస్కరణలు, మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో వేగవంతమైన వృద్ధి సాధన దిశగా భారత్ ముందుకు సాగుతోంది.

ఇవీ చైనా నుంచి దిగుమతి

భారతదేశం చైనా నుంచి ఎన్నో రకాలైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. దీంట్లో సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి పిల్లలు ఆడుకునే బొమ్మల వరకూ ఎన్నో ఉంటున్నాయి. బల్క్ ఔషధాల నుంచి ఆర్గానిక్ రసాయనాల వరకు.. మూలధన యంత్ర సామగ్రి నుంచి పట్టు మొదలు మినరల్‌ ఆయిల్స్‌ ఆఖరుకు స్టేషనరీ, ప్లాస్టిక్‌ సామగ్రి, టైర్లు భారత్ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నది.

చైనాకు ఎగుమతి చేస్తున్నవివి:

మనదేశం నుంచి చైనా దిగుమతి చేసుకుంటున్న వాటిలో ముడిపదార్థాలు అధికంగా ఉంటున్నాయి. ఇనుప ఖనిజం, ఫెర్రో అల్లాయ్స్‌, తోలు ఉత్పత్తులు, పత్తి, పెట్రోలియం రిఫైన్డ్‌ ఉత్పత్తులు, గ్రానైట్‌
యాంటీ బయాటిక్స్, క్రిమి సంహారక మందులు తదితరాలను చైనా దిగుమతి చేసుకుంటున్నది.

ఇలా మనకు నష్టం

రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే మనదేశానికి చైనా నుంచి దిగుమతులు నిలిచిపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు నిలిచిపోయి కమ్యునికేషన్ల రంగం ఇబ్బంది పడుతుంది. ప్రపంచ దేశాలన్నీంటికీ ఔషధాలు తయారు చేయగల ఫార్మాసూటికల్‌ పరిశ్రమ మనదేశంలో అభివృద్ధి చెందింది. కానీ ఔషధాల తయారీకి అవసరమైన బల్క్‌ ఔషధాల కోసం ఇక్కడి కంపెనీలు చైనాపై అధికంగా ఆధారపడుతున్నాయి.
అక్కడి నుంచి బల్క్‌ ఔషధాలు రాని పక్షంలో ఔషధాల తయారీ నిలిచిపోతుంది. మనదేశం నుంచి చైనాకు ఇనుప ఖనిజం, ఇతర వస్తువుల ఎగుమతులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ ఎగుమతులు నిలిచిపోయి విదేశీ మారకద్రవ్యాన్ని మనం కోల్పోవలసి వస్తుంది. మరోపక్క భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని చైనా కంపెనీలను చైనా అధికార పత్రిక 'గ్లోబల్‌ టైమ్స్‌' తాజాగా హెచ్చరించింది. యుద్ధ పర్యవసానాల్లో ఇదొకటని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

డ్రాగన్‌కు కలిగే నష్టాలివి

రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల వాస్తవంగా మనదేశం కంటే ఎక్కువగా చైనా నష్టపోతుంది. యుద్ధం వస్తే చైనా వస్తువులు మనదేశానికి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ మేరకు ఎగుమతులను చైనా కోల్పోయినట్లు అవుతుంది. చైనా ఎగుమతుల్లో భారతదేశం వాటా 2- 3 శాతం మాత్రమే. అయినా దాదాపు 46 బిలియన్‌ డాలర్ల నికర ఎగుమతులను కోల్పోవటం అంటే మాటలు కాదు.

చైనా ఆర్థిక వ్యవస్థ మీద అది ఎంతో వ్యతిరేక ప్రభావం చూపుతుంది. యుద్ధ కాంక్ష కంటే ఆర్థికంగా ప్రబలశక్తిగా మారటంపైనే ప్రస్తుతం చైనా పాలకుల దృష్టి ఉంది. క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధిని మళ్లీ పట్టాల మీదకు ఎలా ఎక్కించాలనే దిశగా చైనా పాలకుల కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగటం నష్టం వాటిల్లుతుందన్న సంగతి తెలుసు కనుకే బింకాలు ప్రదర్శిస్తూ ఒత్తిడి రాజకీయాలు సాగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+