యాపిల్ గుత్తాధిపత్యంపై కన్నెర్రజేసిన అగ్రరాజ్యం; అమెరికా ప్రభుత్వం వేసిన దావాలో సంచలనాలు!!
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా గుత్తాధిపత్యం చెలాయిస్తున్న యాపిల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. దిగ్గజ టెక్ కంపెనీ అయిన యాపిల్ పైన అమెరికా ప్రభుత్వం దావా వేసింది. యాపిల్ పైన దావాలో అమెరికా ప్రభుత్వం పలు సంచలన ఆరోపణలు చేసింది.
యాపిల్ తన ఏకపక్ష విధానాలతో, గుత్తాధిపత్యం చలాయిస్తూ పోటీ సంస్థల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తోందని యూఎస్ఏ ప్రభుత్వం ఆరోపించింది. యాపిల్ సంస్థ ధరలను కూడా కృత్రిమంగా పెంచుతున్నట్టు పేర్కొంది. అమెరికాలోని పలు రాష్ట్రాలలో వినియోగదారులకు చౌకైన స్మార్ట్ఫోన్లు, పరికరాలు అందకుండా చేయడం ద్వారా వందల బిలియన్ల డాలర్లను యాపిల్ సంస్థ దోచుకుంది అని ఆరోపణలు చేసింది.

వినియోగదారులపై విపరీతమైన భారాన్ని మోపుతూ iphone చట్ట విరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తుందని అమెరికా న్యాయశాఖ దావా వేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. యాపిల్ ఏకపక్ష ధోరణి, నియంతృత్వ పోకడల వల్ల నూతన ఆవిష్కరణలకు కూడా అవకాశాలు లేకుండా పోతుందని ఆరోపించింది. న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వేసిన ఈ దావాలో 15 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంతకాలు చేశాయి.
అయితే అమెరికా వేసిన దావాపైన స్పందించిన యాపిల్, దావాలో పేర్కొన్న ఆరోపణలను కొట్టివేసింది. ఆ ఆరోపణలు అవాస్తవాలని, ఈ చర్యలతో ప్రభుత్వం ప్రమాదకర సంప్రదాయాన్ని తీసుకువస్తుందని ఆరోపించింది. వీటిని తాము సమర్ధంగా ఎదుర్కొంటామని, ఇలాంటి దావాల కారణంగా యాపిల్ ప్రొడక్ట్స్ మార్కెట్లో నెలకొల్పిన ప్రమాణాలకు ముప్పు వాటిల్లుతుందని అభిప్రాయపడింది.
ప్రజల కోసం రూపొందిస్తున్న సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, దీనిని తాము ఎదుర్కొంటామని యాపిల్ సంస్థ స్పష్టం చేసింది. ఇక తాజాగా అమెరికా ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే వ్యాజ్యాలను ఎదుర్కొంటున్న గూగుల్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, అమెజాన్ వంటి సంస్థల జాబితాలో యాపిల్ కూడా చేరింది. ఇదిలా ఉంటే యాపిల్ సంస్థ పై అమెరికా ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయడంతో వాల్ స్ట్రీట్ లో యాపిల్ షేర్లు 3.75 శాతం వరకు నష్టపోయాయి.












Click it and Unblock the Notifications