తేనెతుట్టె కదిలించిన ట్రంప్: మద్యప్రాచ్యంలో చిచ్చు.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: మధ్యప్రాచ్యంలో మళ్లీ అశాంతి ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడిగా పేరొందిన డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా - ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న చిచ్చును మరింత రెచ్చగొట్టేలా.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ బుధవారం ప్రకటన వెలువరించారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడమనేది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమని ట్రంప్ వ్యాఖ్యానించారు.మూడు దశాబ్దాలకు పైగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య శాంతి చర్చల్లో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా, దాని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు తిలోదకాలిచ్చారు.
ట్రంప్ నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌తోపాటు అరబ్, ముస్లిం, మధ్యప్రాచ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. అమెరికా మిత్రపక్షాలు కూడా దశాబ్దాలుగా అమలు చేస్తున్న విధానానికి భిన్నంగా ట్రంప్ వ్యవహరించారని పేర్కొన్నాయి.

ట్రంప్ నిర్ణయం తేనెతుట్టెను కదపడమే

ట్రంప్ నిర్ణయం తేనెతుట్టెను కదపడమే

జెరూసలెంను పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ఇజ్రాయెల్‌లోని యూదులు, వివిధ దేశాల్లోని క్రైస్తవులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఈ విధంగా మూడు మతస్థులకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఏకపక్షంగా ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటం అంటే.. మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదుపటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటమేగాక, ఇప్పటికే ఆ దేశ రాజధానిగా ఉన్న టెల్‌అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించటానికి కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారని వైట్‌హౌస్ తెలిపింది. ట్రంప్‌ ప్రకటన చేయనున్న దృష్ట్యా.. అరబ్‌ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. జెరూసలెం పాతనగరం, వెస్ట్‌ బ్యాంక్‌లను వదిలి రావాల్సిందిగా తమ ఉద్యోగులను అమెరికా అప్రమత్తం చేసింది.

మామ ట్రంప్ హామీకి అనుగుణంగా అల్లుడు కసరత్తు ఇలా

మామ ట్రంప్ హామీకి అనుగుణంగా అల్లుడు కసరత్తు ఇలా

అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చాలన్న ప్రతిపాదన ఈనాటిది కాదు. 22 ఏళ్లుగా నలుగుతున్న అంశం ఇది. కాకపోతే, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలను మెరుగుపరిచి, సఖ్యత కుదర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో, ఎప్పటికప్పుడు ఈ ప్రతిపాదనను అమెరికా అటకెక్కిస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే ట్రంప్‌ తాను చేపడతానన్న అంశాల్లో ఇదీ ఒకటి. ట్రంప్‌కు సలహదారుగా వ్యవహరిస్తున్న ఆయన అల్లుడు జారెడ్‌ కుష్నేర్‌ ఆరునెలలుగా ఈ వ్యవహారంపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

అటు సౌదీ.. ఇటు ఇరాన్ ప్రతికూల ప్రతిస్పందన

అటు సౌదీ.. ఇటు ఇరాన్ ప్రతికూల ప్రతిస్పందన

1995లో అమెరికా కాంగ్రెస్‌ జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తించింది. వెంటనే అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్‌అవీవ్‌ నుంచి జెరూసలెంకు మార్చాలని సూచించింది. అయితే మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్‌, జార్జి బుష్‌, బారక్ ఒబామా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తూవచ్చారు. దీంతో ఉద్రిక్తతలు ఏర్పడలేదు. కానీ సంచలన నిర్ణయాలకు మారుపేరుగా ఉండే డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. అమెరికా రాయబార కార్యాలయాన్ని మార్చాలని ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడంతో అరబ్‌ ప్రపంచం భగ్గుమంది. ఇస్లామిక్‌ ప్రపంచంలో భిన్నధ్రువాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్‌ అమెరికా చర్యను ఖండించడం గమనార్హం. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించబోమని ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ ప్రకటించారు.

పాలస్తీనా గుర్తించాలన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

పాలస్తీనా గుర్తించాలన్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ

టెలీ అవీవ్ నుంచి జెరూసలేంకు రాయబార కార్యాలయం మార్పిడి ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు పడుతుందని వైట్‌హౌస్‌ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. అయితే ముందుగా రికార్డు చేసిన వీడియోను నెతన్యాహూ కార్యాలయం విడుదల చేసింది. ఇజ్రాయెల్ లక్ష్యంలో ఇది తొలి రోజు అని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తున్నది. అమెరికా నిర్ణయాన్ని మిగతా దేశాలు అనుసరించాలని కూడా నెతన్యాహూ చెప్పేందుకు వెనుకాడలేదు. ఇక జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించాలని పాలస్తీనాతో జరిగే శాంతి చర్చల్లో లేవనెత్తుతామని కూడా అన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.

పాలస్తీనా స్వతసిద్ధ రాజధాని అన్న అబ్బాస్

పాలస్తీనా స్వతసిద్ధ రాజధాని అన్న అబ్బాస్

ట్రంప్ నిర్ణయంతో మధ్య ప్రాచ్యంలో శాంతి ప్రక్రియకు తెరరదించినట్లవుతుందని పాలస్తీనా స్పష్టం చేసింది. జెరూసలేం స్వతసిద్ధంగా తమ దేశ రాజధాని అని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ జారీ చేసిన వీడియో తెలిపింది. చివరిగా పాలస్తీనా - ఇజ్రాయెల్ మధ్య చర్చలు 2014లో నిలిచిపోయాయి. కాగా, ట్రంప్ నిర్ణయంపై పాలస్తీనా సంస్థలు మూడు రోజుల నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. అరబ్ లీగ్ దేశాల విదేశాంగశాఖ మంత్రులు శనివారం అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

13న ఇస్లామిక్ దేశాల ప్రత్యేక సదస్సుకు టర్కీ, ఇరాన్ పిలుపు

13న ఇస్లామిక్ దేశాల ప్రత్యేక సదస్సుకు టర్కీ, ఇరాన్ పిలుపు

ట్రంప్ ఆలోచన ప్రమాదకరమని, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టినట్లవుతుందని అమెరికా మిత్ర దేశం సౌదీ అరేబియా రాజు సల్మాన్ హెచ్చరించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ సిసీ స్పందిస్తూ సమస్య మరింత సంక్లిష్టమవుతుందన్నారు. సౌదీ అరేబియాను వ్యతిరేకించే ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పందిస్తూ ట్రంప్ ప్రణాళిక చాలా ప్రమాదకరమని, పూర్తిగా రెచ్చగొట్టే పొరపాటు నిర్ణయమని అన్నారు. హసన్ రౌహానీతోపాటు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌లతో టర్కీ అధ్యక్షుడు రెసిప్ తాయిప్ ఎర్డోగాన్ మాట్లాడారు. దీనిపై ఈ నెల 13న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ ప్రత్యేక సదస్సు నిర్వహించాలని ఇరాన్, టర్కీ నిర్ణయించాయి. ట్రంప్ బాధ్యతా రాహిత్య నిర్ణయానికి నిదర్శనమని చెప్పారు. మద్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు జెరూసలేం కీలకమని జోర్డాన్ రాజు అబ్దుల్లా టూ స్పష్టం చేశారు.పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ ఐరాస తీర్మానాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ యధాతథ పరిస్థితి కొనసాగించాలని సూచించారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం తెలిపింది.

పాలస్తీనాకే తమ మద్దతని తేల్చేసిన పుతిన్

పాలస్తీనాకే తమ మద్దతని తేల్చేసిన పుతిన్

రష్యా అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ స్పందిస్తూ మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. తాము పాలస్తీనా పక్షమేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ మేరకు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో పుతిన్ ఫోన్‌లో మాట్లాడారు. ఇటువంటి చర్యలు తీసుకోవద్దని ట్రంప్‌నకు ఈయూ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి ఫెడెరికా మోగేరిని సూచించారు. బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ ట్రంప్ నిర్ణయం ఆందోళనకరమన్నారు. పాలస్తీనా - ఇజ్రాయెల్ మధ్య తుది ఒప్పందంలో భాగంగా జెరూసలేం ఉండాలని పేర్కొన్నారు.

ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను సమర్థించమన్న ఫ్రాన్స్

ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను సమర్థించమన్న ఫ్రాన్స్

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ మాట్లాడుతూ ఇది రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్య అని వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష చర్చల ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ - పాలస్తీనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్థవంతమైన చర్చల దిశగా పాలస్తీనా, ఇజ్రాయెల్ ముందుకు వెళ్లేందుకు తన వంతు క్రుషి చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ఫ్రాన్స్ ఎంతమాత్రం సమర్థించదని తేల్చి చెప్పారు. ఇది ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని అల్జీర్స్‌లో మీడియాతో చెప్పారు. ట్రంప్ తీరు విచారకరమని వ్యాఖ్యానించారు. జర్మనీ మరో అడుగు ముందుకేసి ఇది రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదమని ఆ ప్రాతిపదికనే పరిష్కరించాల్సి ఉన్నదని స్పష్టం చేసింది.

జెరూసలేంతో ఏసుక్రీస్తుకు ఇలా సంబంధం

జెరూసలేంతో ఏసుక్రీస్తుకు ఇలా సంబంధం


జెరూసలెం మూడు మతాలకూ పవిత్ర స్థలం. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు ఈ నగరాన్ని పవిత్రంగా భావిస్తారు. మూడు మతాలకు చెందిన వారు జెరూసలెం తీర్థయాత్ర కూడా చేస్తారు. ఇక్కడి పాత నగరం నాలుగు మతాలకు కీలక ప్రాంతంగా నిలిచింది. క్రిస్టియన్లు, ఆర్మేనియన్లు ఓ ప్రాంతంలో ఉంటారు. ఇంకో ప్రాంతంలో ముస్లింలు, మరో ప్రాంతంలో యూదులు ఉంటారు. ఇక్కడ క్రైస్తవ మఠం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. జెరూసలెంలోని హోలీ సిపల్చర్‌ చర్చిని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పవిత్రంగా భావిస్తారు. ఈ చర్చికి జీసెస్‌తో సంబంధం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడే క్రీస్తుకు శిలువ వేశారని చెబుతారు. చర్చిలోని క్రీస్తు సమాధిని సందర్శించేందుకు లక్షల మంది క్రిస్టియన్లు ప్రతి ఏడాది ఇక్కడకు వస్తుంటారు.

ఇజ్రాయెల్, అరబ్బుల మధ్య ఇలా జెరూసలేం

ఇజ్రాయెల్, అరబ్బుల మధ్య ఇలా జెరూసలేం

శతాబ్దాలుగా జెరూసలెం ఇస్లాం, క్రైస్తవం, యూదుమతాలకు పవిత్రస్థలంగా ఉంది. 1948లో బ్రిటిష్ వలస పాలకులు వెళ్లి పోయిన తర్వాత జెరూసలెంపై అరబ్బులకు, యూదులకు మధ్య వివాదం ఏర్పడింది. నగరంలోని పశ్చిమప్రాంతాన్ని ఇజ్రాయెల్‌, తూర్పు ప్రాంతాన్ని అరబ్బులు స్వాధీనం చేసుకున్నారు. 1967లో జరిగిన యుద్ధంలో తూర్పుప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకోవడంతో అశాంతికి కారణమైంది. వాస్తవానికి పాలస్తీనా ప్రజలు తూర్పు ప్రాంతంలో నివసిస్తున్నా వారికి ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ఓటు వేసే హక్కులేదు. మూడు వేల సంవత్సరాల నుంచి యూదులకు ఈ నగరం రాజధానిగా ఉందని ఇజ్రాయెల్‌ వాదన, అయితే భవిష్యత్‌లో ఏర్పడే పాలస్తీనా దేశానికి అరబ్బులు ఎక్కువగా ఉన్న నగరంలోని తూర్పు ప్రాంతం రాజధానిగా ఉండాలన్నది పాలస్తీనా అభిప్రాయం. దీంతో ఈ నగరం రెండు జాతుల మధ్య ఘర్షణకు కేంద్రంగా మారింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
LONDON: Arabs and Muslims across the Middle East on Wednesday condemned the U.S. recognition of Jerusalem as Israel's capital as an incendiary move in a volatile region and Palestinians said Washington was ditching its leading role as a peace mediator.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X