కమలా హ్యారిస్ నివాసం వద్ద ఆగంతకుడి కలకలం .. ఆయుధాలతో పట్టుబడ్డ వ్యక్తి
అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ నివాసం వద్ద కలకలం రేగింది. ఆయుధాలతో తిరుగుతున్న వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని టెక్సాస్ లోని శాన్ ఆంటోనియో కు చెందిన 31 సంవత్సరాల పాల్ ముర్రే గా గుర్తించినట్టు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఆయుధాలతో పాల్ ముర్రే .. అరెస్ట్ చేసిన డీసీ పోలీసులు
వాషింగ్టన్ డీసీ లోని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలహాసన్ నివాసం వద్ద ఆయుధాలతో పాల్ ముర్రే అనుమానాస్పదంగా సంచరించడంతో అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యూఎస్ సీక్రెట్ సర్వీస్ నుండి పొందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అనుమానాస్పదంగా తిరుగుతున్న పాల్ ముర్రే ను అరెస్ట్ చేయడంతో పాటుగా, అతని వాహనంలో ఒక రైఫిల్, పేలుడు పదార్థాలను గుర్తించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వాషింగ్టన్ డిసిలోని కమలా హ్యారిస్ అధికారిక నివాసంలో ప్రస్తుతం ఆమె నివసించడం లేదు. ఆ భవనం ప్రస్తుతం మోడిఫికేషన్ చేస్తున్నారు. అయితే అధికారిక నివాసం వద్ద ప్రమాదకర ఆయుధాలతో వ్యక్తి సంచరించిన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని సీక్రెట్ సర్వీస్ ను కమల హ్యారిస్ అధికార ప్రతినిధి ఆదేశించారు.
ప్రస్తుతం ఆయుధాలతో పట్టుబడిన ముర్రేపై ప్రమాదకరమైన ఆయుధాలను తీసుకు వెళ్లడం అనుమతి లేకుండా రైస్ లేదా షాట్ గన్ ను, పేలుడు పదార్థాలను తీసుకెళ్లాడని ఆరోపణ, అలాగే కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నట్లుగా డీసీ పోలీసులు తెలిపారు.

ఆగంతకుడి కలకలం పై ట్వీట్ చేసిన ఫాక్స్ న్యూస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా, భారత మూలాలున్న కమలా హ్యారిస్ , ఉపాధ్యక్షురాలు బాధ్యతలు చేపట్టిన తొలి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యంత్రాంగంలో కమల హ్యారిస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితాలో శక్తివంతమైన మహిళగా కూడా స్థానం సంపాదించుకున్నారు. వాషింగ్టన్ యొక్క ఫాక్స్ న్యూస్ ఆగంతకుడి కలకలం పై ఆసక్తికర ట్వీట్ చేసింది. ముర్రే మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడని, మతిమరుపు ఉన్న వ్యక్తి అని ట్వీట్ చేసింది. అతను తన తల్లికి ప్రభుత్వం తమను తనను చంపాలని చూస్తుందని మొబైల్ ఫోన్ ద్వారా సందేశాన్ని పంపాడు. తాను వాషింగ్టన్ లో ఉన్నట్లుగా, సమస్యలో ఉన్నట్లుగా కూడా తెలిపాడని ఫాక్స్ న్యూస్ పేర్కొంది.